Mla Kotamreddy Sridhar Reddy : నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత 47 రోజులుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని గ్రామాల్లో ఆయన పర్యటిస్తున్నారు. ప్రతి ఇంటికీ వెళ్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. శుక్రవారం కూడా ఓ కుటుంబం ఇంట్లోనే ఆయన మధ్యాహ్న భోజనం చేశారు. సాయంత్రం ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను వెంటనే నెల్లూరులోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ముందు జాగ్రత్తగా అక్కడి నుంచి చెన్నై అపోలో ఆసుపత్రికి తరలిస్తున్నారు. నెల్లూరులో ఆయనను మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి పరామర్శించారు. ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వైద్యులతో ఫోన్లో మాట్లాడారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకూ ఆమంచర్ల గ్రామంలో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. అక్కడే స్థానికులతో కలిసి భోజనం కూడా చేశారు.
ఛాతిలో నొప్పి
ఆమంచర్ల పర్యటనలో ఉన్నప్పుడు స్వల్పంగా ఛాతిలో నొప్పి రాగా కోటంరెడ్డి పట్టించుకోలేదు. విషయం తెలుసుకున్న కార్యకర్తలు ఆయన్ను నిలువరించి ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకోవాలని పట్టుబట్టారు. దీంతో ఆయన నెల్లూరులోని చిల్డ్రన్స్ పార్కు సమీపంలో ఉన్న ఇంటికి చేరుకున్నారు. విశ్రాంతి తీసుకునే క్రమంలో ఛాతి నొప్పి అధికం కావడంతో వెంటనే ఆయన్ను కుటుంబసభ్యులు సమీపంలోని అపోలో హాస్పిటల్ కు తరలించారు. అపోలో హాస్పిటల్ లో వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందించారు. అనంతరం చెన్నైకి తరలించారు.
Also Read : Atmakur Byelection 2022 : నెల్లూరు జిల్లా మొత్తం ఎన్నికల కోడ్, ఆత్మకూరు ఉపఎన్నిక కోసం పగడ్బందీ ఏర్పాట్లు