Andhra Pradesh News: నెల్లూరు జిల్లా వైసీపీ ఇన్ చార్జ్ ల విషయంలో జగన్ కీలక మార్పులు చేశారు. మాజీ మంత్రి అనిల్ కి ఏ నియోజకవర్గం కూడా కేటాయించలేదు. ఆయన్ని కేవలం నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో పార్టీ పరిశీలకుడిగా నియమించాకు. ఆయన రెండు దఫాలు ప్రాతినిధ్యం వహించిన సిటి నియోజకవర్గానికి ఇన్ చార్జ్ గా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని నియమించారు. ఇక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కాకాణికి మళ్లీ ఛాన్స్ ఇచ్చారు. గత ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన విజయసాయిరెడ్డికి పార్టీకి సంబంధించి ఎలాంటి బాధ్యత ఇవ్వలేదు. ఆయన హడావిడి ఆ ఎన్నికలతోనే ముగిసిపోయినట్టయింది. 


ఓవైపు బాలినేని లాంటి నేతలు చేజారిపోతున్నా.. మరోవైపు వివిధ జిల్లాల్లో పార్టీని పటిష్టపరిచేందుకు వైసీపీ అధినేత జగన్ ప్రయత్నాలు ప్రారంభించారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి పార్టీలో భారీ మార్పులు చేర్పులు చేశారు. నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిని మార్చేశారు. గత ఎన్నికల సమయంలో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పనిచేశారు. ఆయన స్థానంలో ఇప్పుడు మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డికి అవకాశమిచ్చారు జగన్. గతంలో కాకాణి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు కూడా. అయితే మంత్రి అయ్యాక, ఆ బాధ్యత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఇచ్చారు. ఆయన పార్టీ మారడంతో ఆ బాధ్యతలు చంద్రశేఖర్ రెడ్డికి మారాయి. ఇప్పుడు తిరిగి ఉమ్మడి జిల్లా బాధ్యతల్ని కాకాణికే అప్పగించారు జగన్. 






నెల్లూరు రూరల్, సిటీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇన్ చార్జ్ లను మార్చారు జగన్. గత ఎన్నికల్లో నెల్లూరు సిటీ సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ని నర్సరావుపేట ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించారు జగన్. నెల్లూరు సిటీ నుంచి కార్పొరేటర్ ఖలీల్ కి ఛాన్స్ ఇచ్చారు. ఈ ప్రయోగం విఫలమైంది. అక్కడ అనిల్ ఓడిపోయారు, ఇక్కడ ఖలీల్ కూడా గెలవలేదు. దీంతో సిటీ స్థానాన్ని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి ఇచ్చారు. ఖలీల్ ని బుజ్జగించేలా.. వైసీపీ రాష్ట్ర మైనార్టీ సెల్‌ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. 


నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. రూరల్ లో ఆయన కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆయన్ను ఆ స్థానం నుంచి తప్పించి ఇన్ చార్జ్ గా ఆనం విజయ కుమార్ రెడ్డిని నియమించారు. ఆదాల ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు పార్లమెంట్ స్థానానికి ఇన్ చార్జ్ ని చేశారు. నెల్లూరు పార్లమెంట్ నుంచి తాజా ఎన్నికల్లో విజయసాయిరెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన జిల్లాకు చెందిన నేతే అయినా.. ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడూ లేరు. నెల్లూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోవడంతో ఆయన జిల్లాకు కూడా దూరమయ్యారు. ఇప్పుడు నెల్లూరు పార్లమెంట్ స్థానానికి వైసీపీ ఇన్ చార్జ్ గా ఆదాలను నియమించారు. 


Also Read: చంద్రబాబు 100రోజుల పాలన ఎలా ఉంది..? ప్రశంసలు, విమర్శల సంగతేంటి..?


కందుకూరు నియోజకవర్గం సహా నెల్లూరు ఉమ్మడి జిల్లా అద్యక్షుడిగా కాకాణికి ప్రమోషన్ వస్తే.. ఉన్న సిటీ నియోజకవర్గాన్ని కూడా కోల్పోయిన అనిల్ కి ఇది తీవ్ర నిరాశ అని చెప్పుకోవాలి. అనిల్ ని కేవలం నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో పార్టీ పరిశీలకుడిగా నియమించారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి పార్టీ పదవుల్లో జరిగిన ఈ ఈ కీలక మార్పులు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో చూడాలి. 


Also Read: జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు