Rains in Telangana AP: త్వరలో ఈశాన్య రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించనున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీ, తెలంగాణ, యానాంలలో చివరిసారిగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే అక్టోబర్ 9 నుంచి మరో అల్పపీడనం ఏర్పడనుందని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో కొన్నిచోట్ల వర్షాలు తగ్గుముఖం పట్టినా, మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలతో నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దాని అనుబంధ ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ, యానాంలో 2 రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు తెలిపాయి.


తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather Updates)
నైరుతి రుతుపవనాల ప్రభావం తెలంగాణపై మరో రెండు రోజుల్లో పూర్తిగా తగ్గనుంది. వర్ష సూచనతో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. అక్టోబర్ 9 వరకు తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. శుక్రవారం సైతం పలు జిల్లాల్లో చిరు జల్లులు, మోస్తరు వర్షాలు కురిశాయి. గంటకు 8 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.





అక్టోబర్ 8న వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు భారీ వర్ష సూచనతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో  అక్కడ్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. హైదరాబాద్, జీహెచ్ఎంసీ పరిధిలో కొన్ని ప్రాంతాలకు వర్ష సూచన ఉందని అధికారులు తెలిపారు.


ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
అల్పపీడనం ప్రభాంతో 2 రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే జిల్లాల్లో నేడు మోస్తరు వర్షాలు పడతాయి. కోస్తాంధ్ర​, ఉత్తరాంధ్ర జిల్లాల్లో తగ్గుముఖం పడుతున్నాయి. దిగువ ట్రోపో వాతావరణంలో వాయువ్య దిశ నుంచి ఏపీ, యానాంలో గాలులు వీస్తున్నాయి. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. తీరంలో 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో నైరుతి, తూర్పు బంగాళాఖాతం దిశల నుంచి గాలులు వీస్తున్నాయని, మత్స్యకారులు వేటకు వెళ్లడం క్షేమదాయకం కాదని అధికారులు హెచ్చరించారు.






దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
అల్పపీడనం బంగాళాఖాతంలో నుంచి తేమను కోస్తాంధ్రలోని ఏలూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు భాగాల్లోకి వస్తోంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. అమరావతి వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అల్పపీడనం మరింత బలపడటంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో పలు చోట్ల వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. సాయంకాలం సమయంలో రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడేందుకు అనుకూలంగా ఉంది. తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాల్లోని అక్కడక్కడ వర్షాలు కురవనున్నాయి.