గవర్నర్ కోటాలో పాడి కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా ఖరారు చేయడానికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సిద్ధంగా లేరు. తన అసంతృప్తిని గవర్నర్ బహిరంగంగానే తెలిపారు. సామాజిక సేవలు చేసిన వారికి , ఇతర రంగాలలో ప్రముఖులకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేయడం సంప్రదాయంగా వస్తోందని అభిప్రాయపడ్డారు. అయితే కౌశిక్ రెడ్డి ఫైల్‌ను ఆమె ప్రభుత్వానికి తిప్పి పంపలేదు. ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. దీంతో మరికొన్ని రోజులు కౌశిక్ రెడ్డికి ఎదురు చూపులు తప్పవని అంచనా వేస్తున్నారు. ఆగస్టు మొదటి వారంలో గవర్నర్ కోటా కింద కౌశిక్ రెడ్డిని నామినేట్ చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుని గవర్నర్‌కు పంపింది. అయితే ఆమె అప్పటి నుండి ఫైల్‌ను ఆమోదించలేదు. అలాగని తిరస్కరించలేదు. Also Read : హుజురాబాద్ ఉపఎన్నిక కేటీఆర్‌కు లెక్కలో లేదా?


పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీగా సిఫార్సు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఆయన క్రికెట్ క్రీడకు సేవలు చేశారని పేర్కొంది. కొన్నాళ్లు వివిధ స్థాయిల్లో పాడి కౌశిక్ రెడ్డి క్రికెట్ ప్లేయర్‌గా కొనసాగారు. అయితే ఆయన తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. సాధారణంగా కేబినెట్ ఆమోదించి పంపిన ఎమ్మెల్సీ  స్థానాల భర్తీ ని గవర్నర్ ఆమోదించకుండా ఉండరు. వెంటనే ఆమోదిస్తారు. ఎందుకంటే ఆ స్థానం ఇప్పటికే ఖాళీ అయి ఉంటుంది. ఒకటి రెండు రోజులు ఆలస్యమైనా గవర్నర్‌కు ఆ పేర్లు నచ్చలేదని భావించాల్సి ఉంటుంది. ఇంత ఆలస్యం చేసినా తెలంగాణ ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలేదు. Also Read : హరీష్ రావును మళ్లీ దూరం పెడుతున్నారా..?


కొద్ది రోజుల కింద ఏపీ ప్రభుత్వం అలా గవర్నర్ కోటాలో నాలుగు ఎమ్మెల్సీలను భర్తీ చేసింది. అయితే వారిలో ఇద్దరిపై కేసులు ఉండటంతో గవర్నర్ వెంటనే ఆమోదించలేదు.   నేరుగా సీఎం జగన్ గవర్నర్‌ను కలిసిన తర్వాత ఫైల్‌పై ఆమోదముద్రపడింది. పాడి కౌశిక్ రెడ్డి విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఫాలో అప్ చేయలేదు. కొద్ది రోజుల కిందట గవర్నర్ తమిళిసై మాతృమూర్తి మరణం సందర్భంగా పరామర్శించడానికి  హరీష్ రావు రాజ్ భవన్ వెళ్లారు. తన వెంట కౌశిక్ రెడ్డిని కూడా తీసుకెళ్లారు. అప్పుడు ఏమైనా చర్చలు జరిగాయో లేదో స్పష్టత లేదు. Also Read : సెప్టెంబర్ 17న తెలంగాణలో ఏం జరుగుతుంది..?


పాడి కౌశిక్ రెడ్డిపై పలు రకాల కేసులు ఉన్నాయి. అందులో ఎన్నికల కేసులే కాక ఇతర కేసులు కూడా ఉన్నాయి.  అయితే కేసీఆర్ ఒక మాట చెబితే గవర్నర్ సంతృప్తి చెందుతారని... వెంటనే ఆమోదిస్తారని కానీ ఎందుకో  ఆయన కూడా పట్టించుకోవడం లేదని అంటున్నారు. కౌశిక్ రెడ్డికి పదవి ఇవ్వడంపై సొంత పార్టీలోనూ అసంతృప్తి ఉంది. ఈ తరుణంలో కేసీఆర్ కూడా మనసు మార్చుకుని గవర్నర్ అభ్యంతరంతో  ఆయన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకుని వేరే అవకాశం కల్పిస్తారో లేకపోతే గవర్నర్ ఆమోదించాల్సిందేనని పట్టుబడతారో వేచి చూడాలి. గవర్నర్ ఒక వేళ ఫైల్ వెనక్కి పంపినా.. మరోసారి పంపితే ఖచ్చితంగా ఆమోదించాల్సిందే. Also Read : కేసీఆర్ ఢిల్లీ టూర్‌తో టీ బీజేపీకి ఎందుకు ఇబ్బంది ?