కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకునే అధికారం నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్‌కు ఉందా లేదా అన్న అంశంపై తమ వాదనలు కూడా వినాలని ఏపీ ప్రభుత్వం ఎన్జీటీని కోరింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం అంశంపై ఎన్జీటీలో జరిగిన విచారణలో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ తన నివేదికను సమర్పించింది. గత రెండు వాయిదాల్లోనూ నివేదిక ఇవ్వకపోవడంతో ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విచారణలో నివేదిక సమర్పించినప్పటికీ అక్కడ పనులు జరిగాయో లేదో చెప్పడానికి మొహమాట పడింది. ఈ అంశంపై కృష్ణా నది యాజమాన్య బోర్డు ఇప్పటికే నివేదిక ఇచ్చిందని మాత్రం పేర్కొంది. అయితే ప్రస్తుతం పనులు జరగడం లేదని స్పష్టం చేసింది. 


Also Read : కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ ఆశలు గల్లంతు



రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించిన కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందిన శాస్త్రవేత్త పసుపులేటి సురేష్ బాబు రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు స్థలం వద్ద ప్రస్తుతం ఎలాంటి పనులు జరగడం లేదని నివేదిక సమర్పించారు.  ప్రాజెక్టు నిర్మాణం కోసం తీసుకువచ్చిన సామగ్రి అంతా ఆ ప్రాంతంలో నిల్వ ఉంచారని తెలిపారు. పర్యావరణ అనుమతులకు సవరణలు కోరుతూ రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు కు కూడా అనుమతులను వర్తింపచేయాలని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు సమర్పించిన ప్రాజెక్టు ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని ఇంకా నిర్ణయం తీసుకోలేదని నివేదికలో తెలిపారు. 


Also Read : దేశంలో మూడో కూటమి ఏర్పాటుకు సన్నాహాలు



గతంలో  కృష్ణా బోర్డు కమిటీ రాయలసీమ ఎత్తిపోతలను సందర్శించి నివేదిక సమర్పించింది. డీపీఆర్‌కు అవసరమైన పనులకన్నా అధికంగా పనులు జరిగినట్లు కేఆర్‌ఎంబీ నివేదికలో నిర్ధారించింది. పంప్ హౌస్, అప్రోచ్ ఛానల్, ఫోర్ బే, డెలివరీ మెయిన్ ఛానల్, డెలివరీ సిస్టమ్, లింక్ కెనాల్ పనులు జరిగినట్లు నిర్ధారించినట్లు కేఆర్‌ఎంబీ పేర్కొంది.  ప్రాజెక్ట్‌లో ముఖ్యమైన పనులను పూర్తిచేసినట్లు కేఆర్‌ఎంబీ పేర్కొంది. ఫోటోలతో సహా సమగ్ర నివేదికను ఎన్జీటీకి సమర్పించింది. కేంద్ర పర్యావరణ శాఖ ప్రత్యేకంగా ఏమీ చెప్పకపోయినా కేఆర్ఎంబీ నివేదికనే ప్రస్తావించడంతో ఏపీ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే విషయమేనని అంచనా వేస్తున్నారు. 


Also Read : ఏపీలో కరెంట్ చార్జీలు ఎందుకు పెరిగాయి ?



గతంలో ఎన్జీటీ రాయలసీమ ఎత్తిపోతల పనులపై స్టే ఇచ్చింది. అయినా పనులు చేస్తున్నారని పిటిషన్లు దాఖలు కావడంతో  పరిశీలన చేయాలని ఆదేశించింది. తమ తీర్పును ఉల్లంఘించినట్లుగా తేలితే  సీఎస్‌ను జైలుకు పంపుతామని ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర పర్యావరణ శాఖ ఇచ్చిన నివేదికను పరిశీలించిన ఎన్జీటీ ధర్మాసనం అక్కడ డీపీఆర్ కోసమే పనులు జరిగినట్లుగా లేవని.. అంతకు మించి పనులు జరిగాయన్న అభిప్రాయం వ్యక్తం చేసింది. గతంలో ధిక్కరణ చర్యలు తీసుకునే అధికారం ఎన్జీటీకి ఉందో లేదో చెప్పాలని పిటిషనర్లను కోరింది. ఇదే అంశంపై తాము కూడా వాదనలు వినిపిస్తామని ఏపీ ప్రభుత్వ తరపు లాయర్ కోరారు.  అన్ని తదుపరి విచారణలో పరిశీలిద్దామని ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ధర్మాసనం. 


ఆ వైసీపీ మాజీ ఎమ్మెల్యే చేసింది అగ్రిగోల్డ్ తరహా మోసమా..?