Why is Prakash Raj provoking Pawan Kalyan : జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ .. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసి హఠాత్తుగా ట్వీట్లు చేస్తున్నారు. ఓ ట్వీట్‌కు సంబంధించి పవన్ ఆగ్రహంగా స్పందించడంతో తాను విదేశాల్లో ఉన్నానని వచ్చిన తర్వాత స్పందిస్తానన్నారు. మళ్లీ ఒక్క రోజులోనే హీరో కార్తీ అంశంపై స్పందించారు. తప్పులేకపోయినా సారీ చెప్పించుకున్నారని మండిపడ్డారు. పవన్ ను రెచ్చగొట్టేందుకు ప్రకాష్ రాజ్ ప్రయత్నిస్తున్నారని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకిలా చేస్తున్నారు. ఆయన వెనుక వైసీపీ ఉందా ?
హిందూత్వ వాదానికి వ్యతిరేకంగా ప్రకాష్ రాజ్ భావజాలం
కారణం ఏదైనా ప్రకాష్ రాజ్ జస్ట్ ఆస్కింగ్ పేరుతో బీజేపీని.. బీజేపీ హిందూత్వ విధానాల్ని విమర్శిస్తూ ఉంటారు. బీజేపీతో చాలా లొల్లి పెట్టుకున్నారు కూడా. చివరికి ఆయన బెంగళూరు నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఆయనకు కనీస ఓట్లు రాలేదు. అంటే జనం ఎవరూ పట్టించుకోలేదు. ఆ తర్వాత ఎన్నికల రాజకయాల వైపు రాలేదు కానీ.. బీజేపీని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. కానీ తెలంగాణలో బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉంటూ వచ్చారు. కొంత కాలంగా రాజకీయాలపై పెద్దగా మాట్లాడటం లేదు. హఠాత్తుగా పవన్ కల్యాణ్ చేసిన సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అంశంపై స్పందించారు. పవన్ ను విమర్శించారు. దానికి పవన్ రిప్లయ్ ఇచ్చారు. దీనిపై 30వ తేదీ తర్వాత మరింత విపులంగా స్పందిస్తానని ఆయన అంటున్నారు. పవన్ తన వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన అంటున్నారు.
మళ్లీ హఠాత్తుగా కార్తీ అంశంతో ట్వీట్
పవన్ కల్యాణ్ ప్రకాష్ రాజ్ తో పాటు కార్తీని కూడా విమర్శించారు. అక్కడ మిస్ అండస్టాండింగ్ జరిగిందని పవన్ కూడా పరోక్షంగా అంగీకిరంచారు. కార్తీకి కొత్త సినిమా విషయంలో బెస్ట్ విషెష్ చెప్పారు. అంతటితో ఇద్దరి మధ్య గుడ్ గెస్చర్‌తో కథ సమాప్తం అయింది. కానీ దీన్ని ప్రకాష్ రాజ్ మళ్లీ రేపే ప్రయత్నం చేశారు. కారణం లేకపోయినా సారీ చెప్పించుకున్నారని .. ఆయన ట్వీట్ చేశారు. సహజంగానే ఇది రెచ్చగొట్టడం అవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రకాష్ రాజ్‌కు అంత అవసరం ఏమిటి ?
Also Read: వైసీపీ హయాంలో కల్తీ నెయ్యి గుర్తించి పలుమార్లు వెనక్కి పంపించాం - కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
వివాదాలను ఇష్టపడుతున్నారా.. వైసీపీకి మద్దతుగా వస్తున్నారా ?
ప్రకాష్ రాజ్ సహజంగా వివాదాలను ఇష్టపడతారు. వార్తల్లో ఉండాలనుకుంటారు. అందుకే పవన్ విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. నిజానికి మెగా కుటుంబంతో ప్రకాష్ రాజ్ సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పోటీ చేసినప్పుడు నాగబాబు ఎంతో శ్రమించారు. కానీ ఆయన వివాదాస్పద వైఖరి కారణంగానే ఓటమి ఎదురయింది. ఇప్పుడు ఆ మంచి సంబంధాలను కూడా గుర్తుంచుకోకుండా.. ఏపీ రాజకీయాల్లో ఆయన వేలు పెట్టే ప్రయ్తనం చేస్తున్నారు. దీని వెనుక వైసీపీ ఉండి ఉంటుందని ఎక్కువ మంది నమ్ముతున్నారు. ప్రకాష్ రాజ్ కు ఏపీతో అసలు సంబంధంలేదు. ఆయన పూర్తిగా కన్నడిగుడు. ఆయనకు అసలు ఇక్కడి రాజకీయాల్లో వేలు పెట్టి పవన్ ను టార్గెట్ చేసే ప్రయత్నం చేయడం వెనుక ఖచ్చితంగా ఎజెండా ఉందని ఎక్కువ మంది నమ్ముతారు.