రాయలసీమ ఎత్తిపోతల పథకంపై దాఖలపై పిటిషన్లపై శుక్రవారం ఎన్జీటీ(నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్)లో విచారణ జరగనుంది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీకి నివేదిక సమర్పించింది. ఈ పథకం డీపీఆర్ రూపొందించడానికి అవసరమైన పనులను మాత్రమే చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. సీడబ్ల్యూసీ నుంచి అనుమతుల కోసం అవసరమైన పనులు మాత్రమే చేపట్టినట్లు తెలిపింది. జులై 7 నుంచి డీపీఆర్ పనులను నిలిపివేసినట్లు వెల్లడించింది. ఆ ప్రదేశంలో యంత్రాలు లేవని, కార్మికులు కూడా లేరని ఎన్జీటీకి తెలిపింది. రాయలసీమ ఎత్తిపోతల ప్రధాన ప్రాజెక్టు పనులు చేపట్టినట్లు జాయింట్ కమిటీ పేర్కొనలేదని ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ట్రైబ్యునల్‌ను ఏపీ ప్రభుత్వం కోరింది.
అఫిడవిట్ దాఖలు
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఎన్జీటీలో అఫిడవిట్ దాఖలు చేశారు. 8.89 కిలోమీటర్ల అప్రోచ్ ఛానల్ నిర్మాణానికి 250 లక్షల క్యూమెక్స్ తవ్వకాలు జరగాల్సి ఉండగా 30% అంటే 74 క్యూమెక్స్ తవ్వినట్లు తెలిపారు. ఐఐటీ సభ్యుల టీమ్ 2020లో ఇచ్చిన నివేదికలోని 5వ సిఫారసు ప్రకారం అప్రోచ్ ఛానల్ నిర్మాణంలో సున్నపురాయి ఉండటంతో నీటిని పీల్చుకునే అవకాశం ఉందన్నారు. అందువల్ల ఈ ఛానల్ ను మరింత లోతుగా తవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పంప్ హౌస్ నిర్మాణంలో భాగంగానే 1 నుంచి 12 స్లోపుల నిర్మాణం చేపట్టామని తెలిపారు. వర్షాలతో ఇవి కుంగిపోకుండా నివారించేందుకు గోడలు నిర్మించామని పేర్కొన్నారు. అంతేగానీ ప్రాజెక్టు పనుల్లో భాగంగా ఎలాంటి కాంక్రీట్ పనులు చేపట్టలేదన్నారు.
అధ్యయనంలో భాగంగా
250 మీటర్ల వెడల్పు, 40 మీటర్ల లోతు పంప్ హౌస్ ఉంటుందని, అధ్యయనంలో భాగంగా కేవలం 50 నుంచి 60 మీటర్ల వరకు తవ్వినట్లు నివేదికలో పేర్కొన్నారు. 1.75 క్యూమెక్స్ కాంక్రీట్ పనులు చేపట్టాల్సి ఉందని, ఈ పనులకు రెండు, మూడు సీజన్‌ల సమయం పట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. వర్షాకాలం అనంతరం నీటిని తొలగించి పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాల్సి ఉందని ఎన్జీటీకి తెలిపారు. 5 మీటర్ల చుట్టుకొలత, 200 మీటర్ల పొడవుతో 12 పైపులైన్లు వేయాల్సి ఉందని, శాంపిళ్లలో భాగంగా 35 నుంచి 40 మీటర్ల పొడవు పైప్ లైన్ వేసినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది.
రాయలసీమ, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలపై విచారణ
జాయింట్ కమిటీ నివేదికపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై పిటిషనర్ గవినోళ్ల శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన ఎన్జీటీలో మెమో దాఖలు చేశారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన పనులన్నింటినీ వక్రీకరిస్తోందన్నారు. జాయింట్ కమిటీ ఆధారాలతో సహా పనులు జరిగినట్లు నివేదిక ఇచ్చినా పనులు జరగలేదని వాదిస్తోందన్నారు. గతంలో ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. అందువల్ల కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని కోరారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై దాఖలైన పిటిషన్‌లతోపాటు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులకు సంబంధించి దాఖలైన పిటిషన్‌లపైనా శుక్రవారం చెన్నైలోని ఎన్జీటీ విచారణ జరగనుంది.