ఎస్‌ఐపీబీలో గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన ప్రాజెక్టులు వీలైనంత త్వరగా ప్రారంభమయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని ఎపీ సీఎం జగన్ అధికారులకు సూచించారు. అన్ని రకాలుగా ఆయా సంస్థలకు చేయూత ఇవ్వాలాని, పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పించే సంస్థలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ ఆదేశించారు. పరిశ్రమలకు చేయూతనిచ్చేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని కూడా ఆయన సూచించారు. ఇందులో సీఎస్, సీఎంఓ అధికారులు ఉండేలా చూడాలని తెలిపారు. అనుమతుల్లో జాప్యం లేకుండా నిర్ణీత కాలవ్యవధిలోగా వాటికి క్లియరెన్స్ ఇవ్వాలని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ పోర్టులు, ఫిషింగ్ హార్భర్ల నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు.
రామాయపట్నం పోర్టులో మార్చి 2024 నాటికి కార్యకలాపాలు ప్రారంభమయ్యేలా పనులు వేగంగా జరుగుతున్నాయని అధికారులు సీఎంకు వివరించారు. 2023 డిసెంబరు నాటికి పనులు పూర్తయ్యేలా ప్రయత్నించాలని అధికారులకు జగన్ సూచించారు. మచిలీపట్నం పోర్టు పనులు నవంబరు నుంచి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు అధికారులు. భావనపాడు పోర్టు పనులను డిసెంబర్‌లో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లె చెప్పారు.
మొదటి విడతలో నిర్మించనున్న జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్భర్ల పనుల ప్రగతిని సీఎం సమీక్షించారు. 2023 జూన్ నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం... రెండో దశలో నిర్మించనున్న ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణంపైనా దృష్టిపెట్టాలని స్పష్టం చేశారు. రాష్ట్రానికి మంజూరైన బల్క్‌డ్రగ్ పార్కు నిర్మాణ ప్రణాళికను సీఎంకు వివరించిన అధికారులు, బల్క్ డ్రగ్‌పార్కులో కంపెనీలు పెట్టేందుకే మేజర్ ఫార్మా కంపెనీల నుంచి ఇప్పటికే ప్రతిపాదనలు వచ్చాయన్న సీఎం కు వివరించారు.
డిసెంబరు నాటికి పూర్తిస్ధాయిలో ఇంటర్నెట్...
డిసెంబరు నాటికి అన్ని గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, స్కూళ్లు వీటన్నింటికీ కూడా ఫైబర్‌తో అనుసంధానంచేసి ఇంటర్‌నెట్ సౌకర్యం కల్పించాలనిన సీఎం ఈ సందర్బంగా స్పష్టం చేశారు. 5జీ సేవలను గ్రామాలకు చేరవేయడంలో ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ కీలక పాత్ర పోషిస్తుందని, దీని కోసం టెలికాం దిగ్గజాలతో కలిసి పని చేస్తున్నామని అధికారులు జగన్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన జగన్ డిజిటల్ లైబ్రరీలు గ్రామాల్లో విప్లవాత్మక మార్పులకు దారితీస్తాయని, వైఎస్సార్ జిల్లా వేల్పులలో ఏర్పాటు చేసిన డిజిటల్ లైబ్రరీ ద్వారా సుమారు 30 మంది అక్కడ నుంచే ఐటీ ఉద్యోగాలు చేస్తున్న విషయాన్ని సీఎం ప్రస్తావించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఈ లైబ్రరీలు వస్తే తమ సొంత గ్రామాల నుంచే మెరుగైన ఉద్యోగాలు చేసే పరిస్థితి వస్తుందని, అందుకే డిజిటల్ లైబ్రరీల ద్వారా వర్క్‌ఫ్రం హోం కాన్సెఫ్ట్‌ను బలోపేతం చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జగన్ అన్నారు. దేశంలోనే ఇదొక వినూత్న వ్యవస్థ అవుతుందని, అనేక మందికి ఆదర్శనీయంగా నిలుస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఎంఎస్‌ఎంఈలకు అధిక ప్రాధాన్యత....
గడచిన మూడేళ్లలో పారిశ్రామిక ప్రగతిపై వివరాలను అధికారులు సీఎంకు అందించారు. ప్రతి జిల్లాలో 2 క్లస్టర్ల చొప్పున ఎంఎస్‌ఎంఈలను నెలకొల్పేందుకు కృషిచేస్తున్నామని పరిశ్రమలు ప్రారంభం కావటం, వాటిని నిలబెట్టే విధంగా కూడా చర్యలు తీసుకోవాలన్నారు. అధికంగా ఉపాధి కల్పిస్తున్న ఎంఎస్‌ఎంఈలకు చేదోడుగా నిలవాలన్న సీఎం,వీటివల్ల పెద్ద సంఖ్యలో ఉపాధి లభిస్తుందని, తద్వారా నిరుద్యోగం తగ్గుతుందన్నారు సీఎం. ఎంఎస్‌ఎంఈలకు అత్యధిక ప్రాధాన్య ఇవ్వాలని స్పష్టం చేశారు.