అఫ్గానిస్థాన్ లో మళ్లీ తాలిబన్లు కాల్పులు జరిపారు. ఓవైపు పైకి శాంతి వచనాలు చెబుతున్న తాలిబన్లు.. వారికి వ్యతిరేకంగా పోరాడే వారిపై దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు అఫ్గానిస్థాన్ లో నిరసనలు చేపట్టిన వారిపై తాలిబన్లు కాల్పులు జరిపారు.


అఫ్గానిస్థాన్‌ వ్యహహారాల్లో పాకిస్థాన్‌ జోక్యం, తాలిబన్ల చర్యలను నిరసిస్తూ ప్రజలు ఆందోళన చేశారు. పాకిస్థాన్‌ రాయబార కార్యాలయం వద్ద అఫ్గాన్‌ మహిళలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఇస్లామాబాద్‌, ఐఎస్‌ఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇది చూసి తట్టుకోలేకపోయిన తాలిబన్లు.. నిరసన చేస్తోన్న మహిళలను చెదరగొట్టేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు. 


పాక్ తో దోస్తీ..


అఫ్గాన్ ను హస్తగతం చేసుకున్న తర్వాత తాలిబన్ల ఆగడాలకు హద్దులు లేకుండా పోయాయి. జర్నలిస్టులు, మహిళలపై దాడులు చేస్తున్నారు. వీటిని కూడా సహించిన అఫ్గాన్ పౌరులు.. తమ దేశ వ్యవహారాల్లో పాక్ జోక్యంపై మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


పాక్‌ ఐఎస్‌ఐ చీఫ్‌ తాలిబన్లను కలవడంపై వారు ఆందోళన చెందుతున్నారు. పాక్ జోక్యం తగదని అఫ్గాన్‌ మహిళలు ఆందోళన బాటపట్టారు. అయితే వీరిపై తాలిబన్లు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎలాంటి నిరసనలు చేయకూడదని ఆదేశిస్తున్నారు.


పైకి మాత్రం..


పాకిస్థాన్ తో సన్నిహితంగా వ్యవహరిస్తోన్న తాలిబన్లు.. పైకి మాత్రం తమ దేశ వ్యవహారాల్లో ఎవరినీ జోక్యం చేసుకోబోనివ్వమని అంటున్నారు. పాకిస్థాన్ కూడా జోక్యం చేసుకోవడానికి వీల్లేదని తాలిబన్లు చెబుతున్నారు.


మీడియాపై ఆంక్షలు..


మరోవైపు అఫ్గాన్ మీడియాపైన కూడా తాలిబన్లు ఆంక్షలు విధించారు. నేషనల్ రెసిస్టెన్స్ ఫోర్స్ నాయకుడు అహ్మద్​ మసూద్​కు సంబంధించిన వార్తలు ప్రసారం చేయొద్దని అఫ్గానిస్థాన్ మీడియాను తాలిబన్లు ఆదేశించారు. ఆయన పంపే సందేశాలు ఎక్కడా కనిపించకుండా నిషేధం విధించారు. ఈ మేరకు రష్యా వార్తా సంస్థ స్పుత్నిక్ వెల్లడించింది.


తాలిబన్ల సీనియర్ కమాండర్ మౌల్వీ ఫసియుద్దీన్ ను నేషనల్ రెసిస్టెన్స్ ఫోర్సెస్ హతం చేశాయి. పంజ్ షీర్ లోయను వశం చేసుకునే ప్రయత్నం చేస్తున్న తాలిబన్లపై రెసిస్టెన్స్ ఫోర్సెస్ ఎదురుదాడికి దిగి ఫసియుద్దీన్‌ను, అతడికి రక్షణగా మరో 12 మంది వరకు మట్టుబెట్టినట్లు తెలుస్తోంది. ఈశాన్య అఫ్గానిస్థాన్ గ్రూప్ చీఫ్‌గా కీలక పదవిలో ఉన్న సీనియర్ కమాండర్ ఫసియుద్దీన్ మరణం వారికి కోలుకోలేని దెబ్బ. మరోవైపు పాకిస్తాన్, చైనా దేశాల ప్రతినిధులను అప్గాన్ ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లు ఆహ్వానించడం ప్రపంచ దేశాలకు మింగుడు పడటం లేదు. ఈ క్రమంలో మౌల్వీ ఫసియుద్దీన్ లాంటి కీలక నేత హతం కావడంతో తాలిబన్లు ప్రతీకారం కోసం ఎదురుచూస్తున్నారు.