Cricket Betting Case: ఓవైపు ఆన్లైన్ బెట్టింగ్ ప్రాణాలు తీస్తోందని, వాటి జోలికి వెళ్లి జీవితాలు నాశనం చేసుకోవద్దని పోలీసులు, అధికారులు చెబుతున్నారు. అయినా కొందరిలో మార్పు రావడం లేదు. ఐపీఎల్ సీజన్ లో ఏపీలో యధేచ్ఛగా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వారిని పోలీసులు గుర్తించి కొందర్ని అరెస్ట్ చేశారు. ఏపీ, తెలంగాణలో పలు నగరాలను టార్గెట్ చేసుకుని ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వై మురళి, ఎం వెంకట్రావులను పోలీసులు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఆదివారం నాడు అరెస్ట్ చేశారు. ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వైసీపీ నేత ఎడ్ల తాతాజీ తో పాటు అతడి సోదరుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

ఏపీ, తెలంగాణలో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ దందా

నరసాపురం డిఎస్పి శ్రీ వేద ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం కేంద్రాలుగా చేసుకొని కొందరు ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని పాలకొల్లు పోలీసులకు సమాచారం అందింది. దాంతో పోలీసులు పాలకొల్లు పరిధిలోని పెనుమదం బైపాస్ రెడ్డి సమీపంలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్న సమాచారంతో ఆకస్మిక దాడి చేశామన్నారు. మురళి, వెంకట్రావు అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి పది సెల్ ఫోన్లు రెండు ల 30000 నగదు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఆన్లైన్ బెట్టింగ్ కు సంబంధించి వైసీపీ నేత, ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎడ్ల తాతాజీ తోపాటు ఆయన సోదరుడు నాగేశ్వరరావు పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వీరు గత కొన్ని ఏళ్లుగా ఆన్లైన్ బెట్టింగ్ రాకెట్ నిర్వహిస్తున్నారని పోలీసులు స్పష్టం చేశారు. పరారీలో ఉన్న వైసీపీ నేత ఆయన సోదరుడు కోసం రెండు స్పెషల్ టీమ్స్ తో గాలింపు చర్యలు చేపట్టామని వెల్లడించారు.