విశాఖపట్నం రాజధాని కావాలని, అందుకోసం అవసరమైతే రాజీనామా చేస్తానని ఏపీ మంతి ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు దూమారం రేపుతున్నాయి. ధర్మాన వ్యాఖ్యలతో ఏపీలో రాజీనామా హామీలు మొదలయ్యాయి. ఉత్తరాంధ్ర వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు తాము రాజీనామా చేసేందుకు రెడీ అంటున్నారు. విశాఖలో వికేంద్రకరణపై జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశంలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు సైతం రాజీనామా కామెంట్లు చేశారు. పరిపాలన రాజధానిగా విశాఖ కావడం కోసం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. ఏపీలో కేవలం అమరావతి మాత్రమే కాదు విశాఖ, కర్నూలు సైతం రాజధానులుగా ఉండాలని, ఉంటాయని వైసీపీ నేతలు భావిస్తున్నారు. అందుకోసం తాజాగా ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు, మంత్రులు రాజీనామా చేసేందుకు రెడీ అని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. 


వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాల అభివృద్ధి 
అంతకుముందు విశాఖపట్నంలో వికేంద్రకరణపై జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి రాష్ట్ర ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్, మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు, ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు, ప్రజా సంఘాల నేతలు హాజరయ్యారు. భారీ నిరసన ప్రదర్శన ద్వారా విశాఖ రాజధాని ఆకాంక్షను ప్రజలకు చెబుతాం అన్నారు. వారం రోజులు పాటు నిరంతరంగా నాన్ పొలిటికల్ జె.ఏ.సి. ఆధ్వర్యంలో కార్యక్రమలు జరగాలని పిలుపునిచ్చారు. విభజనతో రాష్ట్రం ఎంతగానో నష్టపోయిందని, వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని అవంతి శ్రీనివాస్ అన్నారు.




కర్నూలు, విశాఖ అభివృద్ధి చెందాలి
రాష్ట్ర విభజన తరువాత ఎంతో నష్టపోయామని, ఇప్పుడు ప్రాంతాల వారీగా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందన్నారు. అమరావతితో పాటు విశాఖ, కర్నూలు కూడా అభివృద్ధి చెందాలన్నది ఏపీ సీఎం వైఎస్ జగన్ ముఖ్య ఉద్దేశం అన్నారు. పదవులు తనకు ముఖ్యం కాదని, విశాఖ అభివృద్ధే ముఖ్యమని, పరిపాలనా రాజధానికిగా విశాఖ అయ్యేందుకు పోరాటంలో భాగంగా అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. 


జాయింట్ యాక్షన్ కమిటీకి షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ప్రణాళిక...
వికేంద్రీకరణ కోసం ఉద్యమం ఉప్పెనలా ఉండాలని,  అక్టోబర్ 15న విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించాలని వైజాగ్ జేఏసీలో నిర్ణయించారు. బీఆర్ అంబేద్కర్ సర్కిల్ నుంచి వేలాది మందితో ర్యాలీ కొనసాగించాలని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. అమరావతి రైతులు ఉత్తరాంధ్రలో అడుగుపెట్టే ముందే నిరసన ప్రదర్శనలు హోరెత్తాలని పిలుపునిచ్చారు. మూడు రాజధానాలు కావాలంటే కచ్చితంగా గట్టి పోరాటం చేయాల్సిందేనని ఉత్తరాంధ్ర జేఏసీ భావిస్తోంది. అందుకోసం తమ పోరాటం ముమ్మరం చేయాలని, వరుస సమావేశాలు, ర్యాలీలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.


ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రాజీనామా !
విశాఖను అమరావతి రైతులు వ్యతిరేకిస్తే  ముమ్మాటికీ అమరావతికి మేము వ్యతిరేకమేనని, దమ్ముంటే రాజీనామాకు అచ్చెన్నాయుడు సిద్ధమా అని ప్రశ్నించారు ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ. ఎగ్జిక్యూటివ్ కెపిటల్ కు అనుకూలంగా తాను చోడవరంలోను... వ్యతిరేకిస్తూ టెక్కలిలో అచ్చెన్నాయుడు పోటీకి సిద్ధం అవ్వాలని సూచించారు. కార్యనిర్వాహక రాజధానిని వ్యతిరేకించే నాయకులను రాజకీయాల నుంచి వెలివేయాలన్నారు. రాజధానిగా విశాఖ కోసం కరణం ధర్మశ్రీ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా సైతం చేసి.. లేఖను ఉత్తరాంధ్ర జేఏసీకి ఇచ్చారు ఎమ్మెల్యే.