Womens World Cup 2022: జెండర్ బయాస్! ప్రపంచంలోని అన్ని రంగాల్లో కనిపిస్తుంది. క్రీడలూ ఇందుకు మినహాయింపేమీ కాదు. ఎన్నో కట్టుబాట్లను దాటిన మహిళలు ఆటల్లోనూ రాణించిడం మొదలు పెట్టారు. పురుషులతో సమానంగా అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఫుట్‌బాల్, రగ్బీ, అథ్లెటిక్స్, హాకీ, బ్యాడ్మింటన్, టెన్నిస్, చెస్ సహా చాలా గేముల్లో తేడా పెద్దగా కనిపించదు. కానీ ఒక్క క్రికెట్లోనే ఎందుకో! మొదట్నుంచీ అమ్మాయిలు క్రికెట్టేం ఆడతారులే అన్న చిన్నచూపు ఉండేది!
ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో మహిళల క్రికెట్ డెవలప్ అవుతోంటే ఇండియాలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉండేది. మిగతా క్రీడలన్నింటికీ ఒకే పాలక మండలి, పాలక సంఘం ఉంటే క్రికెట్‌కు మాత్రం అలా కాదు. వేర్వేరు బోర్డులు ఉండేవి. మిలియన్ డాలర్లు ఆర్జిస్తూ బీసీసీఐ ఆధిపత్యం చెలాయిస్తుంటే మహిళల బోర్డు మాత్రం కనీసం విదేశాలకు వెళ్లేందుకు డబ్బుల్లేక ఇబ్బంది పడుతుండేది. అసలు 2000 సంవత్సరం వరకు అంజుమ్ చోప్రా, డయానా ఎడుల్జీ వంటి పేర్లు వినిపించేవి. ఎప్పుడైతే హైదరాబాదీ అమ్మాయి మిథాలీ రాజ్ 'ఎంటర్ ది ఉమెన్ డ్రాగన్' అన్నట్టుగా క్రికెట్లో ఎంటరైందో పరిస్థితులు క్రమంగా మారడం మొదలు పెట్టాయి.
ఒకప్పుడు మహిళ క్రికెటర్ల పేర్లే తెలిసేవి కావు. కొన్నాళ్లకు వారి పేర్లు వినిపించడం మొదలైంది. మరికొన్నాళ్లకు వారి ఫొటోలు మీడియాలో రావడం మొదలైంది. ఆపై మరికొన్నాళ్లకు వారి క్రికెట్ మ్యాచుల అప్‌డేట్లు వచ్చేశాయి. ఎన్నోసార్లు చేసిన రిక్వెస్టులు పుణ్యమో మహిళా క్రికెట్ సంఘం బీసీసీఐలో విలీనమైంది. సిట్యువేషన్ ఒక్కసారిగా మారిపోయింది. వారి మ్యాచులూ టీవీల్లో ప్రసారమయ్యాయి. మిథాలీ రాజ్, హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, వేదా కృష్ణమూర్తి, జులన్ గోస్వామి వంటి క్రికెటర్లు రికార్డులు సృష్టించడం మొదలు పెట్టడంతో అభిమానులు పెరిగారు. 2016 టీ20 ప్రపంచకప్‌లో స్మృతి మంధాన అందమైన కవర్‌డ్రైవులు, లాఫ్టెడ్ షాట్లు చూశారో క్రేజ్ మొదలైంది. ఆ తర్వాత మరో ప్రపంచకప్‌లో హర్మన్‌ప్రీత్ ఆసీస్‌పై దంచిన సిక్సర్లు, షెఫాలీ వర్మలో సెహ్వాగ్‌ను చూశారో వారంతా స్టార్లుగా మారిపోయారు.
మీకు గుర్తుందా? ఇంగ్లాండ్‌లో 2017లో జరిగిన వన్డే ప్రపంచకప్! మిథాలీ సేన సాగించిన ఆధిపత్యానికి ప్రపంచమే పిధా అయింది. ఒకరిని మించి మరొకరు ఆడిన ఆటకు అభిమానులు కేరింతలు పెట్టారు. వారి దూకుడును చూస్తే ప్రపంచకప్ ఇంటికి వస్తుందనిపించింది. లార్డ్స్‌లో జరిగిన ఫైనల్లో ఇంగ్లాండ్, టీమ్‌ఇండియా హోరాహోరీగా తలపడ్డాయి. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లిష్ అమ్మాయిలు 228/7తో నిలిచారు. నిజానికి వాళ్లు 170 లోపే ఆలౌటవ్వాలి. సారా టేలర్, నాట్ షివర్ సింగిల్స్ తీస్తూ వంద పరుగుల భాగస్వామ్యం అందించారు. ఛేదనలో పూనమ్ రౌత్ (86), హర్మన్ ప్రీత్ (51), వేద (35) రాణించినా 219కి టీమ్‌ఇండియా ఆలౌటైంది. జస్ట్ 9 తేడాతో ప్రపంచకప్‌ను దూరం చేసుకుంది. ఆ టైమ్‌లో కన్నీరు కార్చిన అమ్మాయిలను చూస్తుంటే దేశ ప్రజల హృదయాలు సంద్రంతో నిండిపోయాయి. 2020 టీ20 ప్రపంచకప్ ఫైనల్లోనూ ఆసీస్‌పై ఇలాగే జరిగింది. వారిచ్చిన 185 పరుగుల లక్ష్య ఛేదనలో 99కే ఆలౌటైంది. చిన్న చిన్న పొరపాట్లు చేయడం, ప్రత్యర్థికి మరింత అనుభవం ఉండటంతో త్రుటిలో మరో ప్రపంచకప్ చేజారింది.
ఆ రెండు ఫైనళ్లు టీమ్‌ఇండియా మహిళా క్రికెట్‌పై ప్రేమను మరింత పెంచాయి. ఈ సారి వన్డే ప్రపంచకప్ న్యూజిలాండ్‌తో జరుగుతోంది. అమ్మాయిలంతా రెడీ అయ్యారు. ఆదివారమే దాయాది పాకిస్థాన్‌తో తొలి మ్యాచులో తలపడనున్నారు. గత పొరపాట్లను సరిదిద్దుకొని, మెరుగైన ఆటతీరుతో కప్పు గెలవాలని దేశమంతా కోరుకుంటోంది. కమాన్... టీమ్ మిథాలీ! గత కన్నీళ్ల స్థానంలో ఈసారి మాకు ఆనంద బాష్పాలు కావాలి. ప్రపంచకప్ ముద్దాడుతారు కదూ!!