అసెంబ్లీ సాక్షిగా అమరావతికి మద్దతు ప్రకటించి  జగన్మోహన్ రెడ్డి మాట తప్పారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు.  తిరుపతిలో అమరావతి రైతులు నిర్వహించిన మహోద్యమ బహిరంగభలో ఆయన ప్రసంగించారు. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాట తప్పి మూడు ముక్కలాట ఆడుతున్నారని విమర్శించారు. అమరావతి ప్రజా రాజధాని అని... .రాష్ట్రానికి  బ్రహ్మాండమైన ఆర్థికవనరుల్ని సృష్టించగలదని చంద్రబాబు తెలిపారు. దూరదృష్టిలేని జగన్‌రెడ్డి అమరావతిని  నాశనం చేయాలని జగన్ కంకణం కట్టుకున్నారని మండిపడ్డారు.  అభివృద్ధి వికేంద్రీకరణ కావాలని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే తమ లక్ష్యమన్నారు.  రాజధానిని మూడు ముక్కలు చేస్తే అభివృద్ధి ఎలా చంద్రబాబు ప్రశ్నంచారు.  సీఎం జగన్‌రెడ్డిది చేతకాని అసమర్థ ప్రభుత్వమన్నారు.  రైతులు అలుపెరగని పోరాటం చేస్తున్నారని .. వారిపై ప్రభుత్వం కేసులతో వేధిస్తోందన్నారు.  మహాపాదయాత్రలో పాల్గొన్నవారిపైనా కేసులు పెట్టారని తెలిపారు. అమరావతిపై అసెంబ్లీ సాక్షిగా జగన్‌రెడ్డి మాట తప్పారని ధ్వజమెత్తారు. అమరావతి ఐదు కోట్ల ఆంధ్రుల రాజధానిగా స్పష్టం చేశారు. అంతిమంగా అమరావతి రైతులే విజయం సాధిస్తారన్నారు.

Tirupati Amaravati Sabha: మూడు ముక్కలాట ఆపి ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించాలి.. తిరుపతి సభలో మార్మోగిన డిమాండ్ !


Also Read: అమరావతి మహోద్యమ వేదికపై వైఎస్ఆర్‌సీపీ ఎంపీ... ఏకైక రాజధానికే మద్దతన్న రఘురామ !



తిరుపతిలో అమరావతి పరిరక్షణ సమితి మహోద్యమ సభకు అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. బీజేపీ తరపున హాజరైన కన్నా లక్ష్మినారాయణ ఒక్క చాన్స్‌ అంటూ జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చి దోచుకుంటున్నారని మండిపడ్డారు. దోచుకునేందుకు ఏమీలేదనే అమరావతిని వద్దంటున్నారని మండిపడ్డారు. విశాఖను దోచుకునేందుకే అక్కడ రాజధాని అంటున్నారన్నారు. రాజధాని పేరుతో దోచుకుంటారని విశాఖ ప్రజలు వణుకుతున్నారని చెప్పారు.  రైతుల  రాష్ట్ర రాజధాని కోసం భూములు ఇస్తే, జగన్ వారికి లాఠీ దెబ్బలు రుచి చూపించారని మరో బీజేపీ నేత లంకా దినకర్ విమర్శించారు.  ఒక రాజధానితోనూ అధికార వికేంద్రీకరణ సాధ్యమేనని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ప్రకటించారు.  మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత జగన్‌రెడ్డిదే. ఏపీకి అమరావతి రాజధాని కల్పవృక్షం. రాజధానిగా అమరావతిని కొనసాగిస్తే వేల కోట్ల ఆదాయం వచ్చేది. అమరావతే రాజధానిగా కొనసాగిస్తామని జగన్‌ ప్రకటించాలని డిమాండ్ చేశారు.


Also Read: పేదలపై సామాజిక దాడి - బినామీలతో అమరావతి ఉద్యమం .. చంద్రబాబుపై వైఎస్ఆర్‌సీపీ ఎంపీల ఆగ్రహం !



అమరావతి అనే శిశువును జగన్‌రెడ్డి 3 ముక్కలు చేశారని సీపీఐ నేత నారాయణ విమర్శించారు.  జగన్‌రెడ్డి లాంటి మూర్ఖుడు మరొకరు ఉండరని మండిపడ్డారు.  మహిళల కన్నీరు ఏపీకి మంచిది కాదన్నారు.  ఏపీని వైఎస్ఆర్‌సీపీ  ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోందని  రాజధానిపై జగన్‌రెడ్డి మూడు ముక్కలాట ఆడుతున్నారని మరో సీపీఐ నేత రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి ఉద్యమానికి బీజేపీ రాష్ట్ర నేతలు మద్దతిస్తున్నారని, కేంద్రమంత్రి అమిత్‌షా  ధాని మోదీ ఒక్క ఫోన్‌ చేస్తే జగన్‌ అమరావతిని కాదంటారా? అని రామకృష్ణ ప్రశ్నించారు. మహోద్యమ సభకు వైఎస్ఆర్‌సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా హాజరయ్యారు. ఏపీకి రాజధాని లేని పరిస్థితిని కల్పించారని  రాజధాని కోసం అమరావతి రైతుల త్యాగం మరువలేనిదని కొనియాడారు. అమరావతే ఏపీకి రాజధానిగా ఉంటుందని స్పష్టం చేశారు. రాజధాని రైతులు ధైర్యంగా పోరాడాలని, అంతిమ విజయం రాజధాని రైతులదే అవుతుందని రఘురామకృష్ణరాజు భరోసా ఇచ్చారు.


Also Read: పార్లమెంట్‌లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గళమెత్తాల్సిందే.. ఏపీ ఎంపీలపై ఒత్తిడి తెచ్చేందుకు పవన్‌ కొత్త వ్యూహం !


అమరావతి రైతుల సభకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు.  వంద మందికిపైగా పట్టేలాస్టేజ్‌ను రూపొందించారు. అయితే అన్ని పార్టీల నుంచి నేతలు తరలిరావడంతో స్టేజ్ కూడా కిక్కిరిసిపోయింది. అమరావతికి భూములు ఇచ్చిన రైతులు నెలన్నర పాటు న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ పాదాయత్ర చేసి  తమ సంకల్పాన్ని చాటారు. ఎన్ని విమర్శలు.. లాఠీచార్జ్‌లు.. నిర్బంధాలు ఎదురైనప్పటికీ సభకు  భారీగా జన సమూహం తరలి రావడంతో రైతులు తమ ప్రయత్నాల్లో మరో అడుగు ముందుకేశామన్న సంతృప్తి వ్యక్తం చేశారు. 


  Also Read: పీఆర్సీ కూడా ప్రకటించలేదు ... ఉద్యమం నిలిపివేత ! ఏపీ ఉద్యోగ నేతలు ఏం సాధించారు ?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి