నెల్లూరు జిల్లా కావలి పోలీస్ స్టేషన్లో ప్రేమ పంచాయితీ జరిగింది. ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుని వచ్చిన యువతి పోలీసుల రక్షణ కోరింది. ఇంతలో తల్లిదండ్రులు వచ్చి అమ్మాయిపై దాడి చేయబోగా పోలీసులు అడ్డుకున్నారు. వారికి సర్దిచెప్పారు. కౌన్సెలింగ్ ఇచ్చి, పిల్లలను ఆదరించాలని సూచించారు. 


పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట


నెల్లూరు జిల్లా పాతబిట్రగుంటకు చెందిన స్వప్న అనే యువతి కావలి పట్టణానికి చెందిన మల్లికార్జునను ప్రేమించింది. అయితే ఈ ప్రేమ వ్యవహారం తెలిసిన తల్లిదండ్రులు ఆ అమ్మాయిని ఇంట్లో బంధించారు. మేనమామకిచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించారు. పెళ్లి జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్న తల్లిదండ్రులు, స్వప్నను భీమవరప్పాడులోని మేనమామ ఇంట్లో బంధించారు. అయితే మేనమామతో పెళ్లి ఇష్టంలేని స్వప్న.. తన ప్రియుడికి కబురు పంపించింది. తనకా పెళ్లి ఇష్టంలేదని, వచ్చి తీసుకెళ్లిపోవాలని కోరింది. స్వప్న మెసేజ్ తో మల్లికార్జున భీమవరప్పాడు వెళ్లాడు. ఆమెను తన వెంట తీసుకొచ్చాడు. పెళ్లి చేసుకుని వెంటనే పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు స్వప్న, మల్లికార్జున. 


Also Read: వరదలో వ్యక్తి గల్లంతు.. 10 గంటల నుంచి గాలింపు, తుపాను ఎఫెక్ట్‌ తెలంగాణపై కూడా..




మల్లికార్జునపై ఫిర్యాదు 


ఈలోగా స్వప్న మేనమామ పోలీస్ స్టేషన్ కి వచ్చి మల్లికార్జునపై ఫిర్యాదు చేశారు. తన మేనకోడలిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడని కొండాపురం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ మొదలు పెట్టారు. అంతలోనే కావలి డీఎస్పీ కార్యాలయంలో ప్రేమజంట పెళ్లి చేసుకుని రక్షణ కోరింది. డీఎస్పీ ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రేమ పంచాయితీ మొదలైంది. తల్లిదండ్రుల్ని పిలిపించడంతో.. వారు కోపంలో స్వప్నపై చేయి చేసుకోబోయారు. వెంటనే పోలీసులు వారించారు. 


Also Read:  భర్త చేసిన పని తట్టుకోలేకపోయిన మహిళా సర్పంచ్, వెంటనే ఆత్మహత్య.. ఏం జరిగిందంటే..


ప్రేమ జంటకు పోలీసుల ఆశ్రయం 


తల్లిదండ్రుల వల్ల తమకు ప్రాణ హాని ఉందని, తమకు రక్షణ కల్పించాలని కోరారు స్వప్న-మల్లికార్జున దంపతులు. మల్లికార్జున చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాడని, వారి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు పోలీసులు. కౌన్సెలింగ్ ఇచ్చినా వారి ఆగ్రహం చల్లారకపోవడంతో వారిని ఇంటికి పంపించారు. ప్రేమ జంటకు ప్రస్తుతం పోలీస్ స్టేషన్లోనే ఆశ్రయం ఇచ్చారు.


Also Read: ప్రియుడు చేసిన పనికి ప్రియురాలు షాక్! రైలు కింద పడి యువతి సూసైడ్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి