ప్రశాంతంగా ఉండే నెల్లూరు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇరువర్గాల గొడవ, ఆ గొడవలో ఒకరికి సీరియస్ కావడం, అతడిని ఆస్పత్రిలో చేర్పించడం.. ఇలా వాతావరణం వేడెక్కింది. సండేమార్కెట్ లో జరిగిన ఈ ఘటనతో అక్కడ పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఖాకీల పహారాలో రద్దీగా ఉండే క్లాత్ మార్కెట్ ప్రాంతం ఇప్పుడు బోసిపోయింది. 


నెల్లూరులోని సండే మార్కెట్ ప్రాంతం అది. చిన్న చిన్న షాపులు 50 వరకు ఉంటాయి. తమిళనాడుకు చెందినవారు ఇక్కడ షాపులు ఏర్పాటు చేసుకుని ఉంటారు. ఈ క్రమంలో ఇక్కడ ఓ షాపు అమ్మకం విషయంలో వివాదం తలెత్తింది. అది దాడుల వరకు వెళ్లింది. వామపక్షాల నాయకులు మధ్యలో ఎంట్రీ ఇచ్చారు. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నాయి. పోలీసులు రెండు గ్రూపుల్ని చెదరగొట్టినా కూడా కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కర్రలు, మారణాయుధాలతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో శివశంకర్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. పోలీసులు లాఠీ చార్జి చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. అక్కడ పికెట్ ఏర్పాటు చేశారు. 




నెల్లూరులో సండే మార్కెట్ ప్రాంతం చాలా ఫేమస్. రోడ్డు పక్కనే ఇక్కడ షాపులు ఉంటాయి. నెల్లూరులో రకరకాల షాపింగ్ మాల్స్ ఏర్పాటైనా కూడా ఇక్కడ రోడ్డు పక్కన బిజినెస్ మాత్రం ఏనాడూ తగ్గలేదు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలనుంచి వచ్చే వారంతా ఇక్కడ బట్టలు కొనుగోలు చేస్తుంటారు. పండగల సీజన్లో ఈ సండే మార్కెట్ ఫుల్ బిజీ. బట్టలు, చెప్పులు.. అన్ని షాపులు ఇవే. ప్రత్యేకత ఏంటంటే.. తమిళనాడు వాళ్లు మాత్రమే ఈ సండే మార్కెట్లోని షాపుల్లో దుస్తులు, చెప్పులు అమ్ముతుంటారు. 


తరతరాలుగా వ్యాపారం..
నెల్లూరు సండే మార్కెట్ లో తమిళనాడుకు చెందినవారు తరతరాలుగా వ్యాపారం చేస్తూ ఉంటారు. ఈ షాపులకు వారే యజమానులు. షాపుల్ని అద్దెకు ఇవ్వాలంటే వారికి సంబంధించిన వారే తీసుకోవాలి. అదే ఇక్కడి నియమం. అన్ని షాపుల్లోనూ ఒకటే రేటు. ఆ రేటుకంటే తక్కువకు ఎవరూ అమ్మడానికి వీల్లేదు. అది వారి నియమం. ఇక్కడ అన్నీ క్లాత్ బ్యాగులే వినియోగిస్తారు. ప్లాస్టిక్ కవర్లను వీరు చాన్నాళ్ల క్రితమే నిషేధించారు. ఇలా నెల్లూరుకే సంథింగ్ స్పెషల్ గా ఉన్న సండే మార్కెట్లో గొడవ జరగడం, తలలు పగడలం ఇప్పుడు సంచలనంగా మారింది. 


సండే మార్కెట్ పై కార్పొరేట్ శక్తుల కన్నుపడిందా..?


నెల్లూరులో షాపింగ్ అంటే.. మాల్స్ కి వెళ్లనివారయినా ఉంటారేమో కానీ, సండే మార్కెట్ కి రాని వారు మాత్రం ఉండరు. ముఖ్యంగా మధ్యతరగతి వారికి ఇది ప్రధాన షాపింగ్ సెంటర్. ఇటీవల కొన్ని కార్పొరేట్ కంపెనీలు ఈ పరిసర ప్రాంతాల్లో షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేశాయి. కానీ ఇక్కడ బిజినెస్ మాత్రం తగ్గలేదు. దీంతో ఈ వ్యాపార కూడలిని ఇక్కడినుంచి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. అందులో భాగంగానే ఈరోజు గొడవ జరిగినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం పోలీస్ పహారాలో ఆ ప్రాంతం ఉంది. షాపులో మూతబడ్డాయి. ఈ గొడవలు తగ్గి అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొనాలని ఆశిస్తున్నారు నెల్లూరువాసులు.