రాజధాని అంటే కేవలం 30 వేల ఎకరాలకు సంబంధించిన ప్రయోజనాల పరిరక్షణా అని మంత్రి సీదిరి అప్పలరాజు, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, టి.జె.ఆర్‌ సుధాకర్‌ బాబు ప్రశ్నించారు. మంగళగిరి వైసీపీ కార్యాలయంలో మాట్లాడిన నేతలు అమరావతి రైతుల తిరుపతి సభపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు బినామీల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని విమర్శించారు. రాజధాని అంటే భూములా లేక పరిపాలనో చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతి రాజధానిగా ఉండదు అని సీఎం జగన్‌ ఎప్పుడూ చెప్పలేదన్న నేతలు... అమరావతి మూడు రాజధానుల్లో ఒకటి అని చెప్పారు.


బినామీలతో యాత్రలు  


ఉత్తరాంధ్ర ఆకాంక్షలకు చంద్రబాబు ఏం సమాధానం ఇస్తారని వైసీపీ నేతలు ప్రశ్నించింది. రాజధాని భూముల్ని బినామీలతో కొనిపించిన చంద్రబాబు.. బినామీలతో యాత్రలు చేయించారని విమర్శించారు. ఈ యాత్ర తానే చేయించారనడానికి తిరుపతి సభలో చంద్రబాబు పాల్గొనడమే నిదర్శనమన్నారు. చంద్రబాబు చేయించినది పాదయాత్ర కాదని ఇది ఉత్తరాంధ్ర, రాయలసీమతో పాటు, మొత్తం రాష్ట్రం మీద దండయాత్ర అన్నారు.  ఈ యాత్ర చంద్రబాబు బినామీ భూముల రియల్‌ ఎస్టేట్‌కు సంబంధించిన వ్యవహారమన్నారు.  పోలవరం ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన వారిది త్యాగం కాదా అని వైసీపీ నేతలు ప్రశ్నించారు. మిగతా రైతుల కంటే అమరావతిలో రైతులకు మరింత న్యాయం చేయడానికి వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించిందన్నారు. 


Also Read:  మూడు ముక్కలాట ఆపి ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించాలి.. తిరుపతి సభలో మార్మోగిన డిమాండ్ !


మూడు రాజధానులకు మద్దతు


'అమరావతి రైతుల పాదయాత్ర ఎవరి కోసం? భూముల కోసం రాజధానా. లేక రాజధాని కోసం భూములా? అన్ని ప్రాంతాలకు న్యాయం చేయడం కోసం రాజధానా. లేక చంద్రబాబు కోసం, అతడి వర్గం కోసం రాజధానా. రాష్ట్రంలో ఒకే ఎయిర్‌పోర్టు, ఒకే రైల్వే స్టేషన్, ఒకే బస్‌ స్టేషన్‌ ఉంటే సరిపోతుందా? అన్యాయం జరిగితే న్యాయస్థానానికి వెళ్లొచ్చు. తప్పు జరిగితే ఆ తప్పు చేసిన వాణ్ని శిక్షించమని దేవస్థానానికి వెళ్లొచ్చు. కానీ ఇక్కడ అన్యాయం చేసింది చంద్రబాబే. ఆ తప్పునకు మద్దతు ఇస్తూ ఈ యాత్రలు, సభలు ఏమిటి? పైగా అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని శ్రీకాకుళం నుంచి విశాఖ వరకు ఉత్తరాంధ్రలో... అలాగే చిత్తూరు నుంచి అనంతపురం వరకు రాయలసీమలో... నెల్లూరు నుంచి గుంటూరు వరకు, తూర్పు గోదావరి నుంచి కృష్ణా వరకు మద్దతుగా యాత్రలు చేశారు.' అని వైసీపీ నేతలు అన్నారు. 


Also Read: అమరావతి మహోద్యమ వేదికపై వైఎస్ఆర్‌సీపీ ఎంపీ... ఏకైక రాజధానికే మద్దతన్న రఘురామ


కార్ల్ మార్క్య్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా సీపీఐ


విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ ఉంటే చంద్రబాబుకు నష్టం ఏమిటని వైసీపీ నేతలు ప్రశ్నించారు. ఈ కేంద్రీకరణ ధోరణులకు కమ్యూనిస్టు పార్టీ వంత పాడడం ఏమిటన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఆయనకు వత్తాసుగా సీపీఐ, జనసేన పార్టీలు పనిచేస్తున్నాయని విమర్శించారు. ప్రపంచ కమ్యూనిస్ట్‌ చరిత్రను తిరగరాస్తూ కార్ల్‌ మార్క్స్‌ సిద్ధాంతాలకు పూర్తిగా సమాధి కట్టేసి... ఏకంగా రియల్‌ఎస్టేట్‌ భూస్వామ్య ఉద్యమానికి, బినామీ రాజకీయానికి ఏపీ సీపీఐ మద్దతు పలికి సరికొత్త రికార్డు సృష్టించిందన్నారు. 


Also Read: పేదలపై సామాజిక దాడి - బినామీలతో అమరావతి ఉద్యమం .. చంద్రబాబుపై వైఎస్ఆర్‌సీపీ ఎంపీల ఆగ్రహం !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి