దివంగత సీఎం ఎన్టీఆర్ హయాం నుంచి సీమలోని అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోట అన్నారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు. అసెంబ్లీలో తనపై వ్యక్తి గత దూషణలు చేస్తే.. .శపథం చేసి బయటకు వచ్చానని, మళ్లీ సభను గౌరవ సభగా మార్చి అసెంబ్లీకి వెళతానన్నారు. అనంతపురం సభలో చంద్రబాబు మాట్లాడుతూ... 40 శాతం సీట్లు ఈ సారి యువతకు సీట్లు ఇస్తానని చెప్పారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవారికీ అవకాశం ఇస్తాం అన్నారు.
వైఎస్ జగన్ పాలనలో అనంతపురం జిల్లా వెనుకబడిందని, అన్ని విషయాల్లోనూ నిర్లక్ష్యం చేశారన్నారు. హంద్రీనీవా కాలువ పనులు ఏమయ్యాయని, కాలువ విషయంలో జగన్ గాలి మాటలు చెప్పలేదా? అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా చేసే ప్రయత్నం చేయగా, ఇప్పుడు ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్‌ను పూర్తిగా ఆపేశారని గుర్తుచేశారు. అనంతపురం జిల్లాలో వేరుశనగ రైతులు తీవ్ర కష్టాల్లో ఉన్నారని, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ రావడం లేదు, కనీసం ఇన్ స్యూరెన్స్ రావడం లేదని మండిపడ్డారు.
హంద్రీనీవా కోసం పయ్యావుల కేశవ్, భైరవానితిప్ప కోసం కాలువ శ్రీనివాసులు వెంట పడేవారని, ఇప్పుడు వైఎస్సార్‌సీపీలో ప్రజల కోసం , రైతుల కోసం నిలిచే నేతలు కనిపించడం లేదన్నారు. క్రమశిక్షణ లేని ఇల్లు మనుగడ సాగించలేదని, పార్టీకి కూడా అదే వర్తిస్తుందని చెప్పారు. పార్టీ నేతలు, కార్యకర్తలు విచ్చలవిడిగా మాట్లాడితే కఠినంగా ఉంటాను. కార్యకర్తలు పార్టీకి నిజాయితీగా వ్యవహరించాలని, పార్టీని నిలబెట్టేది వాళ్లేనన్నారు. కార్యకర్తలు లేకపోతే నాయకులు లే, పార్టీలు లేవన్నారు.
ముందుగా అభ్యర్థులను ప్రకటించాలని కార్యకర్తలు కోరుతున్నారు.
దొంగ ఓట్లపై అలర్ట్ అవండి
వైఎస్సార్‌సీపీ దొంగ ఓట్లపై టీడీపీ క్యాడర్ అప్రమత్తంగా ఉండాలి. పులివెందుల బస్ స్టాండ్ కట్టలేని జగన్.. మూడు రాజధానులు కడతాడా అని ఎద్దేశా చేశారు. పార్టీ నాయకులు నా చుట్టూ తిరిగితే లాభం లేదన్నారు. కార్యకర్తల కోసం పని చెయ్యాలని, సమర్థత, పని తీరు చూసి ముందుగా ఎన్నికల్లో అభ్యర్థులను ప్రకటిస్తాని చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. తన దగ్గరకు వచ్చి మోహమాట పెట్టడం ఇకపై కుదరదని, తన వయసు 72 ఏళ్లు కానీ 27 ఏళ్ల వాడిలా పని చేస్తానంటూ టీడీపీ శ్రేణులలో ఉత్సాహాన్ని నింపారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా న్యూట్రిఫుల్ అనే యాప్ ను ప్రారంభిస్తున్నామని, కార్యకర్తలకు వైద్యం కోసం ప్రముఖ అసుపత్రులతో ఒప్పందం చేసుకుందాం అని వారికి గుడ్ న్యూస్ చెప్పారు.