Floods In Vijayawada: విజయవాడలో (Vijayawada) మళ్లీ వర్షం ప్రారంభం కావడంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. అర్ధరాత్రి నుంచి ఉరుములు, మెరుపులతో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అటు, నగరంలోని పలు కాలనీలు ఇప్పుడిప్పుడే ముంపు నుంచి కాస్త బయటపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది పలు చోట్ల బురదను తొలగిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 113 ఫైరింజన్లు విజయవాడ చేరుకున్నాయి. ఇప్పటికే ఇళ్లల్లో చేరిన మట్టి, బురదను 50 ఫైరింజన్ల ద్వారా సిబ్బంది తొలగిస్తున్నారు. నగరంలోని మొత్తం 32 డివిజన్లలో పలు ప్రాంతాలు ముంపునకు గురైనట్లు అధికారులు గుర్తించారు. వరద పూర్తిగా తగ్గిన ప్రాంతాల్లో ఇళ్లు, రోడ్లు, షాపులు శుభ్రం చేసే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. అటు, బుడమేరుకు మళ్లీ వరద అంటూ వస్తోన్న పుకార్లు నమ్మొద్దని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన తెలిపారు. సమీప ప్రాంత ప్రజలకు ఎలాంటి ప్రమాదం లేదని.. బుడమేరులో ప్రమాదకర స్థాయిలో నీళ్లు లేవని.. ఒకవేళ వరద వస్తే సమాచారం ఇస్తామని స్పష్టం చేశారు.


30 ఏళ్ల చరిత్రలో..


అటు, బుడమేరు ఉగ్రరూపంతో నందివాడ మండలంలో 8 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. 30 ఏళ్ల చరిత్రలో బుడమేరు ఇలా ఊళ్లను ముంచేయడం ఇదే తొలిసారని బాధితులు చెబుతున్నారు. ఇళ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గండ్లు పడకుండా పలు గ్రామాల రైతులు, స్థానికులు నిద్రాహారాలు మాని పహారా కాస్తున్నారు. అధికారులు బాధితులను పడవలు, ట్రాక్టర్లు, బస్సుల్లో గుడివాడ ఇతర ప్రాంతాల్లోని పునరావాస కేంద్రాలకు తరలించారు. చాలా గ్రామాల్లో మోకాలి లోతున కొన్నిచోట్ల నడుము లోతు నీరు చేరింది. చుట్టుపక్కల చేపల చెరువులే ఉండడంతో వరదకు గండ్లు పడితే ఏం జరుగుతుందోననే ఆందోళన నెలకొంది. మరోవైపు, అర్ధరాత్రి భారీ వర్షం, ఉద్ధృతంగా గాలి వీస్తున్నా జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గండ్ల పూడిక పనుల్లో నిమగ్నమయ్యారు. ఒంటిగంట నుంచి తెల్లవారుజాము వరకూ పనులకు ఆటంకం లేకుండా జోరు వానలోనే తడుస్తూ దగ్గరుండి మరీ పనులు పర్యవేక్షించారు. అటు, కలెక్టర్ బాలాజీ, ఎస్పీ గంగాధర్ వరద ప్రాంతాలను సందర్శించి పరిస్థితి సమీక్షించారు. పునరావాస కేంద్రాల్లో బాధితులకు ఆహారం, తాగునీరు అందేలా చర్యలు చేపట్టారు. ప్రభావిత గ్రామాలకు కలెక్టర్ ప్రత్యేకాధికారులను నియమించారు.


'ఆ నీటిని తాగొద్దు'


కాగా, వరద ప్రభావిత ప్రాంతాల్లో పైప్ లైన్ ద్వారా సరఫరా చేస్తోన్న నీటిని తాగడానికి వాడొద్దని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సూచించారు. ప్రజలందరికీ తాగునీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నామని చెప్పారు. అటు, పునరావాస కేంద్రాల్లో బాధితులకు సిబ్బంది ఆహారం అందిస్తున్నారు. నగరంలోని 32 డివిజన్లతో పాటు సమీప 5 గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసిన అధికారులు.. ఇక్కడ మెడిసిన్స్ అందుబాటులో ఉంచారు. అటు, విజయవాడ అజిత్‌సింగ్ నగర్ నుంచి ఆర్టీసీ ఉచిత బస్సులు అందుబాటులో ఉంచారు. ఇక్కడి నుంచి విజయవాడలోని పలు ప్రాంతాలకు 6 బస్సులు వెళ్తున్నాయి.


Also Read: Rains In Godavari:ఉభయగోదావరి జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షం- లోతట్టు ప్రాంతాలు జలమయం