పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా నటించిన సినిమా 'భీమ్లానాయక్'. సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేసిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించారు. త్రివిక్రమ్ ఈ సినిమాకి మాటలు, స్క్రీన్ ప్లే అందించగా.. నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈ సినిమాను హిందీ వెర్షన్ లో కూడా రిలీజ్ చేయబోతున్నారు.


మలయాళంలో సూపర్ హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోశియుమ్' సినిమాకి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. రీమేక్ సినిమా అయినప్పటికీ.. ఎక్కడా ఆ ఫీల్ రాకుండా కొత్త సినిమా మాదిరి రూపొందించారు. సినిమాలో పాటలు, పవన్ యాక్షన్ సీన్స్ ఓ రేంజ్ లో పండాయి. దీంతో సినిమా భారీ కలెక్షన్స్ ను రాబడుతోంది. ఇప్పటివరకు ఈ సినిమా రూ.91 కోట్ల వసూళ్లు రాబట్టిందని సమాచారం. 


ఇంకా కొన్ని ఏరియాల్లో ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. అయితే వచ్చే వారంలో 'రాధేశ్యామ్' సినిమా విడుదల కానుంది. అప్పటివరకు భీమ్లా సత్తా చూపించడం ఖాయం. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ 'ఆహా' ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు కొనుక్కున్నట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. మార్చి నెల చివరి వారంలో 'ఆహా'లో 'భీమ్లానాయక్' టెలికాస్ట్ చేయాలని అనుకుంటున్నారు. అప్పటికి సినిమా థియేట్రికల్ రన్ కూడా పూర్తయిపోతుంది. త్వరలోనే రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా వెల్లడించనున్నారు.