Andhra Pradesh: ప్రత్యర్థి పార్టీ చేసిన తప్పులకు పరిహారం, ప్రాయశ్చిత్తం తామే చేస్తామంటూ వింత వాదన చేస్తున్నాయి ఏపీలో ఉన్న రాజకీయ పార్టీలు. వైసిపి తప్పులు చేసిందని జనసేన ప్రాయశ్చిత్తం చేస్తుంది. టిడిపి అన్యాయాలు చేసిందని  వైసిపి, జగన్ పరిహారాలు, పూజలు చేస్తున్నారు. దేశంలో మరెక్కడా కనిపించని పోకడగా విశ్లేషిస్తున్నాయి దేశంలోని ఇతర రాజకీయ పార్టీలు.


 వైసిపి తప్పులకు పవన్ ప్రాయశ్చిత్త దీక్ష 
టీటీడీ తయారు చేసే లడ్డు ప్రసాదంలో జగన్ హయాంలో కల్తీనెయ్యి వాడారనే ఆరోపణ చాలా తీవ్రంగా ప్రజల్లో పాకిపోయింది. ఎందుకంటే ఈ ఆరోపణ చేసింది స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి. దీనిపై ఒకవైపు దర్యాప్తు జరుగుతుందని సీఎం చెబుతుంటే ఉపముఖ్యమంత్రి పవన్ మాత్రం తిరుమల పట్ల ఘోర అపచారం జరిగిపోయిందని అందుకనే తాను ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నానని ప్రకటించారు. గత కొన్ని రోజులుగా ఆ దీక్ష అవతారంలోనే ఆయన కనిపిస్తున్నారు. ఉపముఖ్యమంత్రి హోదాలో కల్తీ నెయ్యి వివాదంపై విచారణ జరపడం మాని ఈ ప్రాయశ్చిత్త దీక్షలు ఏంటని ఎవరైనా ప్రశ్నిస్తే పవన్ తీవ్ర ఆగ్రహంతో వారినే తప్పు పడుతున్నారు. ఆయన్ను చూసిన మిగిలిన కూటమి నేతలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆ తరహా దీక్షలు మొదలుపెట్టారు. వేరే పార్టీ చేసిందని చెబుతున్న పాపాలకు అధికారంలో ఉన్న మరో పార్టీ ప్రాయశ్చిత్తం చేసుకోవడం అనేది ప్రస్తుత రాజకీయాల్లో వింతగా మారింది.


జనసేనకు టీడీపీ అన్యాయం చేసిందని వైసీపీ విచారం
ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి 20 నామినేటెడ్ పోస్టులను ప్రకటించింది. దీనిలో అధిక భాగం టిడిపి, జనసేన మూడు, బిజెపి ఒక పోస్ట్ పంచుకున్నాయి. ఈ పంపకంపై జనసేనగాని బిజేపీగాని ఇంతవరకు ఎలాంటి అసంతృప్తి వ్యక్తం చేయలేదు. కానీ వీరందరి ప్రత్యర్థి పార్టీ అయిన వైసిపి పరోక్షంగా బాధపడిపోతుంది. వైసీపీకి మౌత్‌పీస్‌గా ఉండే మీడియాలో బిజెపి, జనసేనకు అన్యాయం జరిగిందంటూ కథనాలు వచ్చాయి. 20 పదవుల్లో 16 పోస్టులను టిడిపి తీసేసుకుందని వాపోయింది. అసలు కూటమికి సంబంధించిన అంతర్గత వ్యవహారంపై ప్రత్యర్థులకు ఏంటి సంబంధం అంటే దానికి సమాధానం లేదు.


జగన్ వల్ల అపవిత్రం జరిగింది - తిరుమల కొండకు వెళ్తా అంటున్న చంద్రబాబు 
జగన్మోహన్ రెడ్డి హయాంలో తిరుమలలో చాలా అపవిత్రాలు జరిగాయి, లడ్డూలలో సైతం జంతు కొవ్వు కలిసింది అంటున్నారు చంద్రబాబు. అందుకే వచ్చేనెల ఒకటి రెండు తారీఖుల్లో తిరుమల వెళ్లి మరీ ప్రత్యేక పూజలు చేస్తానంటున్నారు ఏపీ ముఖ్యమంత్రి. ఆయనతోపాటు ఉపముఖ్యమంత్రి పవన్ కూడా తిరుమలలో పూజలు చేయనున్నారు. 


టిడిపి పాపం చేసింది - రాష్ట్రంలో పూజలు చేయండి : వైఎస్ జగన్ 
ఈ పాప పరిహార పూజల్లో తానూ ఉన్నానంటున్నారు ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిందంటూ టిడిపి దుష్ప్రచారం చేస్తోందని ఇంత పెద్ద అబద్ధం చెప్పినందుకు పరిహారంగా వైసిపి నేతలు రాష్ట్రవ్యాప్తంగా పూజల జరపాలని ఆయన ఆదేశించారు.  తాను కూడా ఈనెల 28న తిరుమల వెళ్లి పూజలు చేస్తానని ప్రకటించారు. ఇలా ప్రత్యర్థి పార్టీలు పాపాలు చేశాయని చెబుతున్న పొలిటికల్ పార్టీలు వాటికి పరిహారంగా తాము ప్రాయశ్చిత్త దీక్షలు,పూజలు చేయడం ఏంటో అర్థం కాక తెలుగు జనాలు తెగ చర్చించేసుకుంటున్నారు.


ప్రజలు కోరుకునేది ఇది కాదు 
 పాపాలకు పరిహారం చేయడాలు, ప్రాయశ్చిత్త దీక్షలు పాటించడాలు ధార్మిక సంస్థలకు, ఆధ్యాత్మికవేత్తలకు సరిపోతాయి గాని రాజ్యాంగబద్ధంగా పాలన అందించడానికో లేక ప్రజాస్వామ్య రక్షణకు అండగా ప్రతిపక్ష పాత్ర పోషించడానికో ఏర్పడిన రాజకీయ పార్టీలకు ఈ తరహా మెలోడీ డ్రామాలు సరిపడవు అనేది సామాన్యుల వెర్షన్. ఒక్కసారి సోషల్ మీడియాలో కామెంట్స్ చూస్తే అర్థం అయిపోతుంది వీటిపై జనం ఏమనుకుంటున్నారో. ఒకవేళ ఆధ్యాత్మిక అంశాల్లో సైతం ఎవరైనా తప్పు చేస్తే సరైన విధంగా దర్యాప్తు జరిపి చట్టం ఆధారంగా శిక్షపడేలా చేయాలి గానీ ఇలా పాలకులూ, ప్రతిపక్షాలు ప్రజల నమ్మకాల ఆధారంగా రాజకీయాలు చేయాలని చూడడం సరికాదన్న సామాన్య జనం నుంచి వినబడుతోంది.


Also Read: టీడీపీలోకి విజయసాయి? మంత్రి అచ్చెన్నాయుడి వ్యాఖ్యలపై స్పందించిన ఎంపీ