కారు ప్రమాదంలో భర్త చనిపోయాడు. ఇక కుమారుడే బాధ్యతలు చూస్తాడని నమ్మింది ఆ తల్లి. కొడుకును విదేశాలకు పంపితే భర్త చేసిన అప్పులు తీరుస్తాడని నమ్మి ఉన్న ఆస్తిని అమ్మి కొడుకును అమెరికా పంపింది. కానీ విదేశాలకు వెళ్లిన కుమారుడు అదును చూసి మాట మార్చాడు. తండ్రి చేసిన అప్పుతో తనకు సంబంధంలేదని తేల్చిచెప్పాడు. దీంతో ఆ తల్లికి ఏంచెయ్యాలో దిక్కు తోచని పరిస్థితి ఏర్పడింది. తెలిసిన వాళ్లందరికీ కనుక్కొండి. అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగింది. అప్పుల వాళ్లకు రేపు మాపు అంటు సర్ధిచెబుతూ వచ్చింది. కొడుకుని స్వదేశానికి రప్పించి అప్పులు తీర్చేలా చేయాలని ప్రభుత్వానికి వేడుకుంటూ దీక్షకు దిగింది.
ఓ తల్లి ఆమరణ నిరాహార దీక్ష
కొడుకు పట్టించుకోవడం లేదని ఓ తల్లి ఆమరణ నిరాహార దీక్షకు దిగిన ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన గరిమెళ్ళ సత్యనాగకుమారి కొడుకు తన ఆస్తి లాక్కుని అమెరికా పారిపోయాడని ఆరోపిస్తూ అతని ఇంటి ముందు నిరాహార దీక్షకు దిగింది. సత్య నాగ కుమారి భర్త 2001లో కారు ప్రమాదంలో మృతి చెందారు. అప్పటి నుంచి ఆమే కుటుంబాన్ని చూసుకునేది. భర్త చనిపోయిన తర్వాత వచ్చిన నగదు, ఆస్తి అమ్మి కొడుకుని విదేశాలకు పంపింది. భర్త చేసిన అప్పులు తీర్చడానికి తనకి అండగా ఉంటాడని నమ్మిన ఆ తల్లిన కొడుకు నిండా ముంచాడు.
అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన
గత పదేళ్లుగా ఆమె కొడుకు విదేశాల నుంచి తిరిగి వస్తాడని, అప్పులు తీరుస్తాడని ఎదురుచూసినా ఫలితంలేకపోయింది. చివరికి చేసేందేంలేక దౌత్యకార్యాలయాలకు ఫిర్యాదులు పంపింది. అయినా ఎటువంటి స్పందన లేదు. పోలీసులు, అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తుందా వృద్ధురాలు. గత 10 సంత్సరాలుగా అధికారులు చుట్టూ తిరుగుతున్నా తనను పట్టించుకోవడం లేదని వృద్ధురాలు ఆరోపిస్తున్నారు. తనకు న్యాయం జరిగే వరకు ఆమరణ దీక్ష చేస్తానని గరిమెళ్ల సత్యనాగకుమారి స్పష్టం అంటున్నారు. స్పందనలో ఎన్ని సార్లు తన సమస్య గురించి తెలిపిన న్యాయం జరగలేదని సత్యనాగకుమారి ఆరోపిస్తున్నారు. తన నివాసం చుట్టూ పక్కల ఆమరణ నిరహార దీక్ష చేస్తున్న ప్రదేశంలో గోడకి పోస్టర్లు అంటించి తన ఆవేదనను ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేశారు. ఇప్పటి కైనా ప్రభుత్వం స్పందించి తన కొడుకు దేశానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కన్నీటితో అర్థిస్తున్నారు.
Also Read: Women's Day 2022 : వాలంటీర్ నుంచి మున్సిపల్ ఛైర్ పర్సన్ వరకు, ఓ సాధారణ మహిళ విజయగాథ