అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు తమ లక్ష్యాన్ని నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. నూతన ప్రభుత్వం ఏర్పాటు చేశారని అధికారిక వర్గాల సమాచారం. మహమ్మద్ హసన్‌ను తమ అధినేతగా తాలిబన్లు ప్రకటించుకున్నారు. అయితే ఇది ప్రస్తుతానికి తాలిబన్ల తాత్కాలిక ప్రభుత్వమని ప్రకటించారు. మంగళవారం రాత్రి అఫ్గాన్‌లో నూతన ప్రభుత్వంలో మంత్రులు, సభ్యుల వివరాలు వెల్లడికానున్నాయి. తాలిబన్ సహ వ్యవస్థాపకుడు అబ్దుల్ ఘనీ బారాదర్ అఫ్గాన్ ఉపాధ్యక్షుడుగా వ్యవహరించనున్నారు.


అఫ్గాన్ దాదాపు రెండు దశాబ్దాల తరువాత తాలిబన్ల వశమైంది. గత మూడు వారాలుగా తమ ప్రభుత్వ ఏర్పాటు దిశగా వేసిన తాలిబన్ల అడుగులు లక్ష్యాన్ని చేరుకున్నాయి. మంగళవారం నాడు నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు తాలిబన్లు ప్రకటించుకున్నారు. ఈ మేరకు తాలిబన్ల అధికార ప్రతినిధి జబీఉల్లా ముజాహిద్ మీడియాకు సమాచారం అందించారు. మహమ్మద్ హసన్ సారథ్యంలో తమ పాలన కొనసాగుతుందని, తాలిబన్ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు అబ్దుల్ ఘని బారాదర్ డిప్యూటీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారని స్పష్టం చేశారు.


Also Read: Taliban News: గళమెత్తితే కాల్చేస్తారా? అఫ్గాన్ లో మళ్లీ తాలిబన్ల కాల్పులు






అఫ్గానిస్థాన్‌కు స్వాతంత్ర్యం వచ్చిందని.. తమ వ్యవహారాలలో ఎవరూ జోక్యం కూడదని తాలిబన్ ప్రతినిధి జబీఉల్లా ముజాహిద్ రాజధాని కాబూల్‌లో మీడియా సమావేశంలో పేర్కొన్నాడు. రేపటి నుంచి అఫ్గాన్ వ్యవహారాలలో ఇతర దేశాలు జోక్యం చేసుకోకూడదని సైతం కీలక వ్యాఖ్యలు చేశాడు. అఫ్గాన్ పేరు ఏమైనా మారిందా అనే మీడియా ప్రశ్నపై స్పందించాడు. అఫ్గాన్ పేరును ‘ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గానిస్థాన్’గా మార్చినట్లు తెలిపాడు. తమకు కొరకరాని కొయ్యగా మారిన పంజ్ షీర్‌లో ఎలాంటి యుద్ధం, భయానక వాతావరణం లేదన్నాడు. అఫ్గాన్‌లో ఇక తాలిబన్లదే రాజ్యమని, తమ నిర్ణయాలే అక్కడ అమలులో ఉంటాయని వివరించాడు.


Also Read: Afghanistan Crisis: పంజ్ షీర్‌లో తాలిబన్లకు భారీ ఎదురుదెబ్బ.. సీనియర్ కమాండర్ ఫసియుద్దీన్ హతం 


తమ గత పాలన అంటే 1996-2001 మధ్యకాలంలో చేసిన పాలనకు ప్రస్తుతం చేపట్టిన ‘ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గానిస్థాన్’ ప్రభుత్వానికి చాలా వ్యత్యాసం ఉంటుందని జబీఉల్లా ముజాహిద్ తెలిపాడు. అయితే తమ సిద్ధాంతాలలో ఎలాంటి మార్పు రాలేదని, కేవలం ఆలోచన తీరు మారిందని తాలిబన్లు ఇటీవల ప్రకటించారు. ప్రస్తుతం ఏర్పడిన తాలిబన్ ప్రభుత్వం తాత్కాలిక ప్రభుత్వమేనని, త్వరలో పూర్తి స్థాయిలో తాలిబన్ ప్రభుత్వం అఫ్గాన్‌లో రాజ్యమేలుతుందని వారి ప్రతినిధి పేర్కొన్నాడు.