తెలంగాణ రాజకీయాలు ఢిల్లీ పోలీస్ స్టేషన్లకూ చేరాయి. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ( Minister Srinivas Goud ) పై హత్యాయత్నం, ఢిల్లీలో మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత జితేందర్ రెడ్డి ఇంట్లో నలుగురిని కిడ్నాప్ ( Kidnap ) చేసిన వ్యవహారంలో కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే హత్యాయత్నం కేసు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారగా.. తాజాగా  తెలంగాణ పోలీసులపై ( Telangana Police ) ఢిల్లీలో కేసు నమోదైంది. స్థానిక పోలీసుల అనుమతి లేకుండా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి నివాసంలోకి వెళ్లినందుకు కేసు నమోదైంది. 


మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ( Jitendar Reddy ) పీఏ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమానిత వ్యక్తులు అపహరణకు పాల్పడ్డారని ఎఫ్‌ఐఆర్‌లో ఢిల్లీ పోలీసులు నమదు చేశారు. ఈ ఘటనపై తెలంగాణ డీజీపీకి ( TS DGP ) లేఖ రాసే యోచనలో ఢిల్లీ పోలీసులు ఉన్నారు. అటు మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జితేందర్ రెడ్డి పీఏకు తెలంగాణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కేసు విచారణ కోసం హైదరాబాద్ రావాలని కోరారు.


నాలుగు  ోజుల కిందట ఢిల్లీలోని మాజీ ఎంపీ జితేంద్ రెడ్డి నివాసం నుంచి నలుగుర్ని గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లారు. వారిని కిడ్నాప్ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. అయితే వారిని కిడ్నాప్ చేయలేదని తామే అరెస్ట్ చేశామని సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. వారు మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను ( Srinivas Goud )  హత్య చేయడానికి కుట్ర పన్నారని కేసులు పెట్టారు. ఈ అంశం రాజకీయంగా సంచలనం సృష్టించింది. అరెస్టయిన వారంతా మంత్రి శ్రీనివాస్ గౌడ్ అవినీతి, అక్రమాలపై పోరాడుతున్న వారని.. వారిపై తప్పుడు కేసులు పెట్టారని విమర్శిస్తున్నారు. 


అయితే ఈ క్రమంలో బీజేపీ ముఖ్య నేతలయిన జితేందర్ రెడ్డి, డీకే అరుణ ( DK Aruna ) లకు కూడా ఈ మర్డర్ స్కెచ్‌లో భాగం ఉందేమోనని విచారణ చేస్తామని సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర చెప్పడంతో బీజేపీ నేతలు విషయాన్ని ఢిల్లీ పెద్దలకు చెప్పారు. దీంతో బీజేపీ కూడా సీరియస్‌గా తీసుకున్నట్లుగా కనిపిస్తోందని భావిస్తున్నారు. అందుకే ఢిల్లీ పోలీసులు.. తెలంగాణ పోలీసులపై కేసు నమోదు చేసినట్లుగా అనుమానిస్తున్నారు. ఢిల్లీ పోలీసులు కేంద్ర ప్రభుత్వ అధీనంలోనే ఉంటారు. ఈ క్రమంలో ఈ కేసులో ముందు మందు కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.