ISRO Successfully Launched Agnibaan Private Rocket: దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్ 'అగ్నిబాణ్'ను (Agnibaan) భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) విజయవంతంగా ప్రయోగించింది. షార్‌లోని (SHAR) ప్రైవేట్ లాంచ్ పాడ్ నుంచి గురువారం ఉదయం 7:15 గంటల సమయంలో రాకెట్‌ను సక్సెస్ ఫుల్‌గా ప్రయోగించారు. ఇస్రో ఛైర్మన్ సోమ్ నాథ్ ప్రయోగ ప్రక్రియను పర్యవేక్షించారు. చెన్నైకు చెందిన అగ్నికుల్ కాస్కోస్ స్టార్టప్ సంస్థ.. భూమికి 700 కిలోమీటర్ల ఎత్తులోని భూ కక్ష్య 300 కిలోలలోపు ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపేందుకు ఈ ప్రయోగం చేపట్టింది. గతంలో సాంకేతిక కారణాలతో ఈ ప్రయోగం నాలుగుసార్లు వాయిదా పడగా.. ఐదోసారి విజయవంతంగా నింగిలోకి ప్రవేశపెట్టారు. ఈ రాకెట్ దేశంలోనే తొలి సెమీ క్రయోజనిక్ ఇంజిన్ ఆధారిత రాకెట్‌గా ఇది రికార్డులకెక్కింది. దేశీయంగా రూపొందించిన 3డీ ప్రింటెడ్ ఇంజిన్‌ను ఇందులో ఉపయోగించారు.






అసలేంటీ పరీక్ష.?


చెన్నై ఐఐటీ కేంద్రంగా పని చేసే 'అగ్నికుల్' సంస్థ 'అగ్నిబాణ్' పేరిట తొలిసారి సబ్ - ఆర్బిటాల్ టెక్నాలజీ డెమానిస్ట్రేటర్ ప్రయోగాన్ని నిర్వహించింది. ఈ ప్రయోగం సక్సెస్‌తో ప్రపంచ అంతరిక్ష మార్కెట్లను ఒడిసిపట్టేలా మరో కీలక ముందడుగు పడినట్లయింది. ఈ ప్రైవేట్ రాకెట్ ప్రయోగం దాదాపు 2 నిమిషాల పాటు సింగిల్ స్టేజ్‌లోనే జరిగింది. ప్రపంచంలోనే తొలిసారి తయారుచేసిన సింగిల్ పీస్ త్రీడీ ప్రింటెడ్ సెమీ క్రయోజనిక్ ఇంజిన్‌ను అమర్చారు. దీనిపై అగ్నికుల్ కాస్మోస్‌కు పేటెంట్ ఉండగా.. సబ్ కూల్డ్ ద్రవ ఆక్సిజన్ ఆధారంగా ఒక స్టేజిలోనే పనిచేసింది. ఈ వ్యవస్థను పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేశారు. దీర్ఘ వృత్తాకార ముక్కుతో ఉన్న ఈ రాకెట్ పొడవు 6.2 మీటర్లు కాగా.. దీని లోపలే ఉపగ్రహాన్ని అమర్చారు. ఈ రాకెట్‌లో తొలిసారి ఐథర్‌నెట్ ఆధారంగా పని చేసే ఏవియానిక్స్ వ్యవస్థను ఉపయోగించారు. పూర్తి దేశీయంగా అభివృద్ధి చేసిన ఆటో పైలెట్ కంట్రోల్ సిస్టమ్ ను ఇందులో పూర్తిగా వినియోగించారు. 


ప్రయోగం అదుపు తప్పితే వెంటనే దాన్ని నాశనం చేసేలా ఇస్రో అభివృద్ధి చేసిన టర్మినేషన్ వ్యవస్థను కూడా ఇందులో అమర్చారు. వివిధ లాంచర్ల నుంచి ప్రయోగించేలా దీన్ని నిర్మించారు. 300 కిలోల బరువున్న ఉపగ్రహ ప్రయోగాల కోసం అగ్నికుల్ నిర్మించిన రాకెట్ సరిపోతుందని ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.


2 నిమిషాలే ప్రయోగం


'అగ్నిబాణ్' రాకెట్ ప్రయోగం మొత్తం దాదాపు 2 నిమిషాల్లోనే పూర్తైంది. ప్రయోగం ముగిసిన అనంతరం రాకెట్ సముద్రంలో కూలిపోయింది. శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో తొలి ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ ఏఎల్‌పీ - 01 (ALP-01) ఈ ప్రయోగానికి వేదికగా మారింది. ప్రైవేట్ రాకెట్ ప్రయోగించిన 4 సెకన్లలోనే నిర్ణీత దిశకు మళ్లి.. 1.29 సెకన్ల సమయానికి నిర్దేశిత ప్రదేశానికి చేరుకుంది. అనంతరం అక్కడి నుంచి సముద్రంలో పడిపోయింది. 


గతంలో పలుమార్లు వాయిదా


వాస్తవానికి ఈ ప్రయోగం నెలన్నర క్రితమే జరగాల్సి ఉంది. ఈ ఏడాది మార్చి 22న తొలిసారి ఈ ప్రయోగానికి సిద్ధం చేశారు. అయితే, చివర్లో సాంకేతిక లోపంతో ప్రయోగం నిలిచిపోయింది. మళ్లీ ఏప్రిల్ 6న మరోసారి ప్రయోగం చేపట్టేందుకు సిద్ధం కాగా.. సాంకేతిక, వాతావరణ అనుకూల పరిస్థితులు అనుకూలంగా లేక మళ్లీ వాయిదా పడింది. ఇలా నాలుగుసార్లు వాయిదా అనంతరం ఐదోసారి విజయవంతంగా రాకెట్ ప్రయోగించారు. ప్రయోగం విజయవంతం కావడంపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అగ్నికుల్ సంస్థను అభినందించారు.


Also Read: CM Jagan: వివాదాలు విప్లవాత్మక నిర్ణయాలు- జగన్ సర్కార్‌కు ఐదేళ్లు- సరిగ్గా ఇదే రోజు సీఎంగా ప్రమాణం