Narsapuram MP Emotional With Somu Veera Raju: ఏపీ బీజేపీ నేత, నర్సాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మకు (Bhupathiraju Srinivasa Varma) కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కిన వేళ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్రమంలో బీజేపీ నేత సోమువీర్రాజు (Somu Veeraraju) కాళ్లు మొక్కి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఇది ఏపీ బీజేపీ కార్యకర్తలు విజయమంటూ ఆనంద భాష్పాలు రాల్చారు. కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నానని.. బాధ్యతగా పని చేస్తానని, తగు సూచనలు, సలహాలు అందించాలని సోము వీర్రాజును కోరినట్లు తెలుస్తోంది. అయితే, గతంలోనూ శ్రీనివాసవర్మ ఇలానే భావోద్వేగానికి గురయ్యారు. నర్సాపురం ఎంపీగా సీటు లభించిన సందర్భంలో పార్టీ ఆఫీస్ వద్ద నేలపై కమలం గుర్తుపై పడుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. కాగా, ఏపీ నుంచి ముగ్గురికి కేంద్ర మంత్రులుగా ప్రధాని మోదీ కేబినెట్‌లో అవకాశం లభించింది. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, నర్సాపురం బీజేపీ ఎంపీ శ్రీనివాసవర్మలను కేంద్ర మంత్రి పదవులు వరించాయి. 



సాధారణ కార్యకర్త నుంచి..


ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో భూపతిరాజు శ్రీనివాసపర్మ.. వైసీపీ ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాలపై 2.76 లక్షల ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. దశాబ్దాలుగా ఆయన బీజేపీకి సేవలందిస్తున్నారు. శ్రీనివాస వర్మ 1967, ఆగస్ట్ 4న.. భూపతిరాజు సూర్యనారాయణ రాజు, సీత దంపతులకు జన్మించారు. ఆయన ఆంధ్ర వర్శిటీ నుంచి ఎంఏ పూర్తి చేశారు. 1980లో విద్యార్థి నాయకుడిగా ఏఐఎస్ఎఎఫ్ తరఫున పని చేశారు. 1988లో బీజేపీ కార్యకర్తగా తన రాజకీయ జీవితం ప్రారంభించారు. 1991 - 97 బీజేపీ భీమవరం పట్టణ, ప.గో జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. 2008 - 14 వరకూ రెండుసార్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా సేవలందించారు. 2014లో భీమవరం పురపాలక వార్డు కౌన్సిలర్‌గా గెలుపొందారు. ఇంఛార్జీ ఛైర్మన్‌గానూ పని చేశారు. 2020 - 23 వరకూ రాష్ట్ర కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. 2024లో నర్సాపురం నుంచి ఎంపీగా ఘన విజయం సాధించిన క్రమంలో ఆయన్ను కేంద్ర మంత్రిగా ఎంపిక చేశారు. దీంతో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.


Also Read: Pemmasani Chandrasekhar: బుర్రిపాలెం టు కేంద్రమంత్రి, దేశంలోనే అత్యంత సంపన్న ఎంపీ - పెమ్మసాని ప్రత్యేకతలెన్నో!