Occult Worship In Satyasai District: నడి రోడ్డుపై రెండు అడుగుల ఎత్తులో మట్టితో చేసిన ఓ బొమ్మ. దాని ముందు పసుపు, కుంకుమ, రక్తంతో గీసిన గీతలు, కోసిన నిమ్మకాయలు. వాటికి రక్తపు చారలు. దూరం నుంచి చూసిన వాహనదారులకు ఏదో వింత ఆకారం అక్కడ కూర్చున్నట్లు కనిపించింది. తీరా దగ్గరకు వెళ్లి చూస్తే ఒక్కసారిగా భయానక రూపాన్ని చూసి ఆందోళనతో పరుగులు తీశారు. సత్యసాయి జిల్లా (Satyasai District) హిందూపురం నియోజకవర్గంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. లేపాక్షి (Lepakshi) మండలం పోలమతి గ్రామానికి వెళ్లే రహదారిలో గురువారం అటుగా వెళ్తున్న వాహనదారులకు కనిపించిన భయానక దృశ్యాలు ఇవి. నడిదారిలో బొమ్మకు భయంకరమైన వికృత రూపాన్ని ఇచ్చి క్షుద్రపూజలు చేసినట్లు స్పష్టంగా కనిపించింది. అర్ధరాత్రి పూట జన సంచారం లేని సమయంలో ఈ పూజలు చేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అదే కారణమా.?
రహదారిపై క్షుద్రపూజలు చేయడంతో ఆందోళనకు గురైన వాహనదారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షుద్రపూజలు ఎవరు చేశారనే దానిపై విచారణ చేస్తున్నారు. గతంలోనూ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో పదుల సంఖ్యలో ఇలాంటి క్షుద్రపూజలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. కొంతమంది గుప్త నిధుల కోసం ఇలాంటి పనులు చేశారా.? లేక ఎవరైనా చేతబడులు చేస్తున్నారా.? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ భయంకరమైన క్షుద్ర పూజలో రక్తపు మడుగులు, వందల సంఖ్యలో నిమ్మకాయలు కోసి ఉండడంతో వాహనదారులు, గ్రామస్తులు మరింత భయాందోళనకు గురవుతున్నారు.
పలుమార్లు రహదారిలో ప్రమాదాలు జరుగుతూ ఉండేవని స్థానికులు చెబుతున్నారు. వారం రోజుల క్రితం ఆ దారిలో ఓ ద్విచక్ర వాహనం ప్రమాదానికి గురై.. ఓ వ్యక్తి గాయాలపాలు కాగా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సదరు వ్యక్తి తొందరగా కోలుకోవాలని కర్ణాటక నుంచి ఓ స్వామీజీని పిలుచుకువచ్చి అర్ధరాత్రి సమయంలో ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఇలా క్షుద్రపూజలు చేశారని పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది. రోజురోజుకూ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్నా.. ఇలాంటి మూఢ నమ్మకాలను నమ్మే పరిస్థితి ఇంకా ఉందని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మూఢనమ్మకాలపై మార్పు రావడం లేదని అంటున్నారు.