భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సరికొత్త ప్రయోగానికి సిద్ధమవుతోంది. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్, ఇస్రో సంయుక్త ఆధ్వర్యంలో ఈ ప్రయోగం జరుగుతుంది. ఈ మూడు సంస్థలు యూకేలోని నెట్ వర్క్ యాక్సెస్ అసోసియేషన్ లిమిటెడ్(వన్ వెబ్ కంపెనీ)తో ఒప్పంగం కుదుర్చుకున్న మేరకు ఈ ప్రయోగం చేపట్టబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 21వ తేదీ అర్ధరాత్రి 12.02 నిమిషాలకు శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరుగుతుంది.
అర్థరాత్రి ప్రయోగం..
సహజంగా ఇస్రో ప్రయోగాలేవీ ఇటీవల కాలంలో అర్థరాత్రి జరగలేదు. కానీ ఈ దఫా ప్రయోగం అర్థరాత్రి సరిగ్గా 12 గంటల 2 నిమిషాలకు జరగబోతోంది. షార్ సెంటర్ లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగం చేపడతారు. జియో శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (జీఎస్‌ఎల్‌వీ మార్క్-3, ఎం-2) ఉపగ్రహ వాహకనౌక ద్వారా ఈ ప్రయోగం జరుగుతుంది. జీఎస్ఎల్వీ ప్రయోగంకోసం అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి.
నెట్‌వర్క్ యాక్సెస్ అసోసియేషన్ లిమిటెడ్(వన్ వెబ్ కంపెనీ) సంస్థ యూకేకి చెందినది. ఈ సంస్థతో ఇస్రో, న్యూ స్పేస్ ఇండియా, డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ సంస్థలు ఈ ప్రయోగాన్ని చేసేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వన్ వెబ్ కంపెనీకి చెందిన మొత్తం 108 ఉపగ్రహాలను ప్రయోగించాలనేది ఈ ఒప్పందం. ఇందులో భాగంగా తొలివిడతలో 36 ఉపగ్రహాలను ప్రయోగించబోతున్నారు. దీని తర్వాత మళ్లీ రెండు విడతల్లో 72 ఉపగ్రహాలను.. అంటే మొత్తం మూడు విడతల్లో 108 ఉపగ్రహాలు ప్రయోగిస్తారు.
ఈ ఉపగ్రహాలను ఒకేసారి లోయర్ ఎర్త్ ఆర్బిట్ (లియో అర్బిట్) లోకి పంపిస్తారు. ఒక్కో ఉపగ్రహం బరువు 137 కిలోలు ఉంటుందని, 36 ఉపగ్రహాలు కలిపితే 4,932 కిలోల బరువు ఉంటాయని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. వీటిలో ఫ్యూయల్ ని కూడా నింపితే మొత్తం బరువు 5.21 టన్నులు ఉంటుంది. జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 ఎం-2 వాహకనౌక ద్వారా ఈ ఉపగ్రహాలను లియో ఆర్బిట్ లో ప్రవేశ పెడతారు.
ఎందుకీ ప్రయోగం..?
వన్ వెబ్ కంపెనీ గ్లోబల్ కమ్యూనికేషన్ నెట్ వర్క్ గా రూపాంతరం చెందింది. వాణిజ్యపరంగా ఇంటర్నెట్ సేవలను విస్తరించబోతోంది. ప్రస్తుతం ప్రయోగించే ఉపగ్రహాలు కూడా ఇంటర్నెట్ సేవల విస్తరణకు ఉపయోగపడతాయి. చౌకగా ఈ ఉపగ్రహాలను నింగిలోకి పంపేందుకు ఇస్రో ఒప్పుకోవడంతో యూకే కంపెనీ ఇక్కడినుంచి ఈ ప్రయోగం చేపట్టబోతోంది. ఇది పూర్తిగా వాణిజ్య ప్రయోగంగా చెబుతున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు.
ఇంటర్నెట్ సేవల విస్తరణకోసం వన్ వెబ్ కంపెనీ ఈ ప్రయోగం చేపడుతోంది. మొత్తం 108 ఉపగ్రహాలతో పూర్తి స్థాయిలో ఇంటర్నెట్ సేవలు అత్యంత వేగంగా అందుబాటులోకి రాబోతున్నాయి. మూడు దఫాలుగా ఈ ప్రయోగం జరుగుతుంది. తొలి దఫా 36 ఉపగ్రహాలను ఈనెల 21న ప్రయోగిస్తారు. ఆ తర్వాత రెండుసార్లు మిగిలిన 72 ఉపగ్రహాలను రెండు విడతల్లో ప్రయోగిస్తారు. మొత్తం 108 ఉపగ్రహాల ప్రయోగం తర్వాత ఇంటర్నెట్ సేవల్లో వ్యత్యాసం తెలుస్తుందని అంటున్నారు.