సినిమాలకు విరామం ఇచ్చి ఉద్యమకారుడిగా మారిన శివాజీ అమరావతి రైతులకు మద్దతుగా మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 9మంది ఎంపీలు, 49 మంది ఎమ్మెల్యేలు వేరే పార్టీలతో టచ్‌లో ఉన్నారని ప్రకటించారు. రాబోయే రోజుల్లో ఏపీ అధికార పార్టీకి గడ్డు పరిస్థితేనని ప్రకటించారు. మూడు రాజధానుల అంశాన్ని ఎన్నికల అస్త్రంగా మార్చుకుని వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలోనే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని శివాజీ జోస్యం చెప్పారు. ముందస్తు ఎన్నికల ఊహాగానం  ముందు నుంచీ నడుస్తున్నప్పటికీ వైసీపీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారన్నది మాత్రం కొత్తగా ఉంది. అందుకే చర్చనీయాంశం అవుతోంది. 


శివాజీ వ్యాఖ్యలపై వైఎస్ఆర్‌సీపీలోనూ చర్చ జరుగుతోంది. అయితే వైఎస్ఆర్‌సీపీలో అలాంటి పరిస్థితి లేదనే ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలు దగ్గర పడినప్పుడు టిక్కెట్ రాకనో.. ఇతర రాజకీయ కారణాల వల్లనో నేతలు పార్టీలు మారడం సహజమే కానీ ఇప్పుడు ఎవరూ ఫిరాయించే పరిస్థితి లేదంటున్నారు. అదే సమయంలో వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్‌పై కొంతమంది ప్రజాప్రతినిధులు అసంతృప్తిగా ఉన్న విషయాన్ని అంగీకరిస్తున్నారు. సీఎం జగన్ అపాయింట్‌మెంట్ దొరకడం ఎంపీలకైనా..ఎమ్మెల్యేలకైనా దుర్లభమే. అందుకే కొంత మంది ఎంపీలు అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం కొన్నాళ్లుగా ఉంది. 


వైఎస్ఆర్‌సీపీ కీలక నేతలు ఇతర పార్టీల్లో చేరుతారన్న వార్తలు ఏపీలో కొత్త కానీ జాతీయ మీడియాలో మాత్రం పాతవే. గతంలో ఓ ఇంగ్లిష్ న్యూస్ చానల్ గత ఏడాది మార్చిలో ఓ కథనాన్ని ప్రసారం చేసింది. జగన్మోహన్ రెడ్డి తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సీనియర్ నేతతో పాటు మరికొంత మంది ఎంపీలు.. తిరుగుబాటుకు రంగం సిద్ధం చేసుకున్నారని ఆ టీవీ చానల్ ప్రకటించింది. ఆ కథనాన్ని ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఖండించారు. అయితే ఆ కథనం ఇప్పటి వరకూ నిజం కాలేదు..కానీ ఎంపీల్లో అసంతృప్తి నిజమేనన్న ఓ భావన రాజకీయవర్గాల్లో ఏర్పడింది. 
  
అయితే ఎమ్మెల్యే అసంతృప్తి మాత్రం ఎప్పుడూ బయటపడలేదు. తొలి సారి శివాజీనే 49 మంది ఎమ్మెల్యేల గురించి చెప్పారు. అంత ఖచ్చితమైన నెంబర్ ఎలా చెప్పారన్నది శివాజీకే తెలియాలి. రౌండ్ ఫిగర్‌గా యాభై లేకపోతే నలభై అని చెప్పవచ్చు కదా.. 49 అనే ఎందుకు చెప్పారు.. అంత పక్కాగా ఎలా చెప్పగలిగారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్.అయితే ఆయన మైండ్ గేమ్ ఆడుతున్నారని వైఎస్ఆర్‌సీపీకి చెందిన కొంత మంది నేతలు నమ్ముతున్నారు. అయితే రాజకీయాల్లో నిప్పు లేనిదే పొగ రాదు. పొగ వచ్చిందంటే నిప్పున్నట్లే లెక్క. అదెక్కడుందో అంతా అయిపోయాక బయటపడుతుంది.