తిరుపతిలో జరుగుతున్న అమరావతి రైతుల మహోద్యమ సభకు వైఎస్‌ఆర్‌సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు హాజరయ్యారు. తనపై వైఎస్ఆర్‌సీపీ నేతలు అయిన చెవిరెడ్డి, పెద్దిరెడ్డి దాడి చేయించే అవకాశం ఉందని అందువల్ల తాను వర్చవల్‌గా సమావేశంలో పాల్గొంటానని ఢిల్లీలో గురువారం ఆయన ప్రకటించారు. కానీ అనూహ్యంగా ఆయన తిరుపతిలో అడుగు పెట్టారు. ఆయన వస్తున్నట్లుగా కొంత మంది అమరావతి జేఏసీ నేతలకే సమాచారం ఉంది. ఆయన రాకతో అమరావతి మహోద్యమ సభ వేదికపై అన్ని పార్టీల నేతలూ ఉన్నట్లు అయింది. అమరావతినే ఏకైక రాజధానిగా ఉండాలని వైఎస్ఆర్‌సీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలూ డిమాండ్ చేస్తున్నాయి.
వైఎస్ఆర్సీపీ విధానం మాత్రం మూడు రాజధానులు. ఆ పార్టీతో విబేధించిన రఘురామకృష్ణరాజు అమరావతికి మద్దతుగా మాట్లాడుతున్నారు. పలు అంశాలపై వైఎస్ఆర్‌సీపీ విధానాలతో వ్యతిరేకిస్తున్న ఆయన ప్రతీ రోజూ ప్రెస్‌మీట్ల ద్వారా విమర్శలు చేస్తున్నారు. అమరావతి రైతులకు మొదటి నుంచి మద్దతుగా నిలిచారు. ఏపీకి వస్తే తనపై దాడులు జరిగే అవకాశం ఉందని.. తప్పుడు కేసులతో అరెస్టు చేసే ప్రమాదం ఉందన్న కారణంగా ఆయన చాలా కాలంగా ఏపీకి రావడం లేదు. సొంత నియోజకవర్గం అయిన నర్సాపురానికీ వెళ్లడం లేదు.
ఆయన అనుమానాలను నిజం చేస్తూ గతంలో తన పుట్టినరోజు నాడు హైదరాబాద్ లోని ఇంటికి వచ్చినప్పుడు ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అప్పటి వరకూ ఆయనపై కేసు నమోదైన విషయం కూడా ఎవరికీ తెలియదు. మీడియాతో మాట్లాడి ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారని రాజద్రోహం కేసు పెట్టారు. ఆ కేసులో బెయిల్ వచ్చిన తర్వాత ఆయన మళ్లీ ఢిల్లీ వెళ్లిపోయారు . అప్పట్నుంచి మళ్లీ ఏపీకి కానీ.. హైదరాబాద్‌కు కానీ వచ్చే ప్రయత్నం చేయలేదు.
Also Read: పీఆర్సీ కూడా ప్రకటించలేదు ... ఉద్యమం నిలిపివేత ! ఏపీ ఉద్యోగ నేతలు ఏం సాధించారు ?
కానీ అనూహ్యంగా ఆయన తిరుపతి సభకు హాజరయ్యారు. రఘురామ రాజు రాక వైఎస్ఆర్‌సీపీ నేతలను కూడా ఆశ్చర్యపరిచింది. స్టేజ్‌మీద వైఎస్ఆర్‌సీపీ ఎంపీ కూడా ఉండటం ఆ పార్టీ నేతలను ఇబ్బంది పెట్టే అంశమే. సాంకేతికంగా రఘురామకృష్ణరాజు ఇంకా వైఎస్ఆర్‌సీపీ సభ్యుడే. అమరావతి వేదికపై అన్ని పార్టీల నేతలు ఉన్నట్లయింది. రఘురామకృష్ణరాజు రారు అని అనుకున్నారు కానీ కానీ సరైన సమయంలో వచ్చి వైఎస్ఆర్‌సీపీని ఇబ్బంది పెట్టారని భావిస్తున్నారు.
Also Read: ఇడుపులపాయ టు తాడేపల్లికి పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు ! వాళ్లకేం కష్టం వచ్చిందంటే ?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి