Kurnool News: కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రి ముందు వైసీపీ శ్రేణుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. వినూత్న రీతిలో వైసీపీ కార్యకర్తలు నిరసనలు చేపడుతున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆయనకు మరికొంత సమయం ఇవ్వాలని కోరుతున్నారు. సీబీఐ అధికారులు మానవతా దృక్పథంలో ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కర్నూలు మేయర్ రామయ్య సహా ఇతర కార్యకర్తలు, నాయకులు నిరసనల్లో పాల్గొన్నారు. 'వి రెస్పెక్ట్ సీబీఐ.. అండర్ మదర్ హెల్త్ గ్రౌండ్స్ వి నీడ్ సమ్ టైం.. వీ రెస్పెక్ట్ సీబీఐ.. వీ కోఆపరేట్ విత్ సీబీఐ(మేం సీబీఐని గౌరవిస్తాం. తల్లి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మరికొంత సమయం ఇవ్వాలి. మేం సీబీఐని గౌరవిస్తున్నాం.. వారికి పూర్తిగా సహకరిస్తాం)' అని రాసి ఉన్న ప్లకార్డులతో నిరసనలు కొనసాగిస్తున్నారు.
విషమంగానే అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్యం
అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్యం ఆందోళనగానే ఉందని కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి డాక్టర్లు తెలిపారు. సుమారు వారం రోజులుగా అదే ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. గుండెకు సంబంధించిన ఇబ్బందులకు గాను ఆమెకు చికిత్స చేస్తున్నారు. అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరుకావాల్సి ఉన్నా, తల్లితో ఆరోగ్య పరిస్థితి కారణంగా ఆస్పత్రిలోనే ఉంటున్నారు.
Also Read: Avinash Reddy : అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు - ముందస్తు బెయిల్‌పై ఏం చెప్పిందంటే ?
వివిధ కారణాలతో సీబీఐ విచారణకు వెళ్లని అవినాష్
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డిని విచారించేందుకు సీబీఐ పలుమార్లు నోటీసులు పంపింది. అయితే వివిధ కారణాలను చూపుతూ ఎంపీ సీబీఐ విచారణకు వెళ్లలేదు. తన తల్లి ఆరోగ్యం బాగోలేదని ఆస్పత్రిలో ఉందని చెబుతూ విచారణకు హాజరు కాలేనని సీబీఐకి లేఖ రాశారు. అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మీ హార్ట్ అటాక్ కు గురయ్యారు. యాంజియోగ్రామ్ చేశాక.. ఆమె డబుల్ నాళాల వ్యాధితో బాధపడుతున్నట్లు తేలింది. అయితే ఎంపీ అవినాష్ తన తల్లి వద్దే ఆస్పత్రిలో ఉంటూ ఆమె యోగక్షేమాలు చూసుకుంటున్నారు. ఈ సమయంలో సీబీఐ విచారణకు హాజరు కాలేనని చెబుతూ సీబీఐకి లేఖ రాశారు.
Also Read: Varla Ramaiah: ఆకురౌడీలు చెప్తే సీబీఐ వెళ్లిపోతుందా? కేంద్రాన్నీ శంకించాల్సి వస్తోంది - వర్ల రామయ్య
మంగళవారంలో సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డికి చుక్కెదురు
వైఎస్ వివేకా హత్య కేసులో ముందస్తు బెయిలివ్వాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ విషయంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టు వేకెషన్ బెంచ్ ముందుకే వెళ్లాలని సూచించింది. హైకోర్టు వేకెషన్ బెంచ్ విచాణ జరిపే వరకూ అరెస్ట్ నుంచి రక్షణ ఇవ్వాలని అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులు కోరారు. అయితే అలాంటి ఆదేశాలు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందు ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్న సుప్రీంకోర్టు.. 25న హైకోర్టు వెకేషన్ బెంచ్ అవినాశ్ ముందస్తు బెయిల్‌పై విచారణ జరపాలని సూచించింది.
సీబీఐపై ప్రతిపక్షాల మండిపాటు
అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేయకపోవడంపై ప్రతిపక్ష పార్టీల నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ నాయకత్వంలో సీబీఐని రాష్ట్ర పోలీసులు బెదిరిస్తున్నారని టీడీపీ విమర్శిస్తోంది. సీబీఐ పరిస్థితి రాష్ట్రంలో ఎందుకు ఇంత దయనీయంగా మారిందని టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి ప్రమేయం ఉందని.. సీబీఐ వద్ద పక్కా ఆధారులు ఉన్నప్పటికీ ఆయనను అరెస్టు చేయడంలో జాప్యం చేస్తున్నారని టీడీపీ నేత బొండా ఉమా విమర్శించారు.