Leopard In Rajamahendravaram: రాజమండ్రి శివారు ప్రాంత ప్రజలను తీవ్ర కలవరానికి గురి చేసిన చిరుతపులి ఆ ప్రాంతాన్ని వీడి రాజమండ్రి రూరల్‌ కడియం మండలం వైపు వచ్చినట్లు అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. పాదముద్రలు ఆధారంగా పులి సంచారం నిర్ధారించిన అధికారులు అక్కడి ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇప్పటికే చిరుతపులి పగ్‌ మార్కులు కనిపించిన నర్సరీల పరిసర ప్రాంతాల్లో ట్రాప్‌ కెమెరాలను ఏర్పాటు చేశారు. అదే విధంగా ఈ పరిసర ప్రాంతాల్లో ట్రాప్‌ కేజ్‌లు (బోన్లు) ఏర్పాటు చేస్తున్నారు. అయితే కడియపులంక పరిసర ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నర్సరీల్లో మొక్కలు ఎగుమతులకు సెలవు ప్రకటించగా.. గురువారం కడియపులంక నర్సరీల్లో మొక్కల ఎగుమతులకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. 


'ప్రజలు సహకరించాలి'


పగ్‌ మార్కుల ఆధారంగా చిరుతపులిని ట్రాక్‌ చేస్తున్నట్లు డీఎఫ్‌వో ఎస్‌.భరణి తెలిపారు. నర్సరీల అసోసియేషన్‌తో ఇప్పటికే సమావేశం నిర్వహించామని.. నర్సరీల నిర్వాహకులకు చిరుతపులి పగ్‌ మార్కులు ఏ విధంగా ఉంటాయి.? వంటి అంశాలపై అవగాహన కల్పించినట్లు చెప్పారు. చిరుతపులిని పట్టుకునేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. పగ్‌ మార్కులు ఆధారంగా దాని కదలికలను ట్రాక్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అయితే అక్కడ జన సందోహం చేరితే మాత్రం పగ్‌ మార్కులు గుర్తించలేమన్నారు. నర్సరీ ప్రాంతాల్లో దట్టమైన చెట్లు పొదలు లేకపోవడం వల్ల థర్మల్‌ డ్రోన్లు సాయంతో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. చిరుతపులి ప్రస్తుతం జన సంచారం ఉన్న చోటే ఉన్నందున ప్రజలను మరింత అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు. 


కోనసీమకు చేరువలో..


రాజమండ్రి రూరల్‌ ప్రాంతం నుంచి మండపేట మీదుగా అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ప్రాంతంలోకి చిరుతపులి అడుగుపెట్టే అవకాశం ఉందని.. ఒకవేళ అదే జరిగితే అప్రమత్తంగా ఉన్నట్లు కోనసీమ జిల్లా డీఎఫ్‌వో ప్రసాదరావు తెలిపారు. చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశామన్నారు. ప్రస్తుతం అయితే చిరుతపులి కడియం మండల పరిధిలోనే రెండు మూడు నర్సరీలలోనే ఉన్నట్లు గుర్తించామన్నారు. 


'అసత్యాలు ప్రచారం చెయ్యొద్దు'


చిరుతపులిని పట్టుకునేందుకు సుశిక్షితులైన వెటర్నరీ వైద్యులు, కావాల్సిన పరికరాలు అందుబాటులోనే ఉన్నాయని డీఎఫ్‌వో భరణి తెలిపారు. ఫ్లడ్‌ వచ్చినప్పుడు ఏదో ఒక లంక మీదుగానే ఇక్కడికి వచ్చి ఉండవచ్చని చెప్పారు. అది వచ్చిన మార్గంలోనే వెళ్లాలని లేదన్నారు. ఇదిలా ఉంటే అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా డీఎఫ్‌వో ప్రసాదరావు మాట్లాడుతూ.. ప్రస్తుతం తూర్పుగోదావరి, కోనసీమ జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించామని, అయితే మండపేటకు సమీపంలో ఉన్న నర్సరీల యజమానులతో కూడా మాట్లాడామని, ప్రజల సహకారం అందివ్వడం వల్ల చిరుతపులిని సాధ్యమైనంత వరకు సురక్షితంగా పట్టుకోగలమని తెలిపారు. ముఖ్యంగా చిరుతపులిని ఇరిటేట్‌ చేసేందుకు ప్రయత్నించవద్దని, దాని వల్ల అది మనుషులపై దాడి చేసే అవకాశం ఉందని, సోషల్‌మీడియాలో సెన్సేషనల్స్‌ కోసం అసత్యాలను ప్రచారం చేయవద్దని సూచించారు.


Also Read: Occult Worship: నడిరోడ్డుపై వింత ఆకారం - దగ్గరకు వెళ్లి చూస్తే భయం భయం, క్షుద్రపూజల కలకలం!