గ‌నులు, వ‌న‌రుల‌న్నీ దోచుకుంటున్న ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌ మోహన్ రెడ్డి, ప్ర‌శ్నించే ప్ర‌తిప‌క్ష టీడీపీ నేత‌ల‌పై పోలీసుల‌తో దాడులు చేయిస్తున్నారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్ర‌బాబు నాయుడు ఆరోపించారు. పోయేది జ‌గ‌న్ స‌ర్కారు. రాబోయేది తెలుగుదేశం ప్ర‌భుత్వం అన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో నంద్యాల, బొమ్మిరెడ్డిపల్లిలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. అక్ర‌మాలు, క‌బ్జాల‌కు పాల్ప‌డేవాడు ఎవ్వ‌డైనా సరే, భూలోకంలో ఎక్క‌డ దాక్కున్నా లాక్కొచ్చి లోప‌లేయిస్తా అంటూ చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. క‌ష్ట‌కాలంలో తెలుగుదేశం జెండా ప‌ట్టిన ప్ర‌తీ కార్య‌క‌ర్త‌కీ అండ‌గా ఉంటానని హామీ ఇచ్చారు.






టీడీపీ హాయాంలో రాష్ట్రంలో ఎన్నో లక్షల మంది పేదవారికి ఇళ్లు కట్టించి ఇచ్చాం, వైఎస్ జగన్ తన మూడేళ్ల పాలనలో ఎక్కడైనా ఇళ్లు కట్టించారా అని నంద్యాల జిల్లా జలదుర్గంలో నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొన్న సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. తమ ప్రభుత్వంలో మహిళల కోసం ఎన్నో పథకాలు అమలుచేయగా, వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక మహిళలపై దాడులు పెరిగాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పులు, ఆర్థిక సంక్షోభంలో నెట్టిన ఘటన ఏపీ సీఎం జగన్ సొంతమన్నారు.






సీఎం జగన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు. కర్నూలుకు హైకోర్టును తెస్తామని చెప్పి ఎవరిని మోసం చేస్తారు మీరు? అని వైసీపీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. మంత్రి బుగ్గన నంగి నంగిగా మాట్లాడతారని, చేసే పనులు మాత్రం దారుణంగా ఉంటాయన్నారు. ఒక్క పారిశ్రామికవేత్త ఆనందంగా లేడని, ఆటో లారీ డ్రైవర్లు గానీ, పౌరులుగానీ, రైతులు గానీ ఎవ్వరూ మీ పాలనలో సంతోషంగా లేరు. బుగ్గన, సీఎం జగన్ సంతోషంగా ఉన్నారని, మీరు పోలీసులను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని, వారు లేకుండా జనాల్లోకి వచ్చి చూడాలని సవాల్ చేశారు. అన్యాయాన్ని ప్రశ్నించిన టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల కోసం అండగా నిలబడేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు, తెలుగుతమ్ముళ్లు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని చెప్పారు.


ఉద్యోగాలపై జోక్స్..
అధికారంలోకి రాగానే లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న వైఎస్ జగన్ రాష్ట్రంలో యువతకు తనకు తెలియకుండా ఏం ఉద్యోగాలను ఇచ్చాడన్నారు. టీడీపీ హయాంలో తాను యువతకు ఐటీ ఉద్యోగాలు కల్పించి మంచి భవిష్యత్ అందిస్తే, జగన్ పాలనలో వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారని ఎద్దేవా చేశారు. అరకొర జీతాలు ఉండే ఇలాంటి ఉద్యోగాలను సైతం గొప్పగా చెప్పుకుంటూ సీఎం జగన్ 5 వేల సార్లు ప్రస్తావించారంటూ సెటైర్లు వేశారు. జగన్ పాలనలో రాష్ట్రం నాశమైందని, సీఎంది ఐరన్ లెగ్ అని, ఆయన కాలు పెట్టినందుకు అంతా బూడిద మిగిలిందన్నారు చంద్రబాబు.