Most catches Records in ICC Mens T20 World Cup: చేసేపనిపై మనం పెట్టె దృష్టే ఆపనిలో మనకి  పరిపూర్ణతని ఇస్తుంది. క్రికెట్ బ్యాటింగ్ , బౌలింగ్ చేసేవాళ్ళే కాదు ఫీల్డింగ్ చేసేవాళ్ళు కూడా అదే శ్రద్ధతో ఉండాలి. సెకెన్లలో స్పందిని బంతిని అడ్డుకున్నప్పుడే అది అద్భుతమైన ఫీల్డింగ్ అవుతుంది. జట్టుకి విజయాన్ని అందిస్తుంది. 


మైదానంలో చిరుత పులులు 


జయాపజయాలను మార్చేసే క్యాచ్‌లతో టీ20 ప్రపంచకప్‌లో అనేక రికార్డులు నమోదై ఉన్నాయి. వారిలో చాలా మందే ఉన్నారు.  టీ 20 ప్రపంచకప్‌లో ఇప్పటివరకూ జరిగిన అన్ని సీజన్‌లలో అత్యధిక క్యాచ్‌ల రికార్డు దక్షిణాఫ్రికా ప్లేయర్‌ ఏబీ డివిలియర్స్(AB de Villiers) పేరు మీదే ఉంది. వికెట్‌ కీపర్ కూడా అయిన డివిలియర్స్‌ 2007 నుంచి 2016 వరకూ 30 మ్యాచ్‌లో 25 ఇన్నింగ్స్‌లు ఆడి 23 క్యాచ్‌ లు పట్టాడు.  పొట్టి ప్రపంచకప్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 3 క్యాచ్‌లు పట్టిన రికార్డు కూడా అతని సొంతం. ఏబీ డి తన శరీరాన్ని అమాంతం గాల్లో లేపి డైవ్ కొట్టి కాచ్ అందుకున్న సందర్భాలెన్నో. 


టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటివరకు అత్యధిక క్యాచ్‌లు పట్టిన రెండో ఆటగాడిగా ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ వార్నర్‌(DA Warner) పేరిట రికార్డు ఉంది. 2009 నుంచి 2022 వరకూ 34 మ్యాచ్‌లలో 21 క్యాచ్‌లను వార్నర్‌ అందుకున్నాడు. న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ గప్తిల్‌(MJ Guptill ) ఈ లిస్ట్‌లో 3వ స్థానంలో ఉన్నాడు. 2009 నుంచి 2021 వరకూ 28 ఇన్నింగ్స్‌లలో 19 క్యాచ్‌లను గప్తిల్ పట్టాడు. ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఆస్ట్రేలియా ఆటగాడు మ్యాక్స్‌వెల్‌ ( Maxwell) నిలిచాడు. 2012 నుంచి 2022 వరకూ టీ20 ప్రపంచకప్‌ ఆడిన మ్యాక్స్‌వెల్‌ 24 మ్యాచ్‌లలో 16 క్యాచ్‌లను అందుకున్నాడు.


మన హిట్ మ్యాన్ తక్కువేం కాదు.. 


పొట్టి ప్రపంచకప్‌లో 16 క్యాచ్‌లతో ఈ జాబితాలో రోహిత్ శర్మ(Rohit  Sharma) ఐదో స్థానంలో ఉన్నాడు. 2007 నుంచి 2022 వరకూ ప్రతి టీ20 ప్రపంచకప్‌లో పాల్గొన్న రోహిత్ 39 మ్యాచ్‌లలో 16 క్యాచ్‌ల ఘనత సాధించాడు. బాల్ క్యాచ్‌కి అనుకూలంగా ఉందని తెలిసినప్పుడు అతిత్వరగా రియాక్ట్ అవ్వటం రోహిత్ స్పెషాలిటీ.  లిస్ట్‌లో తర్వాత ఉన్నది న్యూజిలాండ్ క్రికెటర్‌ కేన్ విలియమ్‌సన్‌. 2012 నుంచి 2022 వరకూ టీ20 ప్రపంచకప్‌లో 25 మ్యాచ్‌లలో అతడు 15 క్యాచ్‌లను ఒడిసి పట్టాడు. విండీస్ ఆటగాడు డ్వేన్ బ్రావో టీ20 ప్రపంచకప్‌ లో 15 క్యాచ్‌లతో ఆరో ర్యాంకులో నిలిచాడు. 2007 నుంచి 2021 వరకూ 34 మ్యాచ్‌లు ఆడిన బ్రావో 15 క్యాచ్‌లను అందుకున్నాడు.


ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్‌ 2010 నుంచి 2022 వరకూ 19 మ్యాచ్‌లు ఆడి 14 క్యాచ్‌లు పట్టుకున్నాడు. న్యూజిలాండ్ ఆటగాడు రాస్ టేలర్ 2007 నుంచి 2016 వరకూ పొట్టి ప్రపంచకప్‌లో ఆడాడు. 28 ఇన్నింగ్స్‌లలో 14 క్యాచ్‌లను ఒడిసిపట్టాడు. కివీస్‌ కే చెందిన మరో ఆటగాడు నాథన్ మెక్‌కలమ్‌ 2007 నుంచి 2016 వరకూ 22 మ్యాచ్‌లు ఆడి 13 క్యాచ్‌లు పట్టాడు. శ్రీలంక క్రికెటర్‌ మహేల జయవర్దనే ఈ జాబితాలో పదో ర్యాంకులో ఉన్నాడు. 2007 నుంచి 2014 వరకూ టీ 20 ప్రపంచకప్‌లో లంకకు ప్రాతినిథ్యం వహించిన జయవర్దనే 31 మ్యాచ్‌ల్లో పాల్గొని 13 క్యాచ్‌లను అందుకున్నాడు.