T20 World cup Records Most sixes in an innings:  టీ20 ప్రపంచకప్‌(T20 world cup)లో బ్యాట్స్‌మెన్ సత్తా చాటేవి అతడి వక్తిగత స్కోర్లే. భారీ స్కోరు చేయాలంటే బాల్‌పై పగపట్టినట్లు బ్యాటర్ చెలరేగిపోలి. బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడాలి. ప్రతి బంతిని కసితీరా కొట్టాలి. బౌండరీల మోత మోగించాలి. పదే పదే స్టాండ్స్‌లోకి బంతిని పంపాలి. అలా టీ20 ప్రపంచకప్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన ఆటగాళ్లు చాలా మందే ఉన్నారు. వారిలో మన భారత ఆటగాళ్లు కూడా ఉన్నారు.


గేల్ -జేగేల్ 


పొట్టి ప్రపంచకప్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన వారిలో మొదటి స్థానం యూనివర్సల్ బాస్ క్రిస్‌గేల్‌దే(Chris Gayle).  ఇంకా చెప్పాలంటే రెండో స్థానం కూడా అతడిదే. 2016 మార్చి 16న ఇంగ్లండ్‌తో వాంఖడేలో జరిగిన మ్యాచ్‌లో క్రిస్ గేల్‌ ఒకే ఇన్నింగ్స్‌లో 11 సిక్స్‌లు బాదాడు. ఆ మ్యాచ్‌లో అతడు 48 బంతిల్లోనే శతకం సాధించాడు. అదే గేల్ తొలి టీ20 ప్రపంచకప్‌లో నెలకొల్పిన రికార్డు ఇంకా పదిలంగానే ఉంది. 2007 సెప్టెంబరు 11న దక్షిణాఫ్రికాతో జొహనెస్‌బర్గ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో గేల్ పది సిక్స్‌లు కొట్టాడు. మూడో స్థానంలో దక్షిణాఫ్రికా ఆటగాడు రోసౌ(Rilee Rossouw) ఉన్నాడు. 2022 అక్టోబరు 27న సిడ్నిలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోసౌ 8 సిక్స్‌లు బాదాడు.


 సింగ్ ఈజ్ కింగ్ 


టీ20 ప్రపంచకప్‌ ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన నాలుగో ఆటగాడు యువరాజ్ సింగే(Yuvraj Singh). అసలు సిక్సర్ల సునామీ సృష్టించే ఒరవడికి శ్రీకారం చుట్టిందే మన యువరాజ్. తొలి టీ20 ప్రపంచకప్‌లో 2007 సెప్టెంబరు 19న డర్బన్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ సింగ్‌….. ఏకంగా ఏడు సిక్స్‌లు బాదాడు. స్టువర్ట్ బ్రాడ్ విసిరిన ఒకే ఓవర్‌లో అన్నిబంతులు సిక్స్‌లు కొట్టి చరిత్ర సృష్టించిన మ్యాచ్ అదే. అన్నట్టు ఈ సిక్సర్ల కింగ్ టీ 20 ప్రపంచకప్ 2024కి బ్రాండ్ అంబాసిడర్‌ కూడా. ఆ మ్యాచ్ లోనే 16 బంతుల్లోనే 7 సిక్సర్లతో  58 పరుగులు చేసి  అదరగొట్టేశాడు. 


ఆస్ట్రేలియా హిట్టర్‌ డేవిడ్ వార్నర్‌( 2010 మే 7న బ్రిడ్జ్‌టౌన్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడు సిక్స్‌లు కొట్టాడు. అదే బ్రిడ్జ్‌టౌన్ వేదికగా 2010 సెప్టెంబరు 9న భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో విండీస్‌ బ్యాటర్ క్రిస్ గేల్‌ ఏడు సిక్స్‌లు కొట్టి రికార్డు నెలకొల్పాడు. 2012 సెప్టెంబరు 21న బంగ్లాదేశ్‌తో పల్లెకెల వేదికగా జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆటగాడు బ్రెండన్ మెక్‌కలమ్‌ ఏడు సిక్స్‌లను కొట్టాడు. 2012 సెప్టెంబరు 28న కొలంబోలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్‌ షేన్ వాట్సన్ ఏడు సిక్స్‌లతో అదరగొట్టాడు. 2014 మార్చి 21న ఐర్లాండ్‌తో జరిగిన పోరులో నెదర్లాండ్స్‌ ఆటగాడు మైబర్గ్‌ ఒకే ఇన్నింగ్స్‌లో ఏడు సిక్స్‌లు బాదాడు. 2021 నవంబరు 3న దుబాయ్‌లో స్కాట్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ క్రికెటర్‌ గప్తిల్‌ ఏడు బంతులను స్టాండ్స్‌లోకి పంపాడు. 2022 నవంబరు 10న ఆడిలైడ్ వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లీష్ బ్యాటర్‌ ఏడీ హేల్స్‌ ఏడు సిక్స్‌లు కొట్టాడు.