Mla Uma Sankar Ganesh :వికేంద్రీకరణకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. ర్యాలీలో బైక్ పై నుంచి నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేశ్ జారిపడ్డారు. గాయపడిన ఎమ్మెల్సేను స్థానిక వైద్యశాలకు తరలించారు. 


బైక్ ఢీకొట్టడంతో ప్రమాదం 


అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మూడు రాజధానులకు మద్దతుగా ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేశ్‌ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అయితే ఈ ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. ఎమ్మెల్యే నడుపుతున్న బైక్‌ను పక్కనున్న మరో బైక్‌ అనుకోకుండా ఢీకొట్టడంతో ఎమ్మెల్యే గణేష్ కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే కాలికి తీవ్రగాయమైంది. కార్యకర్తలు వెంటనే ఎమ్మెల్యేని నర్సీపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం విశాఖలోని మరో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే కాలికి సర్జరీ అవసరమని డాక్టర్లు తెలిపినట్లు సమాచారం.



వికేంద్రీకరణకు మద్దతుగా ర్యాలీలు


వికేంద్రీకరణకు మద్దతు పలు జిల్లాల్లో వైసీపీ నేతలు బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అభివృద్ధి అంతా ఒకే ప్రాంతంలో కేంద్రీకరించడం వల్ల ఎలా నష్టపోయామో చెబుతూ, అలాంటి తప్పిదం మరోసారి చోటుచేసుకోకుండా జాగ్రత్త పడాలని వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధిని ఆకాంక్షిస్తూ సీఎం జగన్ మూడు రాజధానులు ఏర్పాటుచేస్తున్నారని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వికేంద్రీకరణపై రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి మూడు రాజధానులతో ఉండే పాలనా సౌలభ్యాన్ని ప్రజలకు వివరించారు. తాజాగా విశాఖ వేదికగా వికేంద్రీకరణ జేఏసీ కూడా ఏర్పాటు చేశారు. జేఏసీ సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మ శ్రీ స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా కూడా చేశారు.  


నర్సీపట్నంలో అల్లర్లు సృష్టించేందుకే 


కేవలం 29 గ్రామాల అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధిగా భావిస్తూ అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారన్నారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించేందుకు టీడీపీ ప్రయత్నిస్తుందని ఆరోపిస్తున్నారు. మూడు రాజధానులకు మద్దతుగా బైక్‌ ర్యాలీలు, దీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రాన్ని విడదీసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని, అందులో భాగంగా సాగుతున్న అమరావతి పాదయాత్రను ఉత్తరాంధ్రలోకి అడుగు పెట్టకుండా అడ్డుకుంటామని ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్‌ గణేశ్ అన్నారు. శుక్రవారం ఆయన  అనకాపల్లి జిల్లా నాతవరం మండలం పి.జగ్గంపేట నుంచి 1500 బైక్‌లతో గన్నవరం వరకు వికేంద్రీకరణ మద్దతు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభించిందని వైసీపీ నేతలు తెలిపారు. పాదయాత్ర నర్సీపట్నం ప్రాంతానికి వచ్చే సమయానికి అల్లర్లు సృష్టించాలని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కుట్ర పన్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. దానిని అందరూ కలిసి తిప్పికొట్టాలని ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేశ్ పిలుపునిచ్చారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం చింతలపూడిలో వికేంద్రీకరణకు మద్దతుగా చేపట్టిన ర్యాలీలో ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు పాల్గొన్నారు. 


Also Read : వికేంద్రీకరణ మద్దతుగా వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రాజీనామా- జేఏసీకి లెటర్ అందజేత


Also Read : Avanthi Srinivas: ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, వైజాగ్ జేఏసీ మీటింగ్ లో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్