ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు చేపట్టిందని తెలంగాణ జాతీయ హరిత ట్రైబ్యునల్ లో వాదించింది. నిబంధనలు పాటించని ఏపీని కచ్చితంగా శిక్షించాలని కోరింది. కోర్టు ధిక్కారం కింద చర్యలు తీసకునే అధికారం ఎన్జీటీకి ఉందని తెలిపింది. అన్ని కోణాల్లో పరిశీలించి కోర్టు ధిక్కరణపై నిర్ణయం తీసుకుంటామని గ్రీన్ ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. ముగింపు వాదనలకు ఆంధ్రప్రదేశ్ కి అవకాశం ఇచ్చింది. తీర్పును రిజర్వు చేయనున్నట్లు ఎన్జీటీ చెప్పింది.


Also Read: రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీలో ఏపీ అఫిడవిట్‌... అధ్యయనంలో భాగంగానే పనులు.. కాంక్రీట్ పనులు చేపట్టలేదని నివేదిక


పర్యావరణ అనుమతులు ఇవ్వొద్దు


ఏపీ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు మంజూరు చేయవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ కోరింది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు లేఖ కూడా రాసింది. పర్యావరణ మంత్రిత్వ శాఖ ఎక్స్​ఫర్ట్ కమిటీకి తెలంగాణ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ లేఖ రాశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం నీటి కేటాయింపులు, అనుమతులు లేని అక్రమ ప్రాజెక్టు అని లేఖలో తెలిపింది. కృష్ణా బేసిన్ వెలుపలకు పెద్దమొత్తంలో నీటిని తరలించేందుకు రాయలసీమ ఎత్తిపోతల చేపట్టారని రజత్ కుమార్​లేఖలో తెలిపారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంతో పర్యావరణంపై ప్రభావం పడుతుందని ఆరోపించింది. రోళ్లపాడు, గుండ్ల బ్రహ్మేశ్వరం, శ్రీ లంకామల్లేశ్వర, శ్రీ పెనుసిలా నరసింహ, శ్రీ రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్, శ్రీ వెంకటేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ప్రాజెక్టు కాల్వలకు 10 కిలోమీటర్ల పరిధిలోపే ఉన్నాయని పేర్కొన్నారు. 


Also Read: పోలవరం పనులకు "స్టాప్ వర్క్ ఆర్డర్‌" టెన్షన్..!


గతంలో ఈ అంశాన్ని ప్రస్తావించిన తెలంగాణ


కృష్ణా బోర్డుకు ప్రాజెక్టు డీపీఆర్ ఇవ్వకుండా తగిన అనుమతులు తీసుకోకుండా పనులు చేపట్టవద్దని ఎన్జీటీ గతంలోనే ఆదేశాలు ఇచ్చిందని తెలంగాణ తెలిపింది. 2020 అక్టోబర్​లో జరిగిన సమావేశంలో కేంద్ర జలశక్తిశాఖ మంత్రికి రాయలసీమ ఎత్తిపోతల అంశాన్ని తెలంగాణ ప్రస్తావించిందని పేర్కొంది.  కేంద్ర జలసంఘం అనుమతులు వచ్చే వరకు ప్రాజెక్టు పనులు ఆపాలని కేంద్రం ఏపీని ఆదేశించిందని లేఖలో తెలిపింది. ఈ నేపథ్యంలో రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు న్యాయ, హైడ్రాలజికల్, పర్యావరణ అంశాలన్నింటినీ పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకోవాలని రజత్ కుమార్ కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖను లేఖలో కోరారు.


Also Read: సీమ ప్రాజెక్టులో పనులేమీ జరగడం లేదని ఎన్జీటీకి కేంద్రం నివేదిక ! ఏపీ సర్కార్‌కు రిలీఫ్ !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి