అమరావతిపై ఏపీ ప్రభుత్వం కొత్త ఆలోచనలు చేస్తోంది. అమరావతిని నగరపాలక సంస్థగా ప్రకటించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాజధానిలోని 19 గ్రామాలను ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి అవసరమైన సన్నాహాలు ప్రారంభించారు. గుంటూరు జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. తుళ్లూరు మండలంలోని 16 గ్రామాలు, మంగళగిరి మండలంలోని 3 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి, ప్రజల అభిప్రాయాలను సేకరించాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. తుళ్ళూరు మండలంలోని 16 గ్రామాలను అమరావతి మున్సిపల్ సిటీ కార్పొరేషన్ లో విలీనం చేసేందుకు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తారు. ఈ మేరకు కలెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో కలెక్టర్ నోటిఫికేషన్ ఇచ్చారు.
Also Read: అమరావతి నిర్మాణాలు ప్రారంభమయ్యాయా ? అప్పు కోసమా ? నిజంగానే పూర్తి చేస్తారా ?
రాజధాని గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలను నిర్వహించకపోవడంపై హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ సందర్భంగా జరిగిన విచారణలో ప్రభుత్వం తరపు న్యాయవాదలు రాజధాని ప్రాంత గ్రామాలు పంచాయతీ పరిధిలోకి రావని, మునిసిపాలిటీ పరిధిలోకి వస్తాయని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అందుకే ఆ గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేదని తెలిపింది. రాజధాని ప్రాంత ఏర్పాటు ప్రక్రియలో పలు లోపాలున్నాయని, వాటిని సరిదిద్దుతున్నామని చెప్పింది. గ్రామ సభలు నిర్వహించకపోవడం, పంచాయతీలు తీర్మానాలు చేయకపోవడం వంటి లోపాలను సరిదిద్దాల్సి ఉందని తెలిపింది.
ఎన్నికల సంఘం తన విధఉల్ని నిష్పక్షపాతంగా నిర్వహించడం లేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ సమయంలో ఎన్నికల సంఘం తరపు న్యాయవాది ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వానికి లేఖ రాశామని చెప్పారు. కోర్టులో కేసులు పెండింగ్ ఉన్నందున ఎన్నికలు సాధ్యం కావని ప్రభుత్వం చెప్పిందన్నారు. సీఆర్‌డీఏ తిరిగి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై వైఖరి ఏమిటో చెప్పాలని ఎన్నికల సంఘాన్ని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ క్రమంలో స్థానిక ఎన్నికల కోణంలోనే ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ నోటిఫికేషన్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. గతంలో ఇలాంటి ప్రజాభిప్రాయసేకరణకు తీవ్ర ప్రతిబంధకాలు ఎదురయ్యాయి. ఇప్పుడు ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
Also Read: మూడు ముక్కలాట ఆపి ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించాలి.. తిరుపతి సభలో మార్మోగిన డిమాండ్ !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి