గత నెలలో అఫ్గానిస్థాన్‌ను తమ వశం చేసుకున్న తాలిబన్లు మరోసారి తమ లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు. అఫ్గాన్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు తాలిబన్ అధికార ప్రతినిధి జబీఉల్లా ముజాహిద్ మీడియాతో మాట్లాడుతూ.. తాలిబన్ ప్రభుత్వం ఏర్పడిందని ప్రకటన చేశారు. తాలిబన్ ప్రతినిధి ఈ విషయం చెప్పగానే దేశంలో పెద్ద ఎత్తున నిరసన మొదలైంది. గత కొన్ని రోజులుగా తాలిబన్లకు వ్యతిరేకంగా అఫ్గాన్ లో పలు ప్రాంతాల్లో నిరసన వ్యక్తమవుతోంది.
ముఖ్యంగా అఫ్గాన్ లోని హెరత్ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. మరో 8 మంది గాయపడ్డారు. అఫ్గాన్‌లో తాలిబన్లు ప్రభుత్వం ఏర్పాటు చేశారని.. మహమ్మద్ హసన్ అఫ్గాన్ అధ్యక్షుడిగా ప్రకటించేశారు. తాలిబన్ సహ వ్యవస్థాపకుడు అబ్దుల్ ఘనీ బారాదర్ అఫ్గాన్ ఉపాధ్యక్షుడుగా వ్యవహరించనున్నారని త్వరలోనే పూర్తి స్థాయి ప్రభుత్వ నేతల పేర్లు వెల్లడిస్తామని ప్రకటన రావడంతోనే హెరాత్ ప్రావిన్స్ లో నిరసన జ్వాలలు చెలరేగాయి. ఆందోళన కారులు, ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన చేపట్టడంతో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మరోవైపు అఫ్గానిస్థాన్ పేరును సైతం ‘ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గానిస్థాన్’గా మార్చేశారు. రేపటి నుంచి అఫ్గాన్ లో కేవలం తాలిబన్లు చెప్పిందే జరగాలని ఇతర దేశాలు జోక్యం చేసుకోకూడదని సైతం తాలిబన్ల అధికార ప్రతినిధి మీడియాకు తెలిపారు.
షరియా చట్టం అమలు..
అఫ్గాన్ కొత్త ప్రభుత్వం షరియా చట్టాన్ని పాటించాలని తాలిబాన్ చీఫ్ సూచించారు. ఈ నిర్ణయంతో అఫ్గాన్ లో షరియా చట్టాన్ని కఠినంగా అమలు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా ఓమర్ కుమారుడు ముల్లా యాకుబ్‌కు కీలకమైన రక్షణ మంత్రిత్వ శాఖ, మరో ముఖ్యనేత సిరాజుద్దీన్ హక్కానీకి అంతర్గత వ్యవహారాల మంత్రిగా నియమించినట్లు అఫ్గాన్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అఫ్గాన్‌లో 1996-2001 మధ్యకాలంలో చేసిన పాలన రిపీట్ కాదని.. అప్పటి ప్రభుత్వానికి, ప్రస్తుత తాలిబన్ ప్రభుత్వానికి చాలా వ్యత్యాసం ఉంటుందని హబీఉల్లా ముజాహిద్ చెప్పారు. కేవలం తమ ఆలోచనల్లో మాత్రమే మార్పు వచ్చిందని.. సిద్ధాంతాలు ఎన్నటికీ మారవని తాలిబన్ నేతలు చెబుతున్నారు.
Also Read: Afghanistan Crisis: పంజ్ షీర్‌లో తాలిబన్లకు భారీ ఎదురుదెబ్బ.. సీనియర్ కమాండర్ ఫసియుద్దీన్ హతం