Deepak Chahar Ruled Out: దక్షిణాఫ్రికాతో రెండో వన్డేకు ముందు టీమ్‌ఇండియాకు షాక్! కీలక పేసర్ దీపక్ చాహర్ మిగతా రెండు మ్యాచులకు దూరమయ్యాడని తెలిసింది. ప్రాక్టీస్‌లో గాయపడటంతో ముందు జాగ్రత్త చర్యగా అతడిని ఆడించడం లేదని సమాచారం. బహుశా షాబాజ్ అహ్మద్ అరంగేట్రం చేస్తాడని అంచనా వేస్తున్నారు.
ఏకనా స్టేడియం వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమ్‌ఇండియా 9 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆఖరి ఓవర్ వరకు విజయం కోసం పోరాడింది. వర్షం కురిసిన ఈ మ్యాచులో భారత బౌలర్లు తొలుత అద్భుతంగా వేశారు. డేవిడ్ మిల్లర్, హెన్రిక్ క్లాసెన్ వచ్చాక తేలిపోయారు. కీలకమైన రెండో వన్డేలో ఝార్ఖండ్‌లోని రాంచీలో ఆదివారం జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే టీమ్‌ఇండియా బౌలింగ్ పటిష్ఠంగా ఉండాలి. మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తుండగా దీపక్ చాహర్ పాదం మడత పడిందని తెలిసింది.
ఇప్పటికే జస్ప్రీత్ బుమ్రా గాయంతో ప్రపంచకప్‌నకు దూరమయ్యాడు. అతడి స్థానంలో దీపక్ చాహర్, మహ్మద్ షమి పోటీ పడుతున్నారు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేసే చాహర్ గాయపడటం టీమ్‌ఇండియాకు షాక్‌గా మారింది. అందుకే ముందు జాగ్రత్త చర్యగా అతడిని మిగతా రెండు వన్డేల నుంచి తప్పించారు. పూర్తిగా కోలుకుంటే ఆస్ట్రేలియా పంపించే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం చాహర్ స్థానంలో అవేశ్ ఖాన్ కొనసాగుతాడని తెలిసింది. మరోవైపు దేశవాళీ క్రికెట్, ఐపీఎల్‌లో రాణించిన ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్ అరంగేట్రం చేస్తాడని అంటున్నారు.
తొలి వన్డేలో టీమ్‌ఇండియా పేసర్లు అంచనాల మేరకు రాణించలేదు. శార్దూల్ ఠాకూర్ ఒక్కడే 2 వికెట్లు పడగొట్టి 8 ఓవర్లలో 35 పరుగులు ఇచ్చాడు. మహ్మద్ సిరాజ్, అవేశ్ ఖాన్ తేలిపోయారు. వీరిద్దరూ చెరో 8 ఓవర్లు వేసి వరుసగా 49, 51 పరుగులు ఇచ్చారు. స్పిన్నర్ రవి బిష్ణోయ్ సైతం 8 ఓవర్లలో 1 వికెట్ పడగొట్టి 69 పరుగులు ఇచ్చాడు. 8.62 ఎకానమీ నమోదు చేశాడు.
IND vs SA 1st ODI Highlights
భారత్‌తో జరిగిన మొదటి వన్డేలో దక్షిణాఫ్రికా తొమ్మిది పరుగులతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 40 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. అనంతరం భారత్ 40 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 240 పరుగులు మాత్రమే చేసింది. దీంతో తొమ్మిది పరుగులతో ఓటమి పాలైంది. సంజు శామ్సన్ (86 నాటౌట్: 63 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, మూడు సిక్సర్లు) ఎంత పోరాడినా ఫలితం లేకపోయింది. ఈ విజయంతో దక్షిణాఫ్రికా సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. రెండో వన్డే ఆదివారం రాంచీలో జరగనుంది.
సంజు షో సరిపోలేదు
250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆశించిన ఆరంభం లభించలేదు. ఎనిమిది పరుగులకే ఓపెనర్లు శిఖర్ ధావన్ (4: 16 బంతుల్లో), శుభ్‌మన్ గిల్ (3: 7 బంతుల్లో) అవుటయ్యారు. ఆ తర్వాత రుతురాజ్ గైక్వాడ్ (19: 42 బంతుల్లో, ఒక ఫోర్), ఇషాన్ కిషన్ (20: 37 బంతుల్లో, మూడు ఫోర్లు) పరిస్థితిని కుదుట పరిచే ప్రయత్నం చేశారు. కానీ ఈ ప్రయత్నంలో వీరు మరీ నెమ్మదిగా ఆడటంతో కావాల్సిన రన్‌రేట్ విపరీతంగా పెరిగిపోయింది. దీనికి తోడు వీరిద్దరూ వెంట వెంటనే అవుటవ్వడంతో కష్టాలు మరింత పెరిగాయి.
ఆ తర్వాత సంజు శామ్సన్ (86 నాటౌట్: 63 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, మూడు సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (50: 37 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు) వేగంగా ఆడారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 67 పరుగులు జోడించారు. ఆ తర్వాత అయ్యర్ అవుట్ కావడంతో శార్దూల్ ఠాకూర్ (33: 31 బంతుల్లో, ఐదు ఫోర్లు) క్రీజులోకి వచ్చాడు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 93 పరుగులు జోడించారు. చివరి ఐదు ఓవర్లలో 73 పరుగులు చేయాల్సిన దశలో సంజు శామ్సన్ చెలరేగాడు. మొదటి రెండు ఓవర్లలో 28 పరుగులు రావడంతో విజయంపై ఆశలు పెరిగాయి. తర్వాతి రెండు ఓవర్లలో కేవలం 15 పరుగులు మాత్రమే రావడంతో పాటు మూడు వికెట్లను కూడా భారత్ కోల్పోయింది. చివరి ఓవర్లో 30 పరుగులు కావాల్సిన దశలో సంజు శామ్సన్ 21 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో భారత్ 40 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది.