East Godavari News: మద్యం మత్తు.. క్షణికావేశాలు బంధాలను, ఆప్యాయతలను దూరం చేస్తోంది. రక్తం పంచుకు పుట్టినవారే కిరాతకులుగా మారిపోయి దారుణాలకు పాల్పడుతున్నారు. కన్న తండ్రి తరువాత కంటికి రెప్పలా చూసుకోవాల్సిన అన్న సొంత చెల్లిలినే హతమార్చాడు (Man Kills His Sister for Not Cooking Chicken). కోడి కూర వండలేదన్న కారణంతో సొంత అన్న ఈ దారుణానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. తూర్పు గోదావరి జిల్లాలో ఈ ఘటన జరిగింది.
స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం అయిన కూనవరం మండలంలో కన్నాపురంలో కొవ్వాసి సందా స్థానికంగా కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తుంటాడు. ఇతనికి సోమమ్మ(22) అనే సోదరి ఉంది. ఈమెను చాలా కాలం క్రితం సమీప బంధులకు దత్తత ఇచ్చారు. సోమమ్మ వారం రోజుల క్రితం సొంత అన్న అయిన నందా ఇంటికి వచ్చింది. ఈక్రమంలోనే నందా మధ్యాహ్నం బయటకు వెళ్తూ రాత్రి భోజనానికి కోడి కూర వండాలని సోదరితో చెప్పి వెళ్లిపోయాడు. తిరిగి అర్ధరాత్రి బాగా మద్యం సేవించి ఇంటికి వచ్చిన నందా కోడికూరతో తనకు అన్నం పెట్టాలని కోరాడు.
కోడికూర వండని సోదరి..
సోమమ్మ కూడికూర వండలేదని సోదరుడు సందాకు చెప్పింది. ఈ పూట వేరే కూర వండానని, రేపు కోడి కూర చేస్తానని చెప్పింది. నేను అడిగితే కోడి కూర చేయలేదు అంటూ ఆమెతో గొడవపడి ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయాడు సందా. తెల్లవారు జామున ఇంటికి వచ్చిన నందా ఉద్దేశం ప్రకారమే చెల్లిలితో గొడవపడ్డాడు. తన మాటంటే లెక్కలేదని, చెప్పినా కోడి కూర వండ లేదంటూ అక్కడే ఉన్న గొడ్డలి తీసుకుని ఆమెపై విచక్షణారహితంగా దాడిచేశాడు. సోదరుడు సందా చేసిన గొడ్డలి దాడిలో సోమమ్మ అక్కడికక్కడే మృతిచెందింది.
స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎటపాక సీఐ గజేంద్రకుమార్ తెలిపారు. కేవలం కోడి కూర వండలేదని సోదరిని హత్య చేశాడా, ఆస్తి తగాదాలు, వ్యక్తిగత తగాదాల కారణంగా హత్య చేశాడా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
Also Read: Vijayawada: సోఫాలో నిద్రపోతున్న అన్న, కూరగాయల కత్తితో కడుపులో పొడిచిన తమ్ముడు - కారణం ఏంటంటే
Also Read: Murder Sketch Politics : తెలంగాణ పోలీసులపై ఢిల్లీలో కేసులు - "మర్డర్ స్కెచ్" కేసులో కీలక మలుపు !