Nellore Court Theft Case: కొన్ని రోజుల కిందట ఏపీలో సంచలనం రేపిన నెల్లూరు కోర్టులో చోరీ ఘటన కేసును సీబీఐ విచారణకు అప్పగించడంపై అభ్యంతరం లేదని అడ్వకేట్ జనరల్ (ఏజీ) హైకోర్టుకు తెలిపారు. నెల్లూరు కోర్టులో చోరీ ఘటనపై హైకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టింది. సీబీఐ డైరెక్టర్, డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ చోరీ కేసు దర్యాప్తు పురోగతిపై నివేదిక ఇవ్వాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటపై హైకోర్టు సుమోటో విచారణ మే 6కి వాయిదా వేసింది.
ఏపీ హైకోర్టు సుమోటోగా విచారణ..
ఏపీ సీఎం వైఎస్ జగన్ కేబినెట్‌లో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న కాకాణి గోవర్దన్ రెడ్డి నిందితుడిగా ఉన్న కేసు నెల్లూరు నాలుగో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి పరిధిలో విచారణలో ఉంది. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు చోరీ కావడం ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈకేసు దర్యాప్తు సరిగా జరగడం లేదని, ఏదైనా స్వతంత్ర్య దర్యాప్తు సంస్థ ద్వారా విచారణ జరిపితే నిజాలు వెలుగుచూస్తాయని నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సమర్పించిన నివేదిక ఆధారంగా ఏపీ హైకోర్టు ఈ కేసును సుమోటో పిల్‌గా తీసుకుంది. మంగళవారం హైకోర్టు ఈ కేసు విచారణ జరిపింది.
నెల్లూరు కోర్టులో చోరీ కేసు దర్యాప్తును సీబీఐకి విచారణకు అప్పగించినా తమకు ఏ అభ్యతరం లేదని ఏజీ హైకోర్టు ధర్మాసనానికి స్పష్టం చేశారు. విచారణ జరిపిన ఏపీ హైకోర్టు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో పాటు సీబీఐ డైరెక్టర్, ఏపీ డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. కేసు దర్యాప్తునకు సంబంధించి తాజా వివరాలతో నివేదిక ఇవ్వాలని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఆదేశించింది.
సీబీఐ విచారణకు సూచించిన మంత్రి కాకాణి..
నెల్లూరు కోర్టులో తనపై ఉన్న కేసుకు సంబంధించిన సాక్ష్యాలను దొంగతనం చేయడంపై వస్తున్న విమర్శలకు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇటీవల కౌంటర్ ఇచ్చారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తనను బద్నాం చేసేందుకే ఈ పని చేసినట్లుగా అనుమానం కలుగుతోందని చెప్పారు. తనపై ఆరోపణలు చేయడానికి బదులుగా సీబీఐ విచారణకు డిమాండ్ చేయడం సబబని మంత్రి కాకాణి సూచించారు. సాక్ష్యాలు మాయం చేయాలనే ఉద్దేశం ఉన్నవారైతే.. కోర్టులోనుంచి బ్యాగ్ బయటకు తీసుకొచ్చి, కాగితాలు మాత్రం కోర్టులో చల్లి వెళ్లిపోతారా అని ప్రశ్నించారు. ఎవరైనా చోరీ చేస్తే విలువైనవి ఎత్తుకెళ్తారని, కానీ వారికి అవసరం లేనివి కనుకే పేపర్లను అక్కడే పడవేసి దొంగలు వెళ్లిపోయి ఉంటారని అభిప్రాయపడ్డారు.
Also Read: Nellore Court Theft Politics : కొలంబియా తర్వాత నెల్లూరులోనే ! కోర్టు చోరీ ఘటనపై రాజకీయ కలకలం