జనసేన పార్టీతో పొత్తు విషయంలో టీడీపీ వన్ సైడ్ లవ్ అంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ స్పందించారు. పొత్తులపై ఒక్కడినే నిర్ణయం తీసుకోనని అందరితో చర్చించాకే నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. పొత్తులపై ఆమోదయోగ్యంగా ఉంటే అప్పుడు అలోచిస్తామని..ఈ అంశంపై అందరిదీ ఒకే మాటగా ఉండాలని శ్రేణులకు పవన్ కల్యాణ్ సూచించారు. ప్రతి జనసైనికుడితో మాట్లాడిన తరవాతే తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్నామని గుర్తు చేశారు. క్షేత్ర స్థాయిలో జనసేన పుంజుకుంటోందని అందుకే పలు పార్టీలు జనసేనతో పొత్తుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. పొత్తుల కంటే ముందు పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెడతామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Also Read: ఏపీలో ట్రయాంగిల్ పొలిటికల్ లవ్ స్టోరీ ! క్లైమాక్స్ మలుపు తిప్పుతుందా ?
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన ఇతర పార్టీలతో పొత్తుల ప్రసక్తే ఉండదని చెప్పాలి. కానీ పవన్ కల్యాణ్ అవకాశాలు ఓపెన్‌గానే ఉన్నాయని చెప్పారు. దీంతో ఉపయోగకరమైన పొత్తుల విషయంలో సిద్ధంగా ఉన్నట్లుగా టీడీపీకి సంకేతాలు పంపినట్లుగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Also Read: పవన్‌ను పదే పదే టార్గెట్ చేస్తున్న సోము వీర్రాజు ! బీజేపీ -జనసేన మధ్య దూరం పెరుగుతోందా ?
2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమితో కలిసిన జనసేన ఎన్నికల్లో మాత్రం పోటీ చేయలేదు. కూటమిలో భాగం అయింది. ఆ తర్వాత నాలుగేళ్ల పాటు టీడీపీ ప్రభుత్వంతో సఖ్యతగా ఉన్నప్పటికీ ఎన్నికల ఏడాదిలో టీడీపీపై తీవ్ర విమర్శలు చేసి బయటకు వచ్చారు. కమ్యూనిస్టు పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారు. కానీ ఆ పొత్తుల వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. ఆ తర్వాత కొన్నాళ్లకే.. ఎలాంటి ఎలాంటి ఎన్నికలు లేకపోయినప్పటికీ బీజేపీతో పొత్తు పెట్టుకుని అందర్నీ ఆశ్చర్య పరిచారు.
Also Read: ప్రాణ త్యాగం అవసరంలేదు ప్లకార్డులు పట్టుకోండి చాలు... వైసీపీ ఎంపీలపై పవన్ విమర్శలు...
అయితే బీజేపీతో పొత్తు వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండటం తిరుపతి ఉపఎన్నికలతో పాటు స్థానిక ఎన్నికల్లోనూ జనసేన క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేసింది. బీజేపీతో పొత్తు వల్ల మైనార్టీలు దూరమయ్యారని ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన చట్టసభల్లో ప్రభావవంతమైన స్థానాన్ని పొందకపోతే పార్టీ బలహీనం అయ్యే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో ఉభయతారక పొత్తుల కోసం పవన్ సిద్ధమవుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
Also Read: ఏపీలో బీజేపీ - జనసేన అనధికారిక కటీఫ్ ! బద్వేలు పోటీనే తేల్చేసిందా ?