Weather In Andhra Pradesh : బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి.. మంగళవారం రాత్రి నుంచి ఏకధాటిన కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో పలు కాలనీలు ముంపుకు గురయ్యాయి.. తూర్పుగోదావరి, కాకినాడ, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలతోపాటు పశ్చిమగోదావరి జిల్లాలో స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వ ఆదేశాలతో ఆయా జిల్లా కలెక్టర్లు సెలవు ప్రకటించారు. అల్పపీడన ద్రోణి మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉండడంతో సముద్రం కూడా అల్లకల్లోలంగా మారింది. సముద్రంలో కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి.. 


ఏకధాటిగా కురుస్తున్న వర్షం..
మంగళవారం రాత్రి నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్ష సూచన ఉన్నందున ప్రజలు అవసరమైతేనే బయటకు వెళ్లాలని, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.. మొన్నటి వరకు కురిసిన భారీ వర్షాలకు చాలా ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. అయితే రెండు రోజులుగా మళ్లీ భారీ వర్షాలు కురుస్తుండడంతో గోదావరికి వరద పోటెత్తే అవకాశాలున్నందున అధికారులు అప్రమత్తమయ్యారు. 


ఏజెన్సీ ప్రాంతాల్లో పొంగుతున్న వాగులు..
అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోకి వచ్చే ఏడు విలీన మండలాల్లో ముంపు భయం ప్రజలను వెంటాడుతోంది. ఇప్పటికే సోకిలేరు వాగు పొంగిప్రవహిస్తోంది. శబరి నదికి కూడా వరద ఉద్దృతి పెరిగింది. మరోపక్క మారేడుమిల్లి మీదుగా భద్రాచలం వైపు వెళ్లే ఘాట్‌ రోడ్డులో కొండ చరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున అధికారులు అప్రమత్తం అయ్యారు. మరింత భారీ వర్షం కురిస్తే ఈ రహదారిని మూసివేయాలని ఉన్నతాధికారులనుంచి ఆదేశాలు అందాయని చెబుతున్నారు. మొన్న కురిసిన భారీ వర్షాలకు ఈ రోడ్డు మార్గంలో పలు చోట్ల కొండ చరియలు విరిగి పడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది..


Also Read: వైజాగ్ నుంచి తిరుపతి, శబరిమల, చెన్నై, సికింద్రాబాద్‌కు స్పెషల్ ట్రైన్స్- టైమింగ్స్ ఇవే


భద్రాచలం వద్ద పెరుగుతోన్న వరద ఉద్ధృతి..
ఎగువ ప్రాంతాలనుంచి వస్తోన్న వరదతోపాటు ఏజెన్సీలో కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద వరద భారీ స్థాయికి చేరుతోంది. ఇది రాగల 24 గంటల్లో మరింతగా పెరిగే అవకాశాలున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. భద్రాచలం వద్ద అనూహ్యంగా పెరుగుతోన్న గోదావరితో ఇటు ధవళేశ్వరం వద్ద కూడా అధికారులు అలెర్ట్‌ అయ్యారు.. 


సెలవులివ్వని ప్రైవేటు విద్యాసంస్థలు
భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో ఎటువంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటుచేసుకోకుండా ముంద‌స్తు చర్యల్లో భాగంగా విద్యాసంస్థలకు సెల‌వు ప్రకటించినా అవేమీ పట్టనట్టు ప్రైవేటు విద్యాసంస్థలు వ్యవహరిస్తున్నాయి. పాఠ‌శాల‌లు, కాలేజీలు, అంగ‌న్‌వాడీ కేంద్రాలు ఇలా ప్రభుత్వం విద్యాసంస్థలన్నీ మూత‌ప‌డినా ప్రైవేటు విద్యాసంస్థల్లో మాత్రం త‌ర‌గ‌తులు నిర్వహిస్తున్నారు. దీనిపై ప‌లువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారీ వ‌ర్షాల‌కు ప‌లు చోట్ల చెరువులకు గండ్లు పడుతున్నాయని, సెల‌వు అని అధికారులు ప్రకటించినా స్కూలు బ‌స్సులు వ‌చ్చి విద్యార్ధుల‌ను తీసుకెళ్లాయ‌ని, ఏదైనా జరిగే ఎవ‌రు బాధ్యత వహిస్తారని అంటున్నారు. త‌ర‌గ‌తులు నిర్వహిస్తున్న పాఠ‌శాల‌లు, కాలేజీల‌పై చర్యలు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు. 


Also: పరాయి వ్యక్తితో మాట్లాడింద‌ని దారుణం, ఆ వ్యక్తితో వివాహితకు బలవంతంగా పెళ్లి!