తెలంగాణ ఉద్యమాన్ని తొక్కిపెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసిందని.. అయితే ఆనాడు కేసీఆర్ ఒకే ఒక్కడుగా బయలుదేరాడని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ప్రారంభించారని జలవిహార్‌లో నిర్వహించిన టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక చిన్న ఎన్నిక.. స్థానిక నేతలు ఆ వ్యవహారం చూసుకుంటారని.. ప్రతిపక్షాలను ధీటుగా తిప్పికొట్టే రంగం సిద్ధం చేద్దామని టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2004 కాంగ్రెస్ పార్టీతో, ఆ మరుసటి ఎన్నికల్లో 2009లో టీడీపీతో కేసీఆర్ పొత్తుపెట్టుకున్నారని.. వారితో తెలంగాణకు కేసీఆర్ జై కొట్టించారని చెప్పారు. టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని.. కేసీఆర్ దెబ్బకు విధిలేక కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందన్నారు. తెలంగాణ ఇస్తానని 2004లో మాట ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ 2009లోనూ అధికారంలోకి వచ్చినా మాట తప్పిందన్నారు. నిన్న మొన్న పుట్టిన చిల్లరగాళ్లు సైతం తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ పార్టీలు అని చెప్పుకునే వాళ్లు 70ఏళ్లలో రైతులకు నీళ్లు, కరెంటు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
ఏడేళ్లు ఓపిక పట్టాం.. ఇకనుంచి లెక్కలు మారతాయి.. మంత్రి కేటీఆర్
గత ఏడేళ్లుగా ఓపిక పట్టామని.. ఇకనుంచి కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లు సమాధానం చెప్తామన్నారు. నిన్న మొన్న పుట్టిన చిల్లర గాళ్లు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఉరుకుంటే చిల్లర గాళ్ల మాటలు ఎక్కువగా అయితున్నాయని మండిపడ్డారు. సెప్టెంబర్ 20వ తేదీ లోపు బస్తీ- కాలనీ కమిటీలు పూర్తి కావాలని.. మొత్తం 150 డివిజన్ కమిటీలు వెయ్యాలన్నారు. కాగా, హుజూరాబాద్ ఉప ఎన్నిక చిన్న వ్యవహారమని చెప్పిన టీఆర్ఎస్ పార్టీ మంత్రి హరీష్ రావును ఎందుకు రంగంలోకి దించిందని కాంగ్రెస్, బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
Also Read: Afghanistan Crisis: అఫ్గాన్‌లో అల్లకల్లోలం.. తాలిబన్ ప్రభుత్వ ఏర్పాటుతో ఉద్రిక్తత..
పార్టీ కోసం కష్టపడ్డ వారిని గుర్తిస్తాం..
‘టీఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి కష్టపడుతున్న సోదరులు ఉన్నారు. త్వరలోనే వారికి పోస్టులు ఇచ్చి కచ్చితంగా న్యాయం చేస్తాం. 500 పోస్టులు పలు కార్పొరేషన్లు నింపే బాధ్యత తీసుకుంటాను. దాంతోపాటుగా 150 డివిజన్లకు సోషల్ మీడియా కమిటీ వేయాలని నిర్ణయించాం. నగరంలో అందరికీ అందుబాటులో ఉండేలా హైదరాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు కట్టుకోవాలి. దాశరథి అన్నట్లు తెలంగాణ కోటి రతనాల వీన- అయితే సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ కోటి ఎకరాల మాగాణి అయిందని’ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.