వికేంద్రీకరణ ఉద్యమానికి మద్ద వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్‌లో తన రిజైన్ లెటర్‌ను వికేంద్రీకరణ సాధన సమితికి అందజేశారు. అవసరమైతే రాజీనామా చేస్తానంటూ మంత్రి ధర్మాన ప్రసాద రావు ప్రకటించిన గంటల్లోనే మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు అదే ప్రకటన చేశారు.


నాన్ పొలిటికల్ జె.ఏ.సీ. ఆవిర్భావ సభలో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే ధర్మశ్రీ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి హీట్ పుట్టించారు. విశాఖను అమరావతి రైతులు వ్యతిరేకిస్తే ముమ్మాటికీ అమరావతి రాజధానికి తాము వ్యతిరేకిస్తామన్నారు. దమ్ముంటే రాజీనామాకు అచ్చెన్నాయుడు సిద్ధ పడాలని సవాల్ చేశారు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామాకు తాను సిద్ధమని అదే వేదికపై ప్రకటించారు. అంతే కాదు... స్పీకర్‌ ఫార్మాట్‌లో జె.ఏ.సీ.కన్వీనర్ కు రాజీనామా లేఖ అందజేశారు. ఎగ్జిక్యూటివ్ కెపిటల్‌కు అనుకూలంగా తాను చోడవరంలో వ్యతిరేకిస్తూ టెక్కలిలో అచ్చెన్నాయుడు పోటీకి సిద్ధమవ్వాలన్నారు. కార్యనిర్వాహక రాజధానిని వ్యతిరేకించే నాయకులను రాజకీయాల నుంచి వెలివేయాలని ప్రజలకు ధర్మశ్రీ పిలుపునిచ్చారు. వారం రోజుల పాటు నియోజకవర్గ కేంద్రాల్లో విస్త్రతంగా సమావేశాలు, ర్యాలీలు నిర్వహణకు అధికార పార్టీ నాయకులు పిలుపునిచ్చారు.  


అమరావతి రైతుల పాదయాత్ర, ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చిన వికేంద్రీకరణ రాజకీయాల్లో కాక రేపుతోంది. పాదయాత్రతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రతిపక్షం, రాజీనామాలతో ప్రతిపక్షంపై ఒత్తిడి పెంచాలని అధికార పార్టీ ఎత్తుకుపైఎత్తులతో ఉత్తరాంధ్ర కుతకుత ఉడుకుతోంది. ఇన్నాళ్లూ విమర్శలకే పరిమితమైన వైసీపీ లీడర్లు ఇప్పుడు నేరుగా కార్యక్షేత్రంలోకి దిగారు. అందులో భాగంగానే ధర్మశ్రీ రాజీనామా చేశారు. మరికొందరు తాము కూడా సిద్ధమని ప్రకటించారు. 


ధర్మశ్రీ రాజీనామా పత్రాన్ని జేఏసీకి ఇచ్చిన వెంటనే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌ కూడా అదే మాట వల్లెవేశారు. రాజధాని సాధన కోసం అవసరం అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ ప్రకటించారు. నాన్ పొలిటికల్ జె.ఏ.సీ ప్రకటించిన ఉమ్మడి కార్యాచరణ ప్రకారం రాజధాని ఆకాంక్షను ప్రజలకు చెబుతామన్నారు. భారీ నిరసన ప్రదర్శనలకు రెడీ అన్నారు. 


జేఏసీ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిరంతరంగా కార్యక్రమలు జరగాలి అన్నారు మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌. విశాఖ రాజధానిపై జరుగుతున్న విష ప్రచారాలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. జాయింట్ యాక్షన్ కమిటీకి షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ప్రణాళికలు ఉండాలని సూచించారు. వికేంద్రీకరణకు ఉద్యమం ఉప్పెనలా ఉండాలన్నారు. అక్టోబర్ 15న విశాఖలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టబోతున్నట్టు ప్రకటించారు. అంబేడ్కర్ సర్కిల్ నుంచి వేలాది మందితో ఈ ప్రదర్శన కొనసాగించాలని సూచించారు. అమరావతి రైతులు ఉత్తరాంధ్రలో అడుగుపెట్టే ముందే నిరసన ప్రదర్శనలతో హోరెత్తిపోవాలని పిలుపునిచ్చారు.