100 Days For NDA Ruling In AP: ముఖ్యమంత్రిగా చంద్రబాబుకి పరిపాలన కొత్త కాదు. 9 ఏళ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా.. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. సీఎంగా 14 ఏళ్ల అనుభవం ఉన్న ఆయన పనితీరుని ఇప్పుడు కొత్తగా బేరీజు వేయాలనుకోలేం. కానీ ఆ 14 ఏళ్లు ఒక లెక్క. ఇప్పుడు జరుగుతున్న ఐదేళ్ల పాలన మరో లెక్క అన్నట్టుగా ఉంది ఏపీ రాజకీయం. ఈ 100రోజులు ఆయనకు చాలా ప్రత్యేకం. ఆ విషయం ఆయనే స్వయంగా చెప్పారు. ఈ 100 రోజుల్లో చంద్రబాబు చేసిందేంటి..? చేయలేనిదేంటి..? ఎక్కడైనా ఏడాది పాలనపై రివ్యూ సహజం. కానీ ఏపీలో 100రోజులకే ఎందుకు రాజకీయం వేడెక్కింది..?


చంద్రబాబు తొలి సంతకాలు
ఈ దఫా చంద్రబాబు పాలన తొలి సంతకాలతో మొదలైంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన మెగా డీఎస్సీ ఫైలుపై తొలి సంతకం చేశారు. రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై చేశారు. మూడో సంతకం పెన్షన్ల పెంపు, నాలుగో సంతకం అన్న క్యాంటీన్ల ఏర్పాటు, ఐదో సంతకం నైపుణ్య గణన ఫైల్ పై చేశారు. అయితే ఈ సంతకాల ఫలితాల విషయానికొస్తే పెన్షన్ల పెంపు అనేది అన్నిటికంటే ఎక్కువ ప్రభావం చూపింది. అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే తాను చెప్పినట్టుగా పెన్షన్లు పెంచి ఇచ్చారు చంద్రబాబు. పాత బకాయిలు కూడా కలిపి ఇవ్వడంతో ఒక్కొకరికి రూ.7 వేలు అందాయి. ఆ తర్వాత నెలకు రూ.4వేలు వృద్ధులు, వితంతువులకు.. ఇతరులకు వారి కేటగిరీలను బట్టి పెరిగిన పెన్షన్లు అందుతున్నాయి. వైసీపీ హయాంలో వృద్ధులతో సమానంగా పెన్షన్లు తీసుకుంటున్న వికలాంగులు ఈ దఫా భారీగా లబ్ధి పొందారు. 


తొలి సంతకాల తర్వాత చంద్రబాబు తీసుకున్న మరో కీలక నిర్ణయం శ్వేత పత్రాలు. శ్వేత పత్రాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందనే విషయాన్ని ఆయన ప్రజల ముందుంచారు. అయితే ఈ శ్వేత పత్రాలకు ఎప్పటికప్పుడు ప్రతిపక్ష వైసీపీ కౌంటర్లిస్తూనే ఉంది. శ్వేత పత్రాల్లో ఆయన చెప్పినవన్నీ అసత్యాలని ఆరోపించింది. శ్వేతపత్రాలు, వాటిలోని అంశాలు, ప్రతిపక్షం విమర్శలు.. సామాన్య ప్రజల్లోకి అంతగా వెళ్లలేదు. వాటి గురించి మీడియాలోనే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. 


పథకాలు..
సూపర్ సిక్స్ హామీలన్నీ ఒకేసారి అమలు చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తుండగా, అందులో కొన్ని అవి కూడా విడతల వారీగా అమలు చేయడానికి సీఎం చంద్రబాబు ఆసక్తి చూపిస్తున్నారు. అదే సమయంలో వైసీపీ గతంలో ఇచ్చిన నేతన్న నేస్తం లాంటి పథకాలు ఏవని ఆ పార్టీ నేతలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. అసలు అమ్మఒడికి కూడా ఎగనామం పెట్టారని, నీకు 15వేలు, నీకు 15వేలు అంటూ నేరుగా జగన్ కూడా రంగంలోకి దిగి ఎగతాళి చేస్తున్నారు. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదంటూ కొన్ని పథకాలను ఉద్దేశపూర్వకంగానే వెనక్కి నెట్టేశారు చంద్రబాబు. దీపావళి నుంచి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ఇటీవలే తీపి కబురు చెప్పారు. 


Also Read: యువకుడు కూడా చంద్రబాబులా పని చేయలేడు, మేం అండగా ఉంటాం - పవన్ కల్యాణ్


విపత్తులు, విళయాలు..
చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏపీలో జరిగిన పెద్ద ప్రమాదాల్లో  అచ్యుతాపురం సెజ్ దుర్ఘటన ఒకటి. ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో 17మంది మృతి చెందారు, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విపత్తు విషయంలో ప్రభుత్వ స్పందన, పరిహారం ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం చూపిన చొరవను కొంతమంది ప్రశంసిస్తుంటే.. విపక్ష నేతలు తీవ్ర విమర్శలు చేశారు. 


ఇటీవల విజయవాడ జల విలయం కూడా చంద్రబాబు 100 రోజుల పాలనలో ఒక సవాల్ గా నిలిచింది. ఈ విపత్తుని ఎదుర్కోవడంలో చంద్రబాబు వన్ మ్యాన్ షోని మీడియా హైలైట్ చేసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో నేరుగా ప్రయాణించడం, బుల్డోజర్లు ఎక్కి ప్రజల వద్దకు వెళ్లి పరామర్శించడం, వరద సాయం ప్రకటించడంతో చంద్రబాబు సమర్థత కనపడిందని అంటున్నారు నేతలు. చంద్రబాబు పాతికేళ్ల యువకుడిలాగా వరద సహాయక చర్యల్లో పాల్గొన్నారని డిప్యూటీసీఎం పవన్ కల్యాణ్ కూడా ప్రశంసించారు. ఇక వైసీపీ విమర్శలు కూడా ఘాటుగానే ఉన్నాయి. చంద్రబాబు కేవలం ప్రచారానికే ప్రాధాన్యత ఇచ్చారని జగన్ ఆరోపించారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద చిక్కుకుపోయిన బోట్ల వ్యవహారం కూడా రాజకీయ రచ్చగా మారింది. 


రాజకీయ నిర్ణయాలు..
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై ఆరోపణలు వచ్చిన వెంటనే టీడీపీ ఆయనపై వేటు వేసింది. ఈ విషయంలో చంద్రబాబు కఠినంగా వ్యవహరించారని, ఏ స్థాయిలో ఉన్నవారు తప్పు చేసినా సహించేది లేదంటూ క్లియర్ మెసేజ్ పంపించారని టీడీపీ నేతలంటున్నారు. అధికారుల బదిలీలు, కొంతమంది అధికారులపై వేటు వ్యవహారం కూడా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్స్ గా మారాయి. పోలవరం నిర్మాణానికి, అమరావతికి.. కేంద్రం నిధుల హామీ ఇచ్చింది. ఈ 100 రోజుల్లో జరిగిన సానుకూల పరిణామం ఇది. మరి రాబోయే రోజుల్లో పనుల పురోగతి ఎలా ఉంటుందో చూడాలి. పోలవరం, అమరావతి.. చంద్రబాబు పాలనకు గీటురాళ్లుగా మారతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. 


Also Read: దీపావళి నుంచే ఏపీలో ఉచిత గ్యాస్, నేటి నుంచే బంగ్లాదేశ్ తో తొలి టెస్టు -మార్నింగ్ టాప్ న్యూస్