AP Election Votes Counting: ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల లెక్కింపునకు సమయం దగ్గరపడుతోంది. కౌంటింగ్‌కు మరో నాలుగు రోజుల సమయం ఉండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఒకింత ఆసక్తి, ఆందోళన, భయం నెలకొని ఉంది. ఏపీ ఫలితాల కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఎవరు గెలిచారు? ఎవరు ఓడారో తెలియాలంటే లెక్కింపు జరగాల్సిందే. మరి లెక్కింపు రోజు ఏంజరుగుతుంది? ఓట్లను ఎలా లెక్కిస్తారో తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం పదండి..
ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం
ఏపీలో జూన్ 4న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. సైనికదళాల్లో పనిచేసే సర్వీసు ఓటర్లు, పోస్టల్ బ్యాలట్ ఓట్లు లెక్కిస్తారు. వీటి లెక్కింపునకు సాధారణంగా అరగంటకు మించి సమయం పట్టదు. ఒక వేళ అరగంట కంటే ఎక్కువ సమయం పడితే ఓ వైపు వాటిని లెక్కిస్తూనే 8.30కు ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభింస్తారు. ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మధ్యాహ్నం 3-4 గంటలకు లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది. దీని తరువాత వీవీ పాట్‌ల లెక్కింపు ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియ నాలుగు దశల్లో సాగుతుంది.
అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌ల ఓపెన్
ఓట్ల లెక్కింపు విధుల్లో ఉన్న సిబ్బంది ఉదయం 4 గంటలకే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. ఉదయం 5 గంటలకు అధికారులు విధులు కేటాయిస్తారు. తరువాత ఆ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి కౌంటింగ్ సిబ్బందితో కౌంటింగ్ గోప్యతపై ప్రమాణం చేయిస్తారు. తరువాత పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్‌రూంలను తెరిచి ఈవీఎంలను లెక్కింపు టేబుళ్లపైకి చేరుస్తారు.
పోస్టల్ ఓట్ల లెక్కింపు
ఓట్ల లెక్కింపులో భాగంగా తొలుత సైనిక దళాల్లో పనిచేసే వారి సర్వీసు ఓట్లు, ఆ తర్వాత పోస్టల్ ఓట్లు లెక్కిస్తారు. ప్రతి 25 పోస్టల్ బ్యాలట్ పత్రాలను ఒక కట్టగా కడతారు. ఒక్కో కౌంటింగ్ టేబుల్‌కు ఒక రౌండ్‌కు గరిష్ఠంగా 20 కట్టలు కేటాయిస్తారు. అలాగే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఈవీఎంల ఫలితాలను ప్రకటించకూడదు. ఓట్ల లెక్కింపు జరిగే ప్రతి టేబుల్ వద్ద అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, కౌంటింగ్ సూపర్‌వైజర్లు, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు, ఒక మైక్రో అబ్జర్వర్‌ను ఎన్నికల కమిషన్ నియమిస్తుంది.
అసలు కథ ప్రారంభమయ్యేది అప్పుడే
ఈవీఎం ఓట్ల లెక్కింపు కోసం ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 14 చొప్పున కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేస్తారు. పోలింగ్ కేంద్రాల సీరియల్ నంబర్ ఆధారంగా ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు చేపడతారు. పోలింగ్ కేంద్రం సీరియల్ సంఖ్యకు అనుబంధంగా ఏ, బీ, సీ లాంటి బై నెంబర్లు ఉంటే వాటిని విడిగా ఒక పోలింగ్ కేంద్రంగానే పరిగణిస్తారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎం బ్యాటరీ పనిచేయకపోయినా, మొరాయించినా, తెరిచేందుకు అవకాశం లేకపోయినా వాటిని పక్కన పెట్టేసి దాని తర్వాత వచ్చే సీరియల్ నంబర్‌లో ఉన్న పోలింగ్ కేంద్రాల ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. మొత్తం ఈవీఎంల ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక మొరాయించిన ఈవీఎంలలోని వీవీప్యాట్ చీటీలను లెక్కిస్తారు. వాటి ఆధారంగా ఓట్లను పరిగణనలోకి తీసుకుంటారు.
ఉదాహరణకు ఒక్కో నియోజకవర్గానికి 14 కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేశారని అనుకుందాం. నియోజకవర్గంలో సీరియల్ నంబర్ 1-14 వరకూ ఉన్న పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలలోని ఓట్లను తొలుత లెక్కిస్తారు. వాటన్నింటి లెక్కింపు పూర్తయితే ఒక రౌండ్ పూర్తయినట్టు భావిస్తారు. ఆ తర్వాత సీరియల్ నంబర్ 15 నుంచి 29 వరకూ ఉన్న పోలింగ్ కేంద్రాల ఈవీఎంలలోని ఓట్లు లెక్కిస్తారు. అప్పుడు రెండో రౌండ్ పూర్తయినట్లు భావిస్తారు.
వీవీప్యాట్‌ల లెక్కింపు
ఈవీఎంల ఓట్ల తుది రౌండ్ లెక్కింపు మొత్తం పూర్తయిన తరువాత, వాటిని సరిచూసుకుని నిర్ధారించుకున్న తర్వాత వీవీ ప్యాట్ చీటీల లెక్కింపు ప్రారంభమవుతుంది. నియోజకవర్గం పరిధిలో ఎన్ని పోలింగ్ కేంద్రాలుంటే అన్ని సంఖ్యలను కాగితంపై రాసి లాటరీ విధానంలో అయిదు కార్డులు తీస్తారు. మొరాయించిన ఈవీఎంల పోలింగ్ కేంద్రాలను, మాక్ పోల్ వీవీ ప్యాట్ చీటీలను తొలగించని పోలింగ్ కేంద్రాలను లాటరీ నుంచి మినహాయిస్తారు. లాటరీ విధానంలో ఎంపికచేసిన ఐదు కేంద్రాల వీవీ ప్యాట్‌లను బయటకు తీస్తారు. ప్రత్యేకంగా మెష్‌తో ఒక బూత్‌ను ఏర్పాటు చేసి వీవీ ప్యాట్లను లెక్కిస్తారు. ఈవీఎంలలో అభ్యర్థులకు నమోదైన ఓట్లకు, వీవీ ప్యాట్ చీటీల్లో వచ్చిన ఓట్లకు మధ్య వ్యత్యాసమొస్తే రెండోసారి, మూడోసారి లెక్కిస్తారు. వీవీ ప్యాట్ చీటీల లెక్కింపును రిటర్నింగ్ అధికారి/అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి సొంతంగా నిర్వహిస్తారు. అప్పటికీ తేడా వస్తే వీవీ ప్యాట్ చీటీల్లోని ఓట్లనే పరిగణనలోకి తీసుకుని తుది ఫలితాలు ప్రకటిస్తారు.
ఒక్కో రౌండ్‌కు గరిష్టంగా 30 నిమిషాలు
ఒక్కో రౌండ్ లెక్కింపునకు గరిష్ఠంగా 30 నిమిషాల సమయం పడుతుంది. తక్కువ ఓట్లు ఉన్న ఈవీఎంలు ఉంటే ముందుగానే పూర్తి అవ్వొచ్చు. ఒక్కో నియోజకవర్గానికి 14 కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేస్తారు. ఆయా నియోజకవర్గాల పరిధిలో ఉన్న పోలింగ్ కేంద్రాలు, వాటి పరిధిలో పోలైన ఓట్ల సంఖ్యను బట్టి ఎన్ని రౌండ్లు కౌంటింగ్ జరుగుతుంది? ఎంత సమయం పడుతుంది అనేది ఆధారపడి ఉంటుంది. ఉదయం 12 గంటలకు దాదాపు ఐదు రౌండ్ల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
ఎంత మంది కౌంటింగ్ ఏజెంట్లు ఉండొచ్చు?
ప్రతి అభ్యర్థి టేబుల్‌కు ఒకరి చొప్పున కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకోవచ్చు. వీరికి అదనంగా రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్ద ఉండేందుకు ఒక ఏజెంటును ఏర్పాటు చేసుకోవచ్చు. పోస్టల్ బ్యాలట్లను సైతం పరిశీలించుకునేందుకు అభ్యర్థులు వారి తరఫున ప్రత్యేకంగా కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకోవాల్సి ఉంటుంది. భద్రత, గోప్యత కారణంగా కౌంటింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లను అనుమతించరు. కౌంటింగ్ కేంద్రాలు అన్నీ నిరంతరం సీసీ కెమెరాల నిఘాలో ఉంటాయి.