నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగుస్తోంది. వైసీపీ నేతలు సందడిగా నామినేషన్లు దాఖలు చేశారు. భారీ ర్యాలీలు చేపట్టారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్వయంగా నామినేషన్ల కార్యక్రమానికి తరలివచ్చారు. నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో 54 డివిజన్లలో వైసీపీ విజయకేతనం ఎగరవేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అభ్యర్థులను నిలబెట్టే దమ్ములేక టీడీపీ తమపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. వామపక్షాలతో, బీజేపీ, జనసేనతో కూడా టీడీపీ పొత్తు పెట్టుకుంటోందని ఆరోపించారు. కొన్ని చోట్ల అభ్యర్థులు లేక, మరికొన్ని చోట్ల ప్రపోజల్స్ ఇచ్చేవారు దొరక్క టీడీపీ అవస్థలు పడుతోందని ఎద్దేవా చేశారు. నేరగాళ్లు, హంతకులకు టీడీపీ టికెట్లు ఇచ్చిందని, నిజంగా వైసీపీ.. అధికారుల్ని, పోలీసుల్ని అడ్డుపెట్టుకుని బెదిరించాలంటే టీడీపీ ఒక్క నామినేషన్ కూడా వేసేది కాదని చెప్పారు. ఓటర్ల లిస్ట్ లో పేర్లు వెదుక్కోవడం చేతగాక టీడీపీ అభ్యర్థులు డ్రామాలాడారని మండిపడ్డారు. 


Also Read: తెలుగు రాష్ట్రాలపై పెట్రో పన్నుల తగ్గింపు ఒత్తిడి ! ఇప్పుడేం చేయబోతున్నారు ?


రంగంలోకి అచ్చెన్నాయుడు


నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల బాధ్యతను చంద్రబాబు.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకి అప్పగించినట్టు తెలుస్తోంది. కార్పొరేషన్ ఎన్నికలను టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంతో నేరుగా అచ్చెన్నాయుడు రంగంలోకి దిగారు. నోటిఫికేషన్ వెలువడిన మరుసటి రోజు నుంచి ఆయన నెల్లూరులోనే మకాం వేశారు. స్థానిక నేతలతో మంతనాలు సాగిస్తున్నారు. నెల్లూరు కార్పొరేషన్ గత ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించి వైసీపీ తరపున మేయర్ గా అబ్దుల్ అజీజ్ ఎన్నికయ్యారు. ఆ తర్వాత మేయర్ సహా కొంతమంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ కండువా కప్పుకున్నారు. దీంతో కార్పొరేషన్ టీడీపీ వశమైంది. కార్పొరేషన్ కాలపరిమితి పూర్తయిన తర్వాత కోర్టు కేసుల వల్ల ఎన్నిక వాయిదా పడుతూ వచ్చింది. రాష్ట్రంలోని మిగతా కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గా, నెల్లూరు మాత్రం వాయిదా పడింది. ఇప్పుడు కోర్టు కేసుల అడ్డంకి తొలగిపోవడంతో నెల్లూరు కార్పొరేషన్ లోని 54 డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. అటు వైసీపీ క్లీన్ స్వీప్ కోసం ప్రయత్నిస్తోంది. మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి సహా ఇతర కీలక నేతలు నెల్లూరు వచ్చి ప్రచార కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఇటు టీడీపీ తరఫున అచ్చెన్నాయుడు రంగంలోకి దిగారు. 


Also Read: ఆ రైతుల వెనుక టీడీపీ... అందరికీ అణాపైసలతో సహా చెల్లిస్తామన్న బొత్స !


టీడీపీ వ్యూహ రచన


స్థానిక నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బీదా రవిచంద్ర, నెల్లూరు పార్లమెంటరీ పార్టీ టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్.. ఇతర కీలక నేతలతో అచ్చెన్నాయుడు ప్రచారంపై చర్చిస్తున్నారు. మరో మాజీ మంత్రి చినరాజప్ప కూడా ఇటీవలే జిల్లా పర్యటనకు వచ్చి వెళ్లారు. మేయర్ కుర్చీని కైవసం చేసుకోలేకపోయినా కనీసం కార్పొరేషన్ లో తమ వాదనలు వినిపించేందుకైనా అభ్యర్థుల్ని గెలిపించుకోడానికి పార్టీ వ్యూహ రచన చేస్తోంది. వైసీపీ తరపున టికెట్లు ఆశించిన భంగపడినవారు, అభ్యర్థులపై అసంతృప్తితో ఉన్నవారిని టీడీపీ తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. 


Also Read:  నామినేషన్ల పేపర్లు లాక్కెళ్లిపోతున్నా భద్రత కల్పించరా ? ఎస్‌ఈసీకీ చంద్రబాబు ఘాటు లేఖ !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి