Women's Day 2022 : సాధారణ కుటుంబం తల్లిదండ్రులకు చదువు లేదు చదివించే స్థోమతా లేదు. కానీ పట్టుదల మాత్రం ఆకాశమంత ఉంది. అదే ఆమెను జీవితంలో ఉన్నతస్థాయికి చేర్చింది. వార్డు వాలంటీర్(Ward Volunteer) గా స్థానిక సమస్యలు గుర్తించి అధికారులకు తెలియజేసే స్థాయి నుంచి ఆ సమస్యలను తానే పరిష్కరిస్తూ అధికారులకు ఆదేశాలిచ్చే మున్సిపల్ ఛైర్ పర్సన్(Municipal Chairperson) స్థాయి వరకు ఎదిగింది. ఆమె నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ ఛైర్ పర్సన్ గోపారం వెంకట రమణమ్మ(Goparam Venkata Ramnamma). 



సేల్స్ గర్ల్ నుంచి ఛైర్మన్ వరకూ 


చదువుకునే సమయంలో ఆర్థిక కష్టాలున్నా వాటిని అధిగమించి చదువు కొనసాగించానని వెంకటరమణమ్మ తెలిపారు. తల్లిదండ్రుల కష్టాలు తెలుసుకుని చదువు పూర్తైన వెంటనే ఉద్యోగం కోసం ప్రయత్నించానని, ఫ్యాన్సీ షాప్ లో సేల్స్ గర్ల్ గా కూడా పనిచేశానని చెప్పారు. స్కూల్ టీచర్ గా పనిచేస్తూ ఆ తర్వాత వాలంటీర్ ఉద్యోగం సాధించానని తెలిపారు. వాలంటీర్ గా ఉంటూ మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసీపీ(Ysrcp) తరఫున గెలిచి వార్డు కౌన్సిలర్(Ward Councillor) గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మున్సిపల్ ఛైర్ పర్సన్ గా తన ప్రస్థానం మొదలుపెట్టింది వెంకటరమణమ్మ. వాలంటీర్ గా ఒక వార్డు సమస్యలను మాత్రమే తెలుసుకోగలిగానని, ఛైర్ పర్సన్ గా మున్సిపాలిటీలోని అన్ని వార్డుల సమస్యలను పరిష్కరించగలుగుతున్నానని చెబుతోంది వెంకటరమణమ్మ. 



టీచర్ గా రాణించాలనేది లక్ష్యం 


జీవితం అందరికీ వడ్డించిన విస్తరి కాదు. కానీ మనం అనుకుంటే అన్నీ సాధించవచ్చు. దానికి మన దగ్గర ఉన్న ఏకైక సాధనం చదువు. చదువుకోవడం వల్లే జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించగలం అని బలంగా నమ్మే వ్యక్తి గోపారం వెంకటరమణమ్మ. మున్సిపల్ ఛైర్ పర్సన్ గా ఉండి కూడా రాజకీయాల్లో తలమునకలవకుండా దూరవిద్య(Distance Education) ద్వారా డిగ్రీ చేస్తున్నారు రమణమ్మ. టీచర్(Teacher) గా రాణించాలనేది తన ఆశయం అని చెబుతున్నారు. 



మేకపాటి గౌతమ్ రెడ్డి సాయం 


ఛైర్ పర్సన్ గా ఎంపిక కావడంతోనే తన జీవితంలో ఏదో సాధించానని అనుకోవడంలేదని వెంకట రమణమ్మ. తన జీవితంలో అడుగడుగునా సాయపడినవారిని గుర్తు చేసుకుంటూ మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని కలలు కంటోంది. తల్లిదండ్రులు, స్నేహితులు, తనకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువులు, ప్రస్తుతం తనకు విధి నిర్వహణలో చేదోడువాదోడుగా ఉండే అధికారులు, రాజకీయ నాయకులకు పేరు పేరునా ఆమె కృతజ్ఞతలు చెబుతోంది. ముఖ్యంగా దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి(Mekapati Goutham Reddy) ప్రోత్సాహం వల్లే తాను రాజకీయాల్లోకి రాగలిగానని అంటున్నారు వెంకట రమణమ్మ. 


కాస్త ప్రోత్సాహం ఉంటే చాలు మహిళలు అన్ని రంగాల్లో రాణించగలరు అనడానికి గోపారం వెంకట రమణమ్మే ఉదాహరణ. వార్డు వాలంటీర్ గా అందరి మన్ననలు అందుకున్న ఆమె ఇప్పుడు మున్సిపల్ చైర్ పర్సన్ గా కూడా అందరి ప్రశంసలు అందుకుంటోంది. వివాదాలు, రాజకీయాలకు దూరంగా ప్రజా సమస్యలు పరిష్కరించడంపై తన దృష్టి నిలిపింది.