Andhra Pradesh: బాలినేని శ్రీనివాస రెడ్డి (Balineni Srinivasa Reddy) అనుకున్నది ఒకటి, అయింది మరొకటి అన్నట్టుగా సాగుతోంది ఒంగోలు రాజకీయం. వైసీపీకి గుడ్ బై చెప్పిన బాలినేని శ్రీనివాసులరెడ్డి భారీ బలప్రదర్శనతో జనసేన(Janasena)లో చేరాలనుకున్నారు. తాను కండువా వేయించుకోడానికి పవన్ దగ్గరకు వెళ్లడం కాదు, పవనే తనకు కండువా వేసేందుకు ఒంగోలు(Ongole) రావాలని కోరుకున్నారు. కానీ చివరకు ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. కనీసం మంగళగిరి వరకు తన అనుచరులతో ర్యాలీగా వెళ్లి పెద్ద ఎత్తున చేరికల కార్యక్రమం నిర్వహించేందుకైనా అనుమతివ్వాలని కోరారు. అదీ కుదరదంది జనసేన అధిష్టానం. దీంతో బాలినేని ఒక్కరే ఒంటరిగా మంగళగిరి వెళ్తున్నారు. జనసేన కండువా మెడలో వేసుకోబోతున్నారు. ఈమేరకు బాలినేనితో జనసేన పార్టీ నేత వేములపాటి అజయ్ కుమార్ ఒంగోలులో చర్చలు జరిపారు. బాలినేని ఒక్కరే మంగళగిరి వెళ్లేందుకు ఒప్పించారు.
హడావిడి వద్దు..
బాలినేని వంటి సీనియర్ నేత, మాజీ మంత్రి చేరిక ప్రకాశం జిల్లాలో జనసేనకు బలమే. కానీ అది అనూహ్యంగా జరిగిన పరిణామం. బాలినేనికి వైసీపీలో కొనసాగడం ఇష్టం లేదు, అదే సమయంలో ఆయనకు టీడీపీలో చోటు లేదు, ఆ దిశగా ప్రయత్నాలు జరిగినా టీడీపీ నేతలు ఆయన రాకను అడ్డుకున్నారు. ఓ దశలో తనపై ఉన్నవి లేనివి టీడీపీ అధిష్టానానికి కొంతమంది చాడీలు చెప్పారని కూడా బాలినేని సన్నిహితుల వద్ద వాపోయారు. చివరిగా ఆయన జనసేనను ఎంపిక చేసుకున్నారు. అయితే కాస్త ముందుగానే దీనికి సంబంధించి లీకులు వదిలారు బాలినేని. అంతా తాను అనుకున్నట్టుగానే సీన్ క్రియేట్ చేసి, వైసీపీ తనను నమ్మడం లేదని, తనపై తప్పుడు ప్రచారం చేస్తుందనే నిందలు వేసి బాలినేని జనసేనకు దగ్గరయ్యారు. ఆల్రడీ ఓసారి పవన్ ని కలసి వచ్చారు. కండువా పండగకు మాత్రం ఈరోజు ముహూర్తం ఖరారు చేసుకున్నారు.
టీడీపీ వర్శెస్ బాలినేని
బాలినేని జనసేనలో చేరడం ఖాయమైన తర్వాత ఒంగోలులో ఆయన అనుచరులు భారీ ఫ్లెక్సీలు వేశారు. ఈ ఫ్లెక్సీలను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. ఎవరో అనడం కంటే.. టీడీపీ నేతలు, స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అనుచరులే అని కచ్చితంగా చెప్పుకోవచ్చు. బాలినేని కూటమిలోకి రావడం ఆయన ప్రత్యర్థి దామచర్లకు ఇష్టం లేదు. తాజా ఎన్నికల్లో ఒంగోలులో దామచర్ల, బాలినేని మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఆ పోరులో దామచర్ల జనార్దన్ గెలుపొందారు. తన ప్రత్యర్థి అయిన బాలినేని తిరిగి కూటమిలోకి రావడం, మిత్రపక్షమైన జనసేనలో చేరడం ఆయనకు ఇష్టం లేదు. బాలినేని పార్టీ మారినా గత పాపాల నుంచి తప్పించుకోలేరంటూ ఆయన ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి బాలినేని కూడా కౌంటర్ ఇచ్చారు. తాను ఏ పార్టీలో ఉన్నా, అన్యాయాన్ని ప్రశ్నించడం మాత్రం మానుకోను అని తేల్చి చెప్పారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం మొదలైంది.
ఇక ఫ్లెక్సీల గొడవపై బాలినేని ఏకంగా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం విశేషం. నగరంలో ఏర్పాటు చేసిన తన ఫ్లెక్సీలను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చించేశారని ఆయన ఆరోపించారు. వారిని గుర్తించి శిక్షించాలని ఎస్పీకి కంప్లయింట్ ఇచ్చారు.
ఓ వైపు బాలినేని, దామచర్ల మధ్య ఆధిపత్య పోరు జరుగుతుంటే, మరోవైపు పార్టీ అధిష్టానాలు శాంతిమంత్రం పఠిస్తున్నాయి. గొడవలు మరింత ముదరకుండా బాలినేని చేరికకు హైప్ ఇవ్వకుండా ఉండాలనుకుంటోంది జనసేన అధిష్టానం. అందుకే ర్యాలీలు వద్దు, ఒంగోలులో చేరికల ప్రోగ్రామ్ అసలే వద్దు అని పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు. ఈరోజు బాలినేని ఒక్కరే హడావిడి లేకుండా మంగళగిరి కార్యాలయంలో జనసేనలో చేరతారు.
Also Read: వైసీపీకి కలసిరాని నెల్లూరు కార్పొరేషన్, గెలుపు సంబరం మూణ్ణాళ్ల ముచ్చటే